మన్నెం వీరుడు..మన అగ్గి పిడుగు అల్లూరి..

అగ్గి పిడుగు. మన్నెం విప్లవ వీరుడు. తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీర కిశోరం మన అల్లూరి సీతారామ రాజు. భారత స్వాతంత్ర ఉద్యమాన్ని విప్లవ పథం వైపు నడిపిన యోధుడు. భరత మాత దాస్య శృంఖలాలను తెంచడానికి సాగిన సమరంలో ప్రాణ త్యాగం చేసిన అసమాన శూరుడు.

మన్నెం వీరుడు..మన అగ్గి పిడుగు అల్లూరి..
Follow us

|

Updated on: May 07, 2020 | 1:39 PM

అగ్గి పిడుగు. మన్నెం విప్లవ వీరుడు. తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీర కిశోరం మన అల్లూరి సీతారామ రాజు. భారత స్వాతంత్ర ఉద్యమాన్ని విప్లవ పథం వైపు నడిపిన యోధుడు. భరత మాత దాస్య శృంఖలాలను తెంచడానికి సాగిన సమరంలో ప్రాణ త్యాగం చేసిన అసమాన శూరుడు. మన్యం ప్రజల మాన ప్రాణ రక్షణకు తెల్ల దొరలను ఎదిరించిన యువ కిశోరం సీతారామరాజు. ఆ మహావీరుడు సాగించిన సంగ్రామం గిరిజన జాతికే కాదు భారత దేశానికి ఆదర్శప్రాయం.

అల్లూరి సీతారామరాజు చరిత్ర ఒక తెలుగుగాధ. ఆ వీరుడి పోరును గేయాలు, గీతాలు, పద్యాలుగా, బుర్ర కథలుగా, నాటకాలుగా ప్రచారంలోకి వచ్చాయి. తెలుగు యువతలో ఉత్సాహం, ఉత్తేజాన్ని నింపాయి. వారిలో త్యాగ నిరతి, దేశ భక్తిని పెంపొందింపజేశాయి. ఆ వీరుని చరిత్రను ఎంతో మంది చరిత్ర కారులు, పరిశోధకులు, కథకులు, రచయితలు, కవులు, కళాకారులు వెలుగులోకి తెచ్చారు. ఇంకా తెస్తూనే ఉన్నారు. అయినా ఇంకా సీతారామరాజు చరిత్ర పై ఎన్నో కొత్త కోణాలు వస్తూనే ఉన్నాయి.

అల్లూరి అసలు పేరు అల్లూరి శ్రీరామరాజు. చరిత్ర పురుషుడైన సీతారామరాజు 1897 జులై4న విశాఖ జిల్లా పద్మనాభ మండలం పాండ్రంగి గ్రామంలో అమ్మమ్మ ఇంట జన్మించారు. తల్లి సూర్యనారాయణమ్మ. తండ్రి వెంకటరామరాజు. తండ్రి శ్రీరామరాజు పేరే తన సంతానికి పెట్టుకుంది తల్లి సూర్యనారాయణమ్మ. తరువాత శ్రీరామరాజు పేరు కాస్త సీతారామరాజుగా మారింది. బ్రిటీష్ సేనానులు స్కార్ట్ కవర్ట్, హైటర్ లను నేల కూల్చాక రాసిన లేఖలో సీతారామరాజు తనను తాను శ్రీరామ రాజుగానే అభివర్ణించుకున్నాడు.

శ్రీరామరాజు పేరులో శ్రీకి బదులు సీతా చేరడం పై భిన్న వాదనలున్నాయి. స్వాతంత్ర పోరాట కాలంలో బ్రిటీష్ వారి కార్యకలాపాలు గిరిజన ప్రాంతమైన భద్రాచలం కేంద్రంగా సాగేవి. భద్రాద్రి సీతారాముల పేరును తరుచు ఉచ్చరించే తెల్లదొరలు శ్రీరామరాజును సీతారామరాజుగా పలికే వారని ప్రతీతి. అదే విషయాన్ని తమ ఉన్నతాధికారులకు పంపే వర్తమానంలోను రాసేవారని తెలుస్తోంది. కొన్ని సార్లు శ్రీ రామరాజు అని, మరికొన్ని సార్లు అదే పేరును సీతారామరాజుగా రాసేవాళ్లు ఆంగ్లేయులు. క్రమంగా శ్రీ రామరాజు పేరు కాస్త సీతారామ రాజుగా మారిందనే చర్చ లేకపోలేదు. శ్రీరామరాజుకు చెల్లెలు సీత అంటే ఎంతో ప్రేమ, అనురాగం. శ్రీరామరాజు పోరాటంలో ఉండగా..సీత భర్త కన్నుమూశారు. ఆ సంఘటన అన్నను కలచి వేసింది. అందుకే శ్రీరామరాజు పేరులోని శ్రీని తొలగించి సీతారామరాజుగా మార్చుకున్నారనే వాదనుంది.

సీతారామరాజు జన్మించింది విశాఖ జిల్లా పాండ్రంగ్రి గ్రామంలోనే. అయితే ఆయన పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామమని ప్రచారం చేశారు. వాస్తవంగా సీతారామరాజు పూర్వీకులది మోగల్లు గ్రామమే. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలోను సీతారామరాజు పుట్టుకకు సంబంధించిన చర్చ జరిగింది. చివరకు శాసనసభ కమిటీ పరిశీలనలో సీతారామరాజు జననం విశాఖ జిల్లా పాండ్రంగి అని నిర్థారించారు.

సీతారామరాజు తండ్రి ఫోటో గ్రాపర్. 1908లో తండ్రి మరణంతో శ్రీ రామరాజుకు కష్టాలు మొదలయ్యాయి. ఆ కుటుంబంలో నిలకడ లేకుండా పోయింది. తమ పిల్లలను చదివించి ప్రయోజకులను చేయాలనే ఆలోచనతో తల్లి తన బంధువులున్న ఊళ్లల్లో ఉండేది. కుటుంబ పెద్ద కొడుకు సీతారామరాజును తల్లి గారాబంగా పెంచింది. అందుకే తల్లి నారాయణమ్మ అంటే శ్రీరామరాజుకు ప్రేమ ఎక్కువ.

రాజమండ్రితో సీతారామరాజుకు అనుబంధం ఎక్కువ. రాజమండ్రి డీలక్స్ సెంటర్ లో వెంకటరామరాజు ఫోటో స్టూడియో ఉండేది. ఐదేళ్ల శ్రీరామరాజు, ఏడాది వయసున్న సీతతో ఆ దంపతులు బతుకు తెరువు కోసం రాజమండ్రిలో జీవనం సాగించేవాళ్ళు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన వందేమాతర ఉద్యమ ప్రభావం రాజమండ్రి పైనా ప్రభావం చూపింది. ఆ ఉద్యమ తీరు తెన్నులను ప్రచారం చేయడానికి 1907లో బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి వచ్చారు. దేశ భక్తులు ముట్నూరి కృష్ణారావు, చిలకమర్తి లక్ష్మీ నరసింహా రావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటి వారు అక్కడిచ్చిన ఉపన్యాసం ప్రజల్లో ఉత్తేజం నింపింది. తెల్లదొరల పెత్తనాన్ని పారదోలాలంటే ఆవేశం, ఆశయం మరింత అంకురించడానికి దోహదపడింది.

వందేమాతర ఉద్యమ తీవ్రతను తమ ఫోటోలతో బంధించిన తండ్రి వెంకటరామరాజు ప్రభావం కొడుకు సీతారామరాజు పై పడింది. దేశభక్తి భావం పెంపొందింది. రాజమండ్రి పరిసరంలోని ఉల్లితోట, టీ.నగర్ ప్రాంతాల్లో అల్లూరి కుటుంబం ఉండేది. తండ్రి, కొడుకులిద్దరు గోదావరి ఒడ్డున తిరిగే వారని ఆ సమయంలోనే శ్రీ రామరాజుకు జాతీయ ఉద్యమం, స్వాతంత్ర్య కాంక్ష మొగ్గ తొడిగింది.

అల్లూరిని మార్చిన సంఘటన

ఒకరోజు ఆంగ్ల సేనా నాయకుడు ఒకరు గుర్రం పై వెళుతున్న దృశ్యాన్ని చూసిన సీతారామరాజు అప్రయత్నంగా ఆయనకు నమస్కారం పెట్టాడు. అది నచ్చని తండ్రి వెంకటరామరాజు కొడుకు చెంప చెల్లు మనిపించాడు. తెల్లదొరలకు నమస్కారం పెట్టవద్దని..వాళ్లను మన్యం ప్రాంతం నుంచి పారద్రోలి స్వేచ్చా, స్వాతంత్ర్యాన్ని సముపార్జించాలని ఉద్భోదించారు. ఆ సంఘటన సీతారామరాజులో మార్పు తెచ్చింది. రాజమహేంద్ర వరంలో ఉన్నప్పుడే శ్రీరామరాజు సోదరుడు సత్యనారాయణ రాజు జన్మించాడు. 1908లో జరిగిన గోదావరి పుష్కరాల ఫోటోలను బాగా తీశాడు తండ్రి వెంకటరామరాజు. అదే సమయంలో కలరా వ్యాధితో కన్నుమూశాడు. చిన్న తనంలోనే కుటుంబ ఆర్థిక పరిస్థితి కుంటుపడి విద్యాభ్యాసం ఒక చోట స్థిరంగా సాగలేదు. 1902లో రాజమండ్రి ఉల్లి తోట బంగారయ్య మున్సిపల్ ప్రాధమిక స్కూల్ లో ఒకటో తరగతి నుంచి ఐదు వరకు చదివాడు రాజు. భర్త మృతితో ఇబ్బంది పడ్డ నారాయణమ్మ తన పిల్లలను తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గరిలోని కొవ్వాడకు, తర్వాత భీమవరం, రాజమండ్రికి మకాం మార్చింది.

కాకినాడలోనే కాంగ్రెస్ నేత మద్దూరి అన్నపూర్ణయ్యతో రామరాజుకు పరిచయం ఏర్పడింది. ఆ పాఠశాలలోనే శశిరేఖ పరిణణయమనే నాటకం వేస్తే శశిరేఖతో పాటు..నారదుడి వేషం వేశాడు విప్లవ వీరుడు. అదే ఏడాది రామకృష్ణం రాజు తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి అంతర్వేదిలో జరిగే తిరునాళ్ళకు వెళ్లారు. పినతండ్రి రామకృష్ణం రాజుకు చెప్పకుండా సీతారామరాజు ఆ పరిసర గ్రామం చించినాడకు వెళ్లారు. గుర్రపు స్వారీ నేర్పిస్తారని తెలిసి అక్కడకు వెళ్లిన సీతారామరాజు మూడు రోజుల తర్వాత తిరిగొచ్చాడు. ఎక్కడకు వెళ్లాడో తెలియని కుటుంబ సభ్యులు ఎంతో కంగారు పడ్డారు. మూడు రోజుల తరువాత వచ్చిన రామరాజును చూసి కోపంతో ఊగిపోయాడు పినతండ్రి. అంతే చెంప చెల్లుమనిపించారు. అది నచ్చని సీతారామరాజు తుని సమీపంలోని పాయకరావు పేటకు వెళ్లారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆ కుటుంబం తిరిగి పాండ్రంగి చేరింది.

తుని హైస్కూలులో ఐదో ఫారమ్ చదువుకునేటప్పుడు ప్రధానోపాధ్యాయుడు సీతారామరాజును మందలించడమే కాదు బెత్తంతో భయం చెప్పాడు. అతి నచ్చని రాజు స్కూలుకు ఎగనామం పెట్టాడు. అటు తర్వాత సీతారామరాజు ఉత్తర భారత యాత్రకు వెళ్లాడు. బెంగాల్, బీహార్, నేపాల్, కాశీ, ప్రయాగ వంటి ప్రాంతాలను పర్యటించాడు. హిమాలయాల్లోను సంచరించాడు. అక్కడ నుంచి సాధువు వేషంలో వచ్చిన సీతారామరాజు నేరుగా కృష్ణదేవి పేట చేరుకున్నాడు. రుషికేష్, కేదారినాధ్, బదరీనాధ్, గంగోత్రి, యమునోత్రి, బ్రహ్మ కపాలం వంటి ప్రాంతాలన్నింటిని సీతారామ రాజు అనేక విషయాలను తెలుసుకున్నాడు. తన యాత్రల వల్ల సీతారామ రాజుకు లోక జ్ఞానం కలిగిది. కత్తిసాము, గుర్రపు స్వారీ, ధనుర్విద్య, తుపాకీ గురి చూసి కాల్చడం వంటివి నేర్చుకున్నాడు. అనేక ఆయుధాలను ఉపయోగించడంలో మెలకువలను నేర్చుకున్నాడు.

వేషం మార్చెను..భాష మారెను..

సంస్కృతం నేర్చుకునేందుకు బాహ్మణ బాలకుడి వలే వెళ్లిన సీతారామరాజును క్షత్రియునిగా గుర్తించారు అగ్రహారం పెద్దలు. ఆ విషయం బయటపడంతో నష్టం జరగక ముందే సీతారామరాజు తప్పించుకున్నారనే ప్రచారం లేకపోలేదు. వైద్యం, జ్యోతిష్యం, హస్త సాముద్రికలే కాదు..అన్ని రకాల క్షత్రియ విద్యలను నేర్చుకున్నారు రామరాజు. ఒక్కోసారి జపంలో కూర్చుంటే గంటల తరబడి లేచేవారు కాదని కృష్ణదేవి పేట గిరిజనుల మాట. ఆది శంకరాచార్యులు, వివేకానందుడి జీవిత చరిత్రల ప్రభావం సీతారామరాజు పై బలంగా పడింది.

విప్లవ భావాలు వీస్తున్న విషయం తెలుసుకున్న ఆంగ్ల ప్రభుత్వం 1922 జనవరిలో ఏజెన్సీకి ప్రత్యేక పోలీసు అధికారులను పంపింది. జనవరి 30న కృష్ణదేవి పేటకు వచ్చిన పోలీస అధికారి ఒకరు సీతారామరాజును పిలిపించి విచారించారు. అప్పటి డిప్యూటీ కలెక్టర్ ఫజులుల్లాఖాన్ తనకు సన్నిహితుడైన సీతారామరాజు పినతండ్రి రామకృష్ణరాజును పిలిపించారు. తాను చెబితే సీతారామరాజు ఉద్యమం ఆపుతారని చెప్పి అధికారులను ఒప్పించాడు.

రామరాజు ఆందోళనలు మానుకుంటే పైడి పుట్టలో 50 ఎకరాల భూమిస్తామని ఆంగ్ల అధికారులు ప్రస్తావించారు. ఇందుకు రామకృష్ణ రాజునే కాదు..ఫజులుల్లాఖాన్ లు అంగీకరించి..తల్లి సూర్యనారాయణమ్మను ఒప్పించారు. ఇక కొడుకును ఒప్పించే బాధ్యతను తల్లికే అప్పగించారు. అనేక సార్లు కుమారుడితో మాట్లాడిన సూర్యనారాయణమ్మ కోరికను కాదనలేకపోయాడు సీతారామరాజు. మాతృదేవోభవ అని బలంగా నమ్మే సీతారామరాజుకు భూమి తీసుకోవడం ఇష్టం లేకపోయినా..తల్లి కోసం సమ్మతించాడు. సీతారామరాజు పైడి పుట్ట నుంచి యుద్ధానికి వ్యూహ రచన చేస్తాడని బ్రిటీష్ వాళ్లు ఊహించలేకపోయారు.

కొన్నాళ్ల తర్వాత నేపాల్ కు వెళ్లి పోతున్నానని..ఇందుకు అనుమతించాలని ఆంగ్లేయులకు అర్జీ పెట్టుకున్నాడు సీతారామరాజు. యుద్దానికి సన్నద్దమైన సీతారామరాజు సరైన అవకాశం కోసం ఎత్తులు వేశాడు. 1879-80లలో వచ్చి రంప తిరుగుబాటు మాదిరిగా గిరిజనులందిరినీ ఏకతాటి పైకి తెచ్చాడు సీతారామరాజు. వారికి అన్ని రకాల విద్యలను నేర్పి అసలు సిసలు పోరాటానికి సన్నద్దం చేసాడు అల్లూరి. అడవి తల్లి పై ఆధారపడ్డ బిడ్డలను ఆ భూములు, పండ్లు, ఫలాల పై హక్కు లేకపోవడాన్ని వెలుగెత్తి ప్రశ్నించేలా తీర్చిదిద్దాడు వారిని. అదే పెద్ద ఉద్యమానికి నాందీ అయింది. బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించేలా చేసింది.

సాధువు వేషంలో కృష్ణదేవి పేటకు వచ్చిన సీతారామరాజును ఆ ప్రాంతానికి చెందిన భాస్కరనాయుడు కుటుంబం ఆదరించింది. అక్కడ ఉంటున్నప్పుడే తల్లి నారాయణమ్మకు లేఖ రాశాడు అల్లూరి. తాను క్షేమంగా ఉన్నాననేది దాని సారాంశం. అప్పటి వరకు కొడుకు జాడ లేక తల్లిడిల్లిన నారాయణమ్మ పరుగున వచ్చి సీతారామరాజు వద్ద వాలింది. ఆ తల్లికొడుకులను కలిపిన ఘనత మాత్రం భాస్కరనాయుడు కుటుంబానికే దక్కుతుంది. వారి కోసం ఊరి చివరన తాండవ నది ఒడ్డు శ్రీజయరామ నగరం అనే చిన్న వాడను నిర్మించారు స్థానికులు. అక్కడే గంటం దొర, మల్లుదొరలు సీతారామరాజును కలిసేవారు. భవష్యత్ లో జరగబోయే పోరాటానికి తాము సిద్దమని ప్రకటించారు వాళ్లు. అది తెలుసుకున్న గిరిజన గ్రామాల ప్రజలు తండోప తండాలుగా వచ్చి రామరాజును కలిసి తమ మద్దతు ప్రకటించేవాళ్లు.

తెల్ల దొరలకు నిద్ర లేని రాత్రులు

దేశానికి స్వాతంత్ర్యం రాకముందే మన్యం ఏజెన్సీని స్వతంత్ర్యం చేయాలని తలపోశాడు సీతారామరాజు. వ్యూహంలో భాగంగా 1922 ఆగస్టు 15న గాం గంటం దొర, మల్లు దొర గ్రామమైన నడింపాలెంలో సీతారామ సేనలు సమావేశమయ్యాయి. ఆంగ్లేయులను ఎదుర్కోవాలంటే సాయుధ పోరాటమే శరణ్యమని భావించారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ల పై దాడులు చేసి ఆయుధాలు సేకరించాలని తీర్మానించారు. ఆగస్టు 22న చింతపల్లి, 23న కృష్ణదేవి పేట, 24న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పైనా దాడులు చేశాయి గిరిజన సైన్యాలు. రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లో బందీగా ఉన్న వీరయ్య దొరను విడిపించారు. ఆ తర్వాత వీరయ్య దొరనే గిరిజన పోరాటంలో అగ్రభాగాన నిలిచాడు. పోలీస్ స్టేషన్ల పై దాడులు చేసే ముందు బాణం టపాకాయిలతో సమాాచరం చేరవేసేవాళ్లు. దాడులు చేశాక ఎన్ని ఆయుధాలను ఎత్తుకెళ్లామన్న విషయాన్ని సీతారామరాజు బృందం అక్కడున్న రికార్డుల్లో రాసేది. ఈ రాతలో చివరిగా తన పేరును ప్రస్తావించేవారు సీతారామరాజు. వరుస దాడులతో బ్రిటీష్ సేనలకు ముచ్చెమటలు పట్టేవి.

విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున సేనానులను మోహరించింది ఆంగ్ల ప్రభుత్వం.వారికి జైపూర్ రాజులు సాయంగా ఆహారమే కాదు..సైనికులు, గుర్రాలు, ఏనుగులను పంపేవాళ్లు. అయినా సీతారామరాజు దళం భయపడలేదు. 1922 అక్టోబర్ 17న అడ్డతీగల, 19న రంప చోడవరం పోలీస్ స్టేషన్ల పై దాడులు చేసి భారీగా ఆయుధాలు తీసుకెళ్లారు విప్లవవీరులు. చివరిగా 1923 ఏప్రిల్ 17న అన్నవరం పోలీస్ స్టేషన్ పై దాడి చేసింది రామరాజు సైన్యం. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన తెల్లదొరల సైన్యం అల్లూరి సీతారామరాజును పట్టుకునేందుకు విఫలయత్నం చేసింది. అన్నవరానికి రామరాజు వచ్చాడని తెలుసుకుని ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. నర్సీపట్నం, అడ్డతీగల, ఏలేశ్వరాల్లో పెద్ద ఎత్తున ఆంగ్లసేనానులు కవాతు నిర్వహించారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించారు. సీతారామరాజు గానీ ఆయన అనుచరులు గానీ కనిపిస్తే కాల్చి వేయమని ఆదేశాలొచ్చాయి. ఉన్నతాధికార్ల నుంచి ఆ తర్వాత మలబారు, అస్సాం రైఫిల్స్ దళాలను రంగంలోకి దింపింది ఆంగ్ల ప్రభుత్వం. మద్రాసు గవర్నర్ వెల్లింగ్ టన్ ఆదేశాలతో గిరిజనుల పై హింస ఎక్కవైంది. మహిళల పై అత్యాచారాలు పెరిగాయి. తన చేపట్టిన ఉద్యమం తమ ప్రజలకే ముప్పుగా మారిందనే సత్యాన్ని గ్రహించాడు సీతారామరాజు. 1922 నుంచి 1924 వరకు గిరిజన ఉద్యమం బ్రిటీష్ వారి గుండెల్లో అలజడి రేపింది. ఉద్యమంతో పంటలు వేయలేదు. అంతా నిర్వేదం, తినడానికి గింజలు లేవు. సైనికుల కవాతతో గిరిజన గూడెల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి.

అల్లూరి సీతారామరాజు దళం-బ్రిటీష్ సైనానులకు మధ్య 1924 మే 1 నుంచి 6 వరకు తుది పోరు సాగింది. ఆ సంఘటనలో రాజవొమ్మంగి మండలం కొండపల్లిలో వేగిరాల సత్యనారాయణ రాజు అలియాస్ అగ్గిరాజు బ్రిటీష్ సైన్యానికి చిక్కాడు. వారి నుంచి తప్పించుకున్న సీతారామరాజు ఆయన అనుచరులు తలో దిక్కు పారిపోయారు. వారి కోసం బ్రిటీష్ సేనలు చుట్టుముట్టాయి. 1924 మే6 రాత్రికి సీతారామరాజు ఒక్కరే కొత్త రేవళ్ల గ్రామం మీదుగా మంపా అనే ఊరికి చేరారు. అక్కడే పొలంలో ఉన్న చిన్న మంచె పై చేరి కాస్త సేదదీరాడు. తెల్లారి స్నానం చేసేందుకు ఏటి గట్టుకు వెళ్లాడు సీతారామరాజు. అక్కడి నీటి కుంటలో స్నానం చేస్తుండగా..దిగువనే మాటు వేసిన ఈస్ట్ కోస్ట్ జమేదార్ కంచు మీనన్, ఇంటిలిజెన్స్ అధికారి ఆల్వార్ నాయకుడు సీతారామరాజును చుట్టు ముట్టారు. ఎలాంటి ప్రతి ఘటన లేకుండానే ఆ విప్లవ జ్యోతి వారి చేతికి చిక్కాడు. అది బ్రిటీష్ ముష్కరులకు ఊపిరి పీల్చుకునేలా చేసేంది. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఎలా చిక్కాడంటే…?

ఆ విషయాన్ని వెంటనే ఉన్నతాధికార్లకు అతని పిన తండ్రి ద్వారా చేరవేశారు. తాము సీతారామరాజును సజీవంగానే పట్టుకున్నామని చెప్పుకున్నారు. అదే అదును కోసం ఎదురు చూస్తున్న అస్సాం రైపిల్స్ దళం అధ్యక్షులు గుడాల్ అక్కడకు చేరడం క్షణాల్లో జరిగిపోయింది. ఆ అస్సాయుకుడ్ని నులక మంచం పై కట్టేసి కృష్ణదేవి పేటకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అక్కడకు వెళ్లే దారిలో రాజేంద్రపాలెం వెళ్లే క్రమంలో గుడాల్ కు మరో ఆలోచన తట్టింది. అక్కడకు వెళితే ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో సమీపంలోనే మంచాన్ని కిందకు దించారు. చెట్టుకు కట్టేసి ఇష్టమున్న దేవుడ్ని తలచుకోవాలని సీతారామరాజును కోరాడాయన. అంతే తడవుగా కాళీ మాతను తలచుకున్న విప్లవకారుడి పై బ్రిటీష్ ముష్కరులు విచక్షణా రహితంగా కాల్పులు సాగించారు. ఆ విప్లవజ్యోతి తల నేలకొరిగింది. ఆ తర్వాత భౌతిక కాయాన్ని కృష్ణదేవి పేటకు తీసుకొచ్చారు. తెల్లదొర సేనానులు పెద్ద ఎత్తున మోహరించిన తమ అభిమాన దేవుడ్ని చూసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. ఎక్కువ సేపు ఉంచితే ఇక లాభం లేదనుకున్న పోలీస్ అధికారులు సీతారామరాజును పార్థివ దేహాన్ని తాండవ నది ఒడ్డున దహనం చేశారు.

వీరుడు ఎన్నడూ మరణించడు.

విప్లవం అసలు చావదంటూ సీతారామరాజు అనుచరులు తర్వాతను తమ పోరాటం కొనసాగించారు. మే7ను సీతారామరాజును కాల్చి చంపితే 8న దహనం చేసి..మే 12న గానీ ఆ మృతి వార్తను ప్రకటించే సాహసం చేయలేకపోయింది. ఆ మహావీరుడ్ని బంధించడం బ్రిటీష్ వారికి సాధ్యం కాదని ప్రజలు భావించారు. ఎవరో సాధువు పుంగవుడ్ని పట్టుకుని హతమార్చి సీతారామరాజుగా ముద్రవేశారని చర్చ సాగింది. సీతారామరాజు మరణం తర్వాత ఒక్కొక్కరుగా ఆయన అనుచరులు ఆంగ్లేయులకు చిక్కారు. వీరుని అనుచరుల్లో 12 మందిని తెల్ల దొరల ప్రభుత్వం 1925 మే 13న జీవిత ఖైదు విధించి..అండమాన్ జైలుకు తరలించింది. ఆ విప్లవకారున్ని కీరిస్తూ అటు మహాత్మగాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రు, సుభాష్ చంద్రబోస్ లు తమ సంతాపం తెలిపారు. తెలుగు జాతి పౌరుషాన్ని ఇంతగా తాము ఎన్నడూ చూడలేదని ఆ మహనీయులు చెప్పారంటేనే అల్లూరి త్యాగ నిరతి అర్థమవుతోంది.

అండమాన్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించి స్వాతంత్ర్యం అనంతరం తిరిగి భారత్ కు వచ్చాడు గంటం దొర. అంతే కాదు..1952లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మన్యం ప్రాంతం పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చట్ట సభలకు వెళ్లాడు. చరిత్రలో తనను తాగుబోతుగా, మహిళా వ్యసనపరుడిగా చిత్రీకరించడం పట్ల మల్లు దొర ఆవేదన వ్యక్తం చేశాడు. విప్లవవీరుడికి దక్క వలసిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించాడాయన.

సీతారామరాజు ముఖ్య అనుచరుల్లో ఒకరైన అగ్గిరాజు అండమాన్ జైలులోనే శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ఆంధ్రప్రదేశ్ కు వచ్చేందుకు అవసరమైన ఆర్థిక వనరులు లేక అక్కడే తన శేష జీవితాన్ని గడిపాడు. ప్రభుత్వం ఇప్పుడు తెలుగు వీరునికి గుర్తుగా ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం సముచితం. ఓ స్వాతంత్ర్య వీరుడా, స్వరాజ్య భానుడా, ఓ అల్లూరి సీతారామరాజా, నీ త్యాగాలే వరిస్తాం, నిశ్చయంగా, నిర్భయంగా నీ వెంటే నడుస్తామంటూ ఆలోచిస్తూ నేటి యువతకు విప్లవ వందనం.

(అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం)

– కొండవీటి శివనాగ్ రాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ-9

KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు