రాష్ట్రంలో పెరిగిన టెస్టులు.. బయటపడుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అరకోటికి, విశ్వవ్యాప్తంగా మూడు కోట్లకు చేరువవుతున్నాయి. పట్టపగ్గాలు లేని మహమ్మారి విజృంభణ తీవ్రతను చాటుతోంది.
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అరకోటికి, విశ్వవ్యాప్తంగా మూడు కోట్లకు చేరువవుతున్నాయి. పట్టపగ్గాలు లేని మహమ్మారి విజృంభణ తీవ్రతను చాటుతోంది. కరోనా వైరస్ కోరలు తుంచే సరైన విరుగుడు కోసం దేశదేశాల్లో 140కి పైగా సాగుతున్న ప్రయోగాల సాఫల్యం కోసం మానవాళి ప్రాణాలు ఉపిరిబిగపట్టుకుని ఎదురుచూస్తోంది. అయితే, కరోనా వైరస్ అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ తన ప్రకోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల ఆగస్టు చివరి కల్లా గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా అదుపులోకి వస్తుంది. కేసులు కొద్ది రోజుల్లో ఇంకా తగ్గుతాయి. సెప్టెంబరు చివరికల్లా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వైర్‌సకు చెక్ పడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు భావించారు. అయితే, ఆ అంచనాలు తలకిందులయ్యాయి. ఆగస్టు చివరి వారం నుంచి కొవిడ్ నిర్ధారణ పరీక్షలను రెట్టింపు చేయడంతో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పరీక్షలు అందుబాటులోకి రావడంతో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆన్ లాక్ ప్రక్రియ ప్రారంభమవ్వడంతో జనసంచారం ఒక్కసారిగా పెరగడం కూడా వైరస్ వ్యాప్తికి కారణమైందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
ఆగస్టులో తొలి మూడు వారాల పాటు నమోదైన కేసుల తీరును వైద్య ఆరోగ్యశాఖ విశ్లేషించింది. ఆ నెల తొలివారంలో 14,810 కేసులు నమోదు కాగా, రెండోవారంలో కాస్త తగ్గి 12,746 పాజిటివ్‌గా తేలాయి. ఇక, మూడో వారానికి వచ్చేసరికి కొంచెం పెరిగి 13,990 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, రాష్ట్రంలో బయటపడుతున్న పాజిటివ్ కేసులు ప్రాతిపదికగా సెప్టెంబరు చివరి వారం వరకు అదే ట్రెండ్ కొనసాగితే కరోనా నియంత్రణలోకి వచ్చేస్తుందని రాష్ట్ర సర్కారు అంచనాకు వచ్చింది. అయితే, ఆ లెక్కలన్ని రివర్స్ అయ్యాయి. ఆగస్టు మూడో వారం తర్వాత సీన్ మారింది.
గత నెల 23 నుంచి రాష్ట్రంలో పరీక్షల సంఖ్యను ఒక్కసారిగా పెంచారు. పట్టణాలకే పరిమితమైన పరీక్షలు పల్లెలకు విస్తరించాయి. అవసరమైన చోట మొబైల్ ల్యాబ్స్ ద్వారా టెస్టులు చేయడం మొదలుపెట్టారు. అప్పటివరకు రోజూ 20 వేల పరీక్షలే చేయగా సగటున 1,731 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 23 నుంచి రోజుకు 40వేలకు తగ్గకుండా పరీక్షలు నిర్వహిస్తూ.. రెండు రోజుల వ్యవధిలోనే వాటిని 60 వేలకు పెంచారు. దీంతో అమాంతం పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. సెప్టెంబరు మొదటి వారంలోనూ 19,945 పాజిటివ్‌లు రాగా, రోజుకు సగటున 2,493 కేసులు నమోదయ్యాయి. ఆగస్టులో కాస్త తగ్గుమొఖం పడుతుందన్న అధికారుల అంచనాలు తారుమారై.. కేసులు పెరుగుతుండడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే కరోనా విస్తరణ పట్టణాలను వదిలి పల్లెలకు పాకిందని భావిస్తున్నారు.