AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ కాంగ్రెస్‌లో జోరందుకున్న మాటల యుద్ధం.. కాకరేపిన విహెచ్ కామెంట్స్.. మల్లు రవి ఎదురుదాడి

పీసీసీ అధ్యక్ష పీఠం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కాక రేపుతోంది. తాజాగా సీనియర్ నేత వి.హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దాన్ని...

తెలంగాణ కాంగ్రెస్‌లో జోరందుకున్న మాటల యుద్ధం.. కాకరేపిన విహెచ్ కామెంట్స్.. మల్లు రవి ఎదురుదాడి
Rajesh Sharma
|

Updated on: Dec 26, 2020 | 5:21 PM

Share

Heated arguments among Telangana congress leaders: పీసీసీ అధ్యక్ష పీఠం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కాక రేపుతోంది. తాజాగా సీనియర్ నేత వి.హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దాన్ని రాజేసాయి. పీసీసీ అధ్యక్ష పీఠం నిన్న గాక మొన్న పార్టీలో చేరిన వారికిస్తే పార్టీని వీడతానంటూ.. విహెచ్ చేసిన కామెంట్లు మొదలుకుని తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్కంఠ రేపే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరికెవరు తక్కువ కామంటూ తమదైన శైలిలో మాటల పోటీకి దిగుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ ఆనాటి పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి కొత్త సారథిని వెతికే పని పడింది పార్టీ అధిష్టానానికి. ఈ క్రమంలో సోనియా ఆదేశాలతో రంగంలోకి దిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్.. సుమారు వారం రోజుల పాటు హైదరాబాద్‌లో మకాం వేసి.. సుమారు 165 మంది కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను సేకరించారు.

హైదరాబాద్‌లో అభిప్రాయ సేకరణ పూర్తి చేసి ఢిల్లీకి తిరిగి వెళ్ళిన మాణిక్కం ఠాగూర్.. మిగిలిన ఇద్దరు అదనపు ఇంఛార్జీలతో మంతనాలు సాగించి.. ఓ షార్ట్ లిస్టు రూపొందించి పార్టీ అధిష్టానానికి ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ముసలం మొదలైంది. దానికి వి.హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. పార్టీలోకి నిన్న గాక మొన్న వచ్చిన వారికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇస్తే తాను పార్టీ వీడతానంటూ.. ఈ కొత్త నేతకు మద్దతు పలుకుతున్న మల్లు రవి లాంటి వారిపై వి.హెచ్. నిప్పులు గక్కారు.

విహెచ్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో.. ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న కొందరు విహెచ్ లక్ష్యంగా ఎదురు దాడి ప్రారంభించారు. ఈ మేరకు తనకు వచ్చిన కాల్‌ను రికార్డు చేసిన విహెచ్.. ఇలాంటి బెదిరింపులకు జడిసేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా విహనుమంతరావు.. తన వైఖరిని కుండబద్దలు కొడుతూ వెళ్ళారు. పార్టీలో బలహీన వర్గాలకు సరైన అవకాశాలివ్వకపోతే కష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విహెచ్.. అగ్రవర్ణాలకు పదవులివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదిలా వుంటే.. మరో వైపు విహెచ్ వ్యాఖ్యలపై మరో కాంగ్రెస్ సీనియర్ నేత డా. మల్లు రవి మండిపడ్డారు. ఇంతా చేస్తే.. పీసీసీ అధ్యక్ష పదవికి సీరియస్ యత్నాలు చేస్తున్న వారెవరు పెద్దగా మాట్లాడకుండా.. వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నారు. మరోవైపు విహనుమంతరావుపై చర్యలకు రంగం సిద్దం చేస్తున్నారు మాణిక్కం ఠాగూర్. పీసీసీ అధ్యక్షున్ని ఎంపిక చేయడంలో మాణిక్కం ఠాగూర్ అమ్ముడుపోయారంటూ విహనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై ఆయన గుర్రుగా వున్నారు.

పార్టీ నుంచి షోకాజ్ నోటీసు అందుకునేందుకు రెడీ అవుతున్న విహనుమంతరావు.. పార్టీని వీడతారా ? లేక పార్టీనే అంటిపెట్టుకుని వుంటారా అన్నదిపుడు చర్చనీయంశమైంది. గత కొన్నేళ్ళుగా సోనియా, రాహుల్ గాంధీలు వారిని కలిసేందుకు కూడా తనకు అపాయింట్‌మెంటు ఇవ్వడం లేదని విహెచ్ ఇదివరకే వెల్లడించిన నేపథ్యంలో ఆయన వద్దన్న వ్యక్తికి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పార్టీని వీడేందుకే మొగ్గు చూపుతారని సమాచారం.