Wellness Tips: మీ ఆరోగ్య నియమాలు మిమ్మల్ని రోగిగా మారుస్తున్నాయా? ఈ 7 అలవాట్లు ఉంటే జాగ్రత్త!
ఆరోగ్యంగా ఉండాలనే తపన ఒక్కోసారి వ్యసనంగా మారుతుందా? మనం చేసే కొన్ని పనులు ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయి అనుకుంటాం కానీ, అవే మనల్ని శారీరకంగా, మానసిక అలసటలోకి నెట్టేస్తుంటాయి. ప్రతిరోజూ కఠినమైన నియమాలు పాటించడం వల్ల శరీరం రీఛార్జ్ అవ్వడానికి బదులు నిస్సత్తువకు లోనవుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి పేరిట మీరు చేస్తున్న 7 తప్పులు మీ శక్తిని ఎలా హరిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.

ఫిట్నెస్, డైట్ విషయంలో అతిగా నియంత్రణ కలిగి ఉండటం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రమశిక్షణ అవసరమే కానీ, అది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసేలా ఉండకూడదు. బాధ్యతాయుతమైన అలవాట్లు అనుకుంటూ మనం చేస్తున్న కొన్ని పనులు మనల్ని ఎలా నిరాశలోకి, అలసటలోకి నెట్టేస్తున్నాయో ఈ హెల్త్ గైడ్ ద్వారా వివరంగా తెలుసుకోండి.
ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే ఉత్సాహంగా ఉండటం, కానీ అది మీకు భారంగా మారుతోందంటే మీరు అనుసరిస్తున్న పద్ధతుల్లో ఎక్కడో లోపం ఉందని అర్థం. మిమ్మల్ని అలసటలోకి నెట్టే ఆ 7 అలవాట్లు ఇవే:
1. విశ్రాంతి లేని వర్కౌట్లు: ప్రతిరోజూ కఠినమైన వ్యాయామం చేయడం వల్ల శరీరం మరమ్మత్తు (Recovery) చేసుకోవడానికి సమయం దొరకదు. దీనివల్ల కండరాల నొప్పులు పెరగడమే కాకుండా మానసిక అలసట కూడా వస్తుంది.
2. కఠినమైన ఆహార నియమాలు: డైట్ విషయంలో అతిగా నియంత్రణ ఉండటం వల్ల ఆహారం పట్ల భయం లేదా నేరభావం (Guilt) కలుగుతుంది. “క్లీన్ ఈటింగ్” పేరిట చేసే ఈ ప్రయోగం మానసిక ఒత్తిడిని పెంచుతుంది.
3. నిరంతరం ట్రాక్ చేయడం: అడుగులు, కేలరీలు, నిద్ర సమయం.. ఇలా ప్రతిదీ డిజిటల్ గా ట్రాక్ చేయడం వల్ల మీరు మీ శరీరం ఇచ్చే సహజ సంకేతాలను మర్చిపోయి, కేవలం అంకెలే పరమావధిగా బతుకుతుంటారు. ఇది ఆందోళనను (Anxiety) పెంచుతుంది.
4. బలవంతంగా త్వరగా నిద్రలేవడం: విజయానికి సంకేతం అని చెప్పి సరిపడా నిద్ర లేకుండానే తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల శరీర సహజ గడియారం (Circadian Rhythm) దెబ్బతింటుంది. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది.
5. విశ్రాంతిని బహుమతిగా భావించడం: పని అంతా పూర్తయ్యాకే విశ్రాంతి తీసుకోవాలి అనుకోవడం తప్పు. విశ్రాంతి అనేది మీ శరీరానికి అవసరమైన ఇంధనం వంటిది, అది పని చేస్తే వచ్చే బహుమతి కాదు.
6. నిరంతరం ఏదో ఒకటి సరిచేసుకోవడం: మీ ఆలోచనలను, అలవాట్లను ఎప్పుడూ మెరుగుపరుచుకోవాలని తాపత్రయపడటం వల్ల మీరు మీ జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోతారు. “నేను సరిపోను” అనే భావన మీ మానసిక స్థైర్యాన్ని తగ్గిస్తుంది.
7. శారీరక ఆరోగ్యంపై దృష్టి.. మానసిక ఆరోగ్యంపై నిర్లక్ష్యం: బాడీ ఫిట్ గా ఉంటే సరిపోదు, మనసు ప్రశాంతంగా ఉండాలి. మానసిక అలసట క్రమంగా శారీరక అనారోగ్యానికి దారితీస్తుంది.
గమనిక : ఈ సమాచారం కేవలం సామాన్య అవగాహన కోసం మాత్రమే అందించబడింది. వ్యాయామం లేదా డైట్ ప్లాన్లలో మార్పులు చేసేటప్పుడు మీ శరీర తత్వానికి తగ్గట్లుగా, నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. అతిగా నియమాలను పాటించడం వల్ల ఏవైనా మానసిక సమస్యలు ఎదురైతే కౌన్సెలర్ ను సంప్రదించండి.
