GVL Narasimharao: గవర్నర్‌తో జీవీఎల్ భేటీ.. మ్యాటరేంటంటే?
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు భేటీ అవడం అది కూడా తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ కల్వడానికి అరగంట ముందు ఆయన్ని కల్వడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
BJP Leader GVL Narsimharao met AP Governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు భేటీ అవడం అది కూడా తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ కల్వడానికి అరగంట ముందు ఆయన్ని కల్వడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. విశాఖ ఘటన నేపథ్యంలో చంద్రబాబు పర్యటనను వైసీపీ వర్గాలు ఎలా అడ్డుకున్నది గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ప్రతినిధి బృందం శనివారం నాడు రాజభవన్‌కు వెళ్ళింది. అయితే, టీడీపీ బృందం రాజ్‌భవన్‌కు చేరుకోవడానికి అరగంట ముందు జీవిఎల్.. గవర్నర్‌ని కలుసుకున్నారు. కాసేపు మంతనాలు సాగించారు. అయితే జీవిఎల్-గవర్నర్ భేటీ రాష్ట్రంలో రాజకీయ చర్చకు తెరలేపింది.
విశాఖ పర్యటనకు వెళ్ళిన టీడీపీ అధినేత చంద్రబాబును ఎయిర్‌పోర్టులోనే అడ్డుకుని హంగామా చేయడంతో.. పోలీసులు జోక్యం చేసుకుని ఆయన్ని విశాఖ నుంచి హైదరాబాద్‌కు పంపించేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబును అడ్డుకున్నది విశాఖ వాసులేనని అధికార వైసీపీ అంటుంటే.. హల్‌చల్ చేసిన వారంతా వైసీపీ శ్రేణులేనని టీడీపీ నేతలంటున్నారు. ఈ ఆరోపణతోనే టీడీపీ టీమ్.. గవర్నర్‌తో భేటీ అయ్యింది. అయితే.. టీడీపీ బృందం రావడానికి ముందే జీవీఎల్ నరసింహారావు గవర్నర్‌ని కల్వడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
బిశ్వభూషణ్‌తో జీవీఎల్ భేటీ అవడం వెనుక అసలు కారణాన్ని తెలుసుకుంది టీవీ9 తెలుగు వెబ్ టీమ్. స్పైసెస్ బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు జీవీఎల్ నరసింహారావు విజయవాడకు వచ్చారు. అయితే ఈ సమావేశానికి ముందు ఆయనకు కొద్దిగా సమయం వుండడంతో బిశ్వభూషణ్‌తో వున్న పాత స్నేహం కారణంగా ఆయన్ని కలుసుకునేందుకు జీవీఎల్ నరసింహారావు వెళ్ళినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరిద్దరి భేటీకి పెద్దగా రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
అయితే.. గవర్నర్‌తో భేటీ తర్వాత జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రస్తుతం రాజకీయ ఘర్షణ వాతావరణం నెలకొందని, ప్రజా ప్రతినిధులను తిరగనీయని పరిస్థితి మంచిది కాదని హితోక్తులు పలికారు. ఇలా నేతలను అడ్డుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తే.. ఘర్షణ వాతావరణం కాస్తా.. శాంతి భద్రతల సమస్యగా మారుతుందని ఆయన హెచ్చరించారు. రాజకీయ పరిస్థితులపై గవర్నర్ తన అభిప్రాయాన్ని తెలిపానని జీవీఎల్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.