తుది దశకు చేరుకున్న ప్రయోగాలు.. వ్యాక్సిన పంపిణికి అధికారుల ఏర్పాట్లు..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి తుది దశ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అన్ని ప్రయోగాలు పూర్తి చేసుకుని జనానికి అందుబాటులోకి టీకాను తీసుకువచ్చేందుకు అయా దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి..

తుది దశకు చేరుకున్న ప్రయోగాలు.. వ్యాక్సిన పంపిణికి అధికారుల ఏర్పాట్లు..
Follow us

|

Updated on: Nov 23, 2020 | 5:32 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి తుది దశ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అన్ని ప్రయోగాలు పూర్తి చేసుకుని జనానికి అందుబాటులోకి టీకాను తీసుకువచ్చేందుకు అయా దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మూడో దశ క్లినికల్‌ పరీక్షలు, లైసెన్సుల ప్రక్రియ ఇంకా పూర్తి కాకముందే కరోనా వ్యాక్సిన్లను ఉపయోగించడానికి అత్యవసర ఆమోదం తెలిపే అంశంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. వ్యాక్సిన్ల కొనుగోలుపై ముందుగానే ఒక ఒప్పందానికి వచ్చే అంశంపైనాుది ప్రభుత్వం ఇటీవల ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించింది. ఇందులో భాగంగా జరిగిన సమావేశానికి నీతి ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌, ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారుడు కె.విజయ రాఘవన్‌, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌లు దీనిలో పాల్గొన్నారు.

ఆక్స్‌ఫర్డ్‌ టీకా అత్యవసర వాడుకకు పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ను ప్రభుత్వం అనుమతించే అవకాశాలున్నాయి. ఆస్ట్రాజెనెకాకు యూకేలో అనుమతి లభించడంపై ఇది ఆధారపడి ఉంటుందని నీతిఆయోగ్‌ వర్గాలు చెబుతున్నాయి. మూడో దశ పరీక్షలకు ముందే వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి లభిస్తే వచ్చే ఏడాది తొలినాళ్లలో ప్రాధాన్య వర్గాలకు ముందుగా వాటిని అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. అత్యవసర వాడుకకు అనుమతులు మంజూరు చేయడానికి విధివిధానాలను.. ప్రధాని నియమించిన వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌ రూపొందిస్తుంది. టీకా ధర నిర్ణయం, ముందుగానే మార్కెట్‌ ఒప్పందం చేసుకోవడం వంటివి జాతీయ నిపుణుల బృందం చూస్తుంది. అమెరికాలో ఫైజర్‌, మోడెర్నా వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతిని కోరనున్న విషయం తెలిసిందే. మన దేశంలో ఐదు వ్యాక్సిన్లు వేర్వేరు ప్రయోగ దశల్లో ఉన్నాయి. వీటితో పాటు ప్రపంచంలో వ్యాక్సిన్ల తయారీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి, అత్యవసర ఆమోదంపై ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో తేల్చడానికి నిపుణులతో ‘వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ’ సమావేశం కానుంది. వ్యాక్సిన్లను రూపొందిస్తున్న కంపెనీలు తమ ఫలితాన్ని ప్రకటించడంతోనే ప్రభుత్వం తరఫున వాటిని సంప్రదించాలని నిర్ణయించారు.

దేశంలో అందరికీ కరోనా వ్యాక్సిన్‌ అందించడం ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది. అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి కావాల్సినంత సరకును రవాణా చేయడం ఒక సవాల్‌ అయినా ఎక్కువ విమానాలను తక్కువ సమయంలో నడిపి దానిని సాధించాలని విమానయాన సంస్థలు భావిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ సిద్ధమయ్యాక దానిని ఒకచోట నుంచి మరో చోటకు రవాణా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లపై విమానయాన సంస్థలు ఇప్పటికే దృష్టి సారించాయి. వ్యాక్సిన్‌ను తీసుకువెళ్లే విమానాలకు కావాల్సిన సమయాన్ని ప్రధాన విమానాశ్రయాలు కేటాయించనున్నాయి. ఔషధాల చేరవేతకు దేశంలోనే అతిపెద్ద గేట్‌వేగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి కొవిడ్‌-19 టీకా నిల్వలను రోజులో ఏ సమయంలోనైనా తరలించడానికి విమానాశ్రయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దిల్లీ విమానాశ్రయంలోనూ అధునాతన శీతల గిడ్డంగుల సదుపాయం ఉంది. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి ఇతర విమానాశ్రయాల్లోనూ వ్యాక్సిన్‌ నిల్వ, తరలింపులకు కావాల్సిన సదుపాయాలున్నాయి.

అలాగే అయా రాష్ట్రాలు వ్యాక్సిన్ నిల్వ చేయడానికి కావల్సిన వసతులపై దృష్టి సారించాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దీంతో శీతల గిడ్డంగులను సిద్ధం చేసే పనిలో పడ్డారు అధికారులు.