AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పక్కా పల్లెటూరి స్టైల్‌లో నోరూరించే కమ్మనైన గోంగూర పచ్చడి.. చివరకు అదే హైలెట్..

ఆంధ్రుల ఆహార సంస్కృతిలో గోంగూర పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. గోంగూర, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, వెల్లుల్లి, ఉల్లిపాయలతో పల్లెటూరి స్టైల్లో ఈ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు.

పక్కా పల్లెటూరి స్టైల్‌లో నోరూరించే కమ్మనైన గోంగూర పచ్చడి.. చివరకు అదే హైలెట్..
Gongura Pachadi Recipe
Shaik Madar Saheb
|

Updated on: Aug 27, 2026 | 5:11 PM

Share

ఆంధ్రుల ఆహార సంస్కృతిలో గోంగూర పచ్చడికి ప్రత్యేకమైన స్థానం ఉంది.. అందుకే.. దీన్ని ఆంధ్రమాత, పుంటికూర అంటూ ఇష్టంగా పిలుచుకుంటారు.. గోంగూరలో విటమిన్-సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకుని తింటే.. రుచి అద్భుతంగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసుకుంటే 10 రోజులకు పైగా తాజాగా ఉండే ఈ పల్లెటూరి స్టైల్ గోంగూర పచ్చడి తయారీ విధానాన్ని ఈ కథనంలో తెలుసుకోండి..

గోంగూర పచ్చడి కోసం కావలసిన పదార్థాలు:

  • గోంగూర: 2 నుండి 4 కట్టలు (శుభ్రం చేసి కడిగినది)
  • టమాటాలు: 2 (మీడియం సైజ్)
  • పచ్చిమిరపకాయలు: 10 నుండి 15 (గోంగూర పులుపుకు తగినట్లు)
  • వేరుశనగ గుళ్లు (పల్లిలు): 2 టేబుల్ స్పూన్లు
  • ఉల్లిపాయ: 1 (పెద్ద ముక్కలుగా తరిగినది)
  • వెల్లుల్లి రెబ్బలు: 8 నుండి 10
  • ఉప్పు: రుచికి సరిపడా
  • తాలింపు పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు (మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్)
  • ఎండుమిరపకాయలు: 4 నుండి 6
  • కరివేపాకు: 2 రెమ్మలు
  • ఇంగువ: చిటికెడు
  • నూనె: తగినంత

తయారీ విధానం:

పల్లీలు వేయించడం: మొదట బాణలిలో (పాన్) వేరుశనగ గుళ్లను చిన్న మంటపై దోరగా వేయించి, మిక్సీ జార్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

గోంగూర, టమాటా మగ్గించడం: అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, గోంగూర వేయాలి. మూత పెట్టి చిన్న మంటపై గోంగూరలోని తేమ (చెమ్మ) పూర్తిగా ఆరిపోకుండా సాఫ్ట్‌గా మగ్గించి చల్లారనివ్వాలి.

పచ్చడి గ్రైండింగ్: మొదట మిక్సీ జార్‌లోని పల్లీలను మెత్తగా పొడి చేయాలి. ఆ తర్వాత మగ్గించిన గోంగూర-టమాటా మిశ్రమం, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి రోట్లో దంచినట్లుగా (కచ్చాపచ్చాగా) కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఉల్లిపాయలు కలపడం: గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక బౌల్‌లోకి తీసుకుని, అదే మిక్సీ జార్‌లో ఉల్లిపాయ ముక్కలు వేసి పల్స్ మోడ్‌లో ఒక్కసారి కచ్చాపచ్చాగా తిప్పి పచ్చడిలో బాగా కలపాలి.

చివరకు అసలైన ఫినిషింగ్ టచ్ కమ్మని తాలింపు:

బాణలిలో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. అందులో తాలింపు గింజలు, దంచిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి దోరగా వేయించాలి.

చివరగా తాలింపులో తయారుచేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు నూనెలో మగ్గనిచ్చి స్టవ్ ఆపేయాలి. అనంతరం అన్నంలో సర్వ్ చేసుకోవచ్చు.. కొంచెం నెయ్యి వేసుకుని తింటే దీని రుచి అద్భుతంగా మారిపోతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us