గ్రేటర్ ఎన్నికల దిశగా ఈసీ కీలక ఆదేశాలు

గ్రేటర్ ఎన్నికల దిశగా ఈసీ కీలక ఆదేశాలు

అటు దుబ్బాక ఉప ఎన్నిక ముగిసిందో లేదో ఇటు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తాజా ఆదేశాల ప్రకారం నవంబర్ 21వ తేదీ లోగా నిర్వహించాల్సిన పనులను గ్రేటర్ అధికారులకు కమిషనర్ పురమాయించారు.

Rajesh Sharma

|

Nov 10, 2020 | 4:33 PM

GHMC election process speed-up: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. నవంబర్ 21వ తేదీలోగా జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ స్టేషన్లను గుర్తించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీ.పార్థసారథి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, వార్డుల వారీగా వాటి ప్రచురణ కార్యక్రమాలను నవంబరు 21వ తేదీలోపు పూర్తి చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు పార్థసారధి తెలిపారు. జీహెచ్ఎంసీ యాక్టులోని సెక్షన్ 29 ప్రకారం వార్డులకు నియమించబడిన రిటర్నింగ్ అధికారులు, ఆయా వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి జీహెచ్ఎంసీ కమిషనర్ – ఎన్నికల అధికారి ఆమోదం మేరకు ప్రచురించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషనర్ పార్థసారథి చెప్పారు.

నోటిఫికేషన్ షెడ్యూల్ వివరాలు: # నవంబర్ 12 వ తేదీ లోపు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా తయారు చేయాలి. # జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదంతో నవంబరు 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రచురించాలి. # దావాలు, అభ్యంతరాలు, సలహాలను నవంబర్ 17 వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు స్వీకరించాలి. # రిటర్నింగ్ అధికారి, సంబంధిత డిప్యూటీ కమిషనర్ తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నవంబరు 16న సమావేశం నిర్వహించాలి. # దావాలు, అభ్యంతరాలు, సలహాలను నవంబర్ 18 వ తేదీ వరకు పరిష్కరించాలి. # రిటర్నింగ్ అధికారులు తమ వార్డు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను జీహెచ్ఎంసీ కమిషనర్‌కు నవంబరు 19న సమర్పించాలి. # జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదంతో నవంబరు 21న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను నిర్దేశించిన ప్రదేశాలలో ప్రచురించాలి.

వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల గుర్తింపును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పార్థసారథి జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. నవంబరు 21న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించేలా చూడాలని నిర్దేశించారు. ఈ విషయంలో రిటర్నింగ్ అధికారులకు డిప్యూటీ కమిషనర్లు అన్నివిధాలా సహకరించాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu