Andhra: RDO వాహనాన్ని వేలం వేసి.. వచ్చిన డబ్బు ఆమెకు ఇవ్వాలని కర్నూలు కోర్టు సంచలన తీర్పు
36 ఏళ్లుగా పరిహారం కోసం ఎదురు చూసిన బాధితురాలికి న్యాయం దక్కింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి కర్నూలు కోర్టు గట్టి చెక్ పెట్టింది. పరిహారం చెల్లించని కారణంగా ఆర్డీవో వాహనాన్ని వేలం వేయాలని ఆదేశిస్తూ సంచలన తీర్పు వెలువడింది. అధికార యంత్రాంగం స్పందిస్తుందా? లేక వాహనం వేలమే తుది పరిణామమా?

కర్నూలు కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఇప్పుడు అందరి నోళ్లలో మెదులుతోంది. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) వాహనాన్ని వేలం వేసి, వచ్చిన మొత్తాన్ని బాధితురాలికి చెల్లించాలని కోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్గేయపురంలో 1988లో ప్రభుత్వం భూ యజమానుల నుంచి భూమిని సేకరించింది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే భూమి యజమాని రామకృష్ణమ్మకు చెల్లించాల్సిన రూ.18,72,288 పరిహారం ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదు. ఎప్పటికప్పుడు చెల్లించాలని కోరినా ప్రభుత్వ స్పందన లేకపోవడంతో ఆమె చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని డబ్బులు చెల్లించాలని ఆదేశించినప్పటికీ, అధికారుల నుంచి చలనం లేకపోవడంతో కోర్టు ఆర్డీవో వాహనాన్ని వేలం వేయాలని, వేలంలో వచ్చిన మొత్తాన్ని బాధితురాలికి చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అలాగే ఆర్డీవో వాహనాన్ని వచ్చే నెల 12న వేలం వేయాలని కూడా ఆదేశించింది.
ఈ కేసులో బాధితురాలి తరపున న్యాయవాది జి. మధుసూదన్ రెడ్డి వాదనలు చేశారు. ఆర్డీవో వాహనం నెంబర్ AP39 PY 0773ను.. ఈనెల 12న వాహనం వేలం వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ లోగానే ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లిస్తే వేలం రద్దు కావచ్చని భావిస్తున్నారు.కోర్టు తీర్పుపై బాధితురాలు సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడం ప్రశ్నార్థకం.
