AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganta Srinivas Rao: అధినేత వచ్చినా ఆయన రాలేదు.. కథ కంచికేనా?

మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు సరికొత్త వ్యూహం రచిస్తున్నారా? చంద్రబాబు విశాఖ పర్యటన అంత ఉద్రిక్తతకు దారి తీసినా.. గంటా జాడే లేదు. దాంతో చంద్రబాబు సహా.. పార్టీ శ్రేణులు అసలు గంటా వ్యూహం ఏంటని చర్చించుకుంటున్నారు

Ganta Srinivas Rao: అధినేత వచ్చినా ఆయన రాలేదు.. కథ కంచికేనా?
Rajesh Sharma
|

Updated on: Feb 29, 2020 | 10:40 AM

Share

Ganta Srinivas Rao absent from Chandrababu visit: ఆయన ఎక్కడ? ఎన్నికల తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. కానీ అవన్నీ ఆయన పుకార్లే అని కొట్టిపారేశారు. తనకు ఆ ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ మళ్లీ ఆయనపై ఇప్పుడు డౌట్లు మొదలయ్యాయి. మేటర్‌ తేడా అనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎందుకు గాయబ్‌ అయ్యారు? ఎస్.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు గురించే ఈ ఉపోద్ఘాతమంతా.

గురువారం విశాఖ ఎయిర్‌పోర్టు దగ్గర జరిగిన హైడ్రామా తెలుగు రాష్ట్రాలలో హాట్ న్యూస్‌గా మారిన సంగతి తెలిసిందే. విశాఖకు టీడీసీ అధినేత చంద్రబాబు వచ్చారు. ఆయన్ని ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. ఐదుగంటలకుపైగా హై డ్రామా నడిచింది.. అధినేత ధర్నాకు దిగారు. నిరసన వ్యక్తం చేశారు. పార్టీ నేతకు మద్దతుగా ఉత్తరాంధ్ర కీలక లీడర్లు వచ్చారు. కానీ గంటా శ్రీనివాస్ రావు మాత్రం గాయబ్‌!

ఇంతకీ గంటా ఎందుకు రాలేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుని విశాఖకు రానీయకుండా అడ్డుకుంటుంటే….. అదే విశాఖ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ మంత్రి కూడా అయిన గంటా శ్రీనివాసరావు ఎక్కడ? అనే టాపిక్‌ గురువారం నుంచి నడుస్తోంది. టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వచ్చారు. విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణ బాబు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం అటువైపే రాలేదు. బాబుపై అలిగారా? లేక పార్టీ మారాలని నిర్ణయించారా? అనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది.

చంద్రబాబు విశాఖలో రెండు రోజుల టూర్ ప్రోగ్రాం తెలిసిన మిగిలిన వారు తమ నియోజకవర్గాల్లో చాన్నాళ్ళ క్రితమే ప్రజా చైతన్య యాత్రలు చేపట్టారు. జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా వుండిపోయారు. నిజానికి ఆయన విశాఖ రాజధానిని గట్టిగా కోరుకున్నారు. అందువల్ల ఆయన దాని మీద వ్యతిరేకంగా ఏ మాటా ప్రకటించకపోవచ్చు. కానీ అధినేత తమ జిల్లాకు వస్తున్నపుడైనా ఎదురేగాలి.. పక్కన నిలబడాలి.. మరి గంటా శ్రీనివాసరావు గాయబ్ ఎందుకు అన్నదే తమ్ముళ్ళకు అర్ధం కావడం లేదుట.

గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే ఉన్నారు. తాను టీడీపీని వీడిపోనని గట్టిగా చెబుతారు. కానీ పార్టీ మీటింగులకు రారు. బాబు గతసారి విశాఖ వచ్చి రివ్యూలు చేసినా కూడా ముళ్ళ మీద కూర్చున్నట్లుగా కొంతసేపు మాత్రమే ఉండి వెళ్ళిపోయారు. ఇక ఆ తరువాత కూడా ఆయన ఎక్కువగా బయటకు కనిపించడం మానుకున్నారు. తిరిగితే ఒకసారి తన ఉత్తర నియోజకవర్గంలో తిరుగుతారు. అక్కడి పార్టీ నాయకులతో కనిపిస్తారు. కానీ జిల్లా ఆఫీసుకు మాత్రం రారు.

గంటా బీజేపీలోకి వెళ్తారని.. లేదు వైసీపీలోకి వెళ్తారనే టాక్ వినిపించింది. అవంతి శ్రీనివాస్ కారణంగానే ఆయన వైసీపీలో చేరడం లేదని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం పార్టీ మారే వ్యవహారంలో సైలెంట్‌గా ఉండిపోయారు. తాను పార్టీలో యాక్టివ్‌గానే ఉన్నానని చెప్పడానికి అన్నట్టుగా.. పది రోజుల క్రితం ఆయన సమక్షంలో కొందరు బీజేపీ కార్యకర్తలను టీడీపీలో చేర్చుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఇటీవలే విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయం నుంచి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారు. మరి ఇప్పుడు బాబు వస్తే ఎందుకు రాలేదనేది మళ్లీ చర్చనీయాంశం అయింది.

అయితే గంటా గురించి తెలిసిన వారు…ఆయన రాజకీయ లెక్కలు వేరుగా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుత్లో ఆయన పార్టీ మారే ఆలోచన చేయడం లేదంటారు. కానీ టీడీపీలోనే ఉంటారా? అంటే గట్టిగా చెప్పలేకపోతున్నారు. భవిష్యత్‌ రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని…ఆయన కీలక సమయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటారు. మొత్తానికి ఇప్పుడు అయితే ఆయన వెయిటింగ్‌ లిస్ట్‌లోనే ఉన్నారని అంటున్నారు. మరీ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల టైమ్‌లో ఆయన ఏమైనా నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇదీ చదవండి: ‘తూర్పు’ రాజకీయాల్లో ట్రిపుల్ ‘ఆర్’ .. పరిష్కారం సాధ్యమా? RRR tension in East Godavari politics