Breaking News: కరోనాపై చేతులెత్తేసిన గాంధీ డాక్టర్లు!
కరోనా వైరస్ వుందంటూ పెద్ద్ సంఖ్యలో వస్తున్న కేసులను పరీక్షించలేమంటూ చేతులెత్తేశారు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి డాక్టర్లు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని....
Gandhi hospital doctors hands-up for Corona treatment: కరోనా వైరస్ వుందంటూ పెద్ద్ సంఖ్యలో వస్తున్న కేసులను పరీక్షించలేమంటూ చేతులెత్తేశారు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి డాక్టర్లు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, కే. తారక రామారావు ప్రకటించి, 24 గంటలు కాకముందే గాంధీ వైద్యులు ఇబ్బడిముబ్బడిగా రెఫర్ అవుతున్న కేసులను పరీక్షించలేమంటూ అశక్తత వ్యక్తం చేయడం గమనార్హం.
దేశంలో ఇప్పటి వరకు 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో కరోనా వైరస్ గుర్తింపునకు కేంద్రాలను నెలకొల్పినట్లు వెల్లడించింది కేంద్రం. ఇటు వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా కోవిడ్-19 గుర్తింపుతోపాటు.. పాజిటివ్ కేసులకు చికిత్స అందించేందుకు, అనుమానితులను పరీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని ప్రకటించింది. అయితే గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
బుధవారం ఉదయం నుంచి భారీ సంఖ్యలో క్యూ కట్టిన టెక్కీలతో గాంధీ ఆస్పత్రి కిక్కిరిసిపోయింది. విదేశాలకు ప్రయాణం చేసే వారిలో టెక్కీలే ఎక్కువగా వుండడం, పాజిటివ్ కేసుల్లోను వారి సంఖ్యనే ఎక్కువగా వుండడంతో టెకీలు పెద్ద సంఖ్యలో తమ ఆరోగ్యంపై ఆందోళనతో గాంధీ ఆస్పత్రికి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం గాంధీ ఆవరణలో పెద్ద పెద్ద క్యూలు దర్శనమిచ్చాయి. మాకు జలుబు, దగ్గు , జ్వరం ఉంది అని మొర పెట్టుకుంటున్న టెకీలను, సామాన్య ప్రజలను అడ్రస్ చేయడంలో గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేవలం విదేశాలకు వెళ్ళి వచ్చిన వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని, మిగిలిన వారికి అక్కర లేదని గాంధీ ఆస్పత్రి వర్గాలు చెబుతూ వారిని తిప్పి పంపుతున్నాయి. గత వారం రోజుల నుండి దగ్గు , జలుబు, తుమ్ములతో ఇబ్బంది పడుతున్న టెకీలు.. తాము విదేశాలకు వెళ్ళకపోయినా.. వెళ్ళి వచ్చిన వారితో కలిసి పని చేశామని చెబుతూ వారికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా బతిమాలుతుండడం కనిపిస్తోంది. వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతనే ఆఫీసులకు రావాలని సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ సిబ్బందికి చెప్పడంతో వారంతా గాంధీ ఆస్పత్రికి క్యూకట్టారు.
అయితే.. ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవంగా గాంధీ ఆస్పత్రిలో అనుసరిస్తున్న విధానానికి పొంతనే లేదని వైద్య పరీక్షల కోసం వస్తున్నవారు చెబుతున్నారు. ఈ క్రమంలో హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో వైద్యుల సంఖ్యతోపాటు.. వైద్య పరీక్షలకు వసతులను గణనీయంగా పెంచాలని కోరుతున్నారు. అయితే.. టెకీలలో అనవసరమైన ఆందోళన రేకెత్తించేలా ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ హెచ్చరించారు. టెకీలలో కరోనా లక్షణాలు లేవని ఆయనంటున్నారు. మరోవైపు.. ఇద్దరు టెకీల శాంపిల్స్‌ని పుణె ల్యాబ్‌కు పంపించామని వైద్యవర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి: కరోనాపై సమరం.. మంత్రి ఇంఛార్జ్‌గా కమాండ్ కంట్రోల్ Etala to lead command control on Covid-19