ఆ జిల్లాలను వీడని వరద ముంపు
వర్షాలు తగ్గుముఖం పట్టినా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు వీడటం లేదు. అక్కడి పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. అయితే వరద ప్రభావిత జిల్లాలు రాష్ట్రంలో గురువారం నాడు 19 నుంచి 17కి తగ్గాయి...
వర్షాలు తగ్గుముఖం పట్టినా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు వీడటం లేదు. అక్కడి పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. అయితే వరద ప్రభావిత జిల్లాలు రాష్ట్రంలో గురువారం నాడు 19 నుంచి 17కి తగ్గాయి. కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే వరద ముంపు తగ్గిందని అక్కడి అధికారులు వెల్లడించారు. పిలిభిత్, సంత్ కబీర్ నగర్ జిల్లాలను వరద ప్రభావిత జిల్లాల నుంచి వారు తొలిగించారు. 17 జిల్లాల్లో మొత్తం 893 గ్రామాలు వరద ప్రభావానికి గురైనట్లు రాష్ట్రాల రిలీఫ్ కమిషనర్ సంజయ్ గోయల్ వెల్లడించారు.
వరద ప్రభావిత జిల్లాల్లో అంబేద్కర్ నగర్, అయోధ్య, అజాంగర్, బహ్రాయిచ్, బల్లియా, బారాబంకి, బస్తీ, డియోరియా, ఫరూఖాబాద్, గోండా, గోరఖ్‌పూర్, కాస్గంజ్, కుషినగర్, లఖింపూర్ ఖేరి, మౌ, షాజనాన్‌పూర్, సీతాపూర్ జిల్లాలు ఉన్నాయి. లఖింపూర్ ఖేరి వద్ద శారదా నది, శ్రావస్తిలోని రాప్తీ నది, అయోధ్య, బల్లియాలోని సరయు నది ప్రమాదస్థాయిలను మించి ప్రవహిస్తున్నాయని రిలీఫ్ సహాయ కమిషనర్ ప్రకటించారు. నదుల నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే సమీప గ్రామాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.