బీహార్‌లో తొలి విడత పోలింగ్ ప్రశాంతం.. 5 గంటలకు 51.91శాతం నమోదు
బీహార్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 51.91శాతం పోలింగ్ నమోదైంది.
బీహార్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 51.91శాతం పోలింగ్ నమోదైంది. కరోనా ప్రభావిత సమయంలో తొలిసారిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్ బుధవారం నిర్వహించారు. ఆరు జిల్లాల్లోని 71 శాసనసభ స్థానాల్లో 1,066 మంది భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించారు.
కొవిడ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశ పోలింగ్ 71 స్థానాల్లో ఆర్జేడీ 42, జేడీయూ 41, ఎల్‌జేపీ 41, బీజేపీ 29, కాంగ్రెస్ 21 స్థానాల్లో బరిలో నిలిచాయి. తొలిసారిగా అసెంబ్లీ బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి షూటర్ శ్రేయాసి నయాగావ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమాజీ మంత్రి దిగ్విజయ్‌సింగ్ కుమార్తె శ్రేయాసి ఈ ఎన్నికల్లో జముయి నుంచి బరిలో నిలిచారు. లఖీసరాయ్ జిల్లాలోని బల్గుదార గ్రామంలో గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. క్రీడామైదానంలో మ్యూజియం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులంతా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓటర్లు ఎవరూ రాక పోలింగ్ కేంద్రం వెలవెలబోయింది. ఇక మిగతా ప్రాంతాల్లో కరోనాను సైతం లెక్కచేయకుండా నిబంధనలు పాటిస్తూ ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.