ఢిల్లీలో రైతుల పోరాటం..700 ట్రాక్టర్లతో ఢిల్లీకి..మరో కొత్త ప్రణాళిక..చట్టాల రద్దు కోసం హీట్ పెంచుతామంటున్న రైతు నేతలు
తమ డిమాండ్లకు అంగీకరించకపోతే రైల్వే ట్రాకులపై బైఠాయిస్తామని కమిటీ ప్రతినిధులు హెచ్చరించారు. సింఘు సరిహద్దు వద్ద విలేకరులతో మాట్లాడిన రైతు నాయకులు డిసెంబరు 12లోగా అన్ని టోల్‌ప్లాజాలు..

దేశరాజధాని సరిహద్దుల్లో రైతుల రచ్చ కొనసాగుతోంది. అయితే ఈ నిరసనల్లో పాల్గొనేందుకు అమృత్‌సర్ నుంచి కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీకి చెందిన రైతులు 700 ట్రాక్టర్లలో ఢిల్లీకి తరలివెళ్లారు. ఈ ట్రాక్టర్లు ఢిల్లీలోని కుండ్లీ సరిహద్దు వైపుగా వెళ్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయచట్టాలను వెనక్కి తీసుకోవాలని దేశరాజధాని ఢిల్లీలో 16రోజులుగా వివిధ రాష్ట్రాల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే రైల్వే ట్రాకులపై బైఠాయిస్తామని కమిటీ ప్రతినిధులు హెచ్చరించారు. సింఘు సరిహద్దు వద్ద విలేకరులతో మాట్లాడిన రైతు నాయకులు డిసెంబరు 12లోగా అన్ని టోల్‌ప్లాజాలు మూసేస్తామన్నారు.
ఢిల్లీకి వచ్చే అన్ని రహదారులు ముట్టడించి నిరసన ఉద్ధృతం చేస్తామన్నారు. కేవలం పంజాబ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అందరు రైతులు రైల్వేట్రాకులు నిర్బంధించాలని పిలుపునిచ్చారు. దానికి సంబంధించిన తేదీ, మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు.
చట్టాలను వెనక్కి తీసుకొంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న సవరణలన్నీ పాతవేనని, వాటి వల్ల ఉపయోగం లేదని వారు ఉద్ఘాటిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఆరు సార్లు చర్చలు జరిగినా ఫలితం రాలేదు.
మరోవైపు టిక్రీ, ధన్సా సరిహద్దులు నిరసనలతో ఇప్పటికే మూతబడ్డాయి. జైపుర్-ఢిల్లీ సరిహద్దును కూడా రైతులు ముట్టడించారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు కొవిడ్-19 నేపథ్యంలో మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.




