AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Protest Live Updates: రైతులను ధీక్ష విరమింప చేస్తున్న పోలీసులు.. ఘాజీపూర్‌లో హై టెన్షన్..

Farmers Protest Live Updates: వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే..

Farmers Protest Live Updates: రైతులను ధీక్ష విరమింప చేస్తున్న పోలీసులు.. ఘాజీపూర్‌లో హై టెన్షన్..
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 29, 2021 | 6:32 AM

Share

Farmers Protest Live Updates: వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జనవరి 26న రైతులు నేతుల పిలుపునిచ్చిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు రైతులను దీక్ష విరమింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాాజాగా ఢిల్లీ శివారులోని ఘాజీపూర్‌లో రైతులను ఖాళీ చేయాలని పోలీసులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఘాజీపూర్‌లో హై టెన్షన్ నెలకొంది…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Jan 2021 03:03 AM (IST)

    ఘాజీపూర్‌ సరిహద్దు నుంచి వెళ్లిపోయిన భద్రతా సిబ్బంది

    అకస్మాత్తుగా ఘాజీపూర్‌‌ సరిహద్దు నుంచి  ఉత్తరప్రదేశ్ భద్రతా సిబ్బంది వెళ్లిపోయారు. ఉదయం నుంచి విధుల్లో ఉన్న సిబ్బంది అక్కడి నుంచి వాహనాల్లో వెళ్లిపోయారు. అయితే భద్రతా సిబ్బంది వాహనాల్లో వెళ్లిపోవడానికి గల కారణాలను మీడియా అడుగగా, వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ సరిహద్దు ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి భారీగా రైతులు చేరుకుంటున్నారు.

  • 29 Jan 2021 02:23 AM (IST)

    భారతీయ కిసాన్‌ యూనియన్‌కు మద్దతుగా భారీగా చేరుకుంటున్న రైతులు

    ఘాజీపూర్‌ సరిహద్దుకు రైతులు భారీగా చేరుకుంటున్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేష్‌ను కలిసేందుకు ఆర్‌ఎల్‌డి నాయకుడు జయంతి చౌదరిని కలువనున్నారు. నిరసన స్థలంలో భారీగా రైతులు గుమిగూడారు.

  • 29 Jan 2021 02:12 AM (IST)

    రైతులపై లాఠీచార్జ్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

    రైతులపై లాఠీచార్జ్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేష్‌ టికైట్‌ డిమాండ్‌ చేశారు. వారిపై చర్యలు తీసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు.

  • 29 Jan 2021 02:09 AM (IST)

    భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడికి హర్యానా రైతుల మద్దతు

    ఘాజీపూర్ సరహద్దుల్లో  రైతుల ఆందోళనల నేపథ్యంలో హర్యానా రైతులు భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేష్‌ టికైట్‌కు మద్దతుగా నిలిచారు. జింద్‌లోని కందేలా గ్రామం నుంచి భారీగా రైతులు బయలుదేరుతున్నారు. రైతులు జింద్‌ రోడ్డు గుండా ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం రైతులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఘాజీపూర్‌ సరిహద్దుల్లో రైతులు వేలాదిగా తరలివస్తున్నారు.

  • 29 Jan 2021 01:56 AM (IST)

    సరిహద్దుల్లో రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ మోహరింపు పొడిగింపు

    ఘాజీపూర్‌ సరిహద్దుల్లో రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ నాలుగు కంపెనీల మోహరింపును ఫిబ్రవరి 4 వరకు కేంద్రం పొడిగించింది. రైతు ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ జనవరి 28 వరకు ఉండగా, సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా పొడిగించింది.

  • 29 Jan 2021 01:46 AM (IST)

    అర్ధరాత్రి కూడా కొనసాగుతున్న రైతుల నిరసనలు

    ఘాజీపూర్‌లో అర్ధరాత్రి వరకు కూడా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు భారీగా వస్తుండటంతో ఘాజీపూర్ సరిహద్దులకు భారీ ఎత్తున పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించాయ.

  • 29 Jan 2021 12:55 AM (IST)

    శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టులు

    ఘాజీపూర్‌ వద్ద రైతుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు నిజమైన నేరస్థులపై చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను అరెస్టు చేస్తున్నారని సంయుక్త కిసాన్‌ మోర్చ నాయకులు తెలిపారు.

  • 29 Jan 2021 12:40 AM (IST)

    ఇతర రాష్ట్రాల నుంచి ఘాజీపూర్‌కు రైతులు

    గురువారం అర్ధరాత్రి వరకు ఇతర రాష్ట్రాల నుంచి ఘాజీపూర్‌కు రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తాము శాంతియుతంగానే కూర్చోని నిరసన తెలుపుతున్నామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేష్‌ టికైట్‌ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు నీరు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

  • 28 Jan 2021 11:57 PM (IST)

    సరిహద్దును ఖాళీ చేయబోము

    ఘాజిపూర్ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. ఆందోళన కొనసాగిస్తూనే ఉంటామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేష్‌ టికైట్‌ అన్నారు. ఘాజిపూర్‌ సరిహద్దును విడిచి వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు. తమను బలవంతంగా ఖాళీ చేయిస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని ఆయన హెచ్చరించారు.

  • 28 Jan 2021 11:15 PM (IST)

    ఢిల్లీ వైపు కవాతు ప్రారంభించేందుకు గుమిగూడిన రైతులు

    ఘాజీపూర్ ప్రాంతం నుంచి వెంటనే దీక్ష విరమించి వెళ్లిపోవాలని పోలీసులు రైతులను ఆదేశించినా పట్టించుకోవడం లేదు. దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హర్యానా రైతులు ఢిల్లీ వైపు కవాతు చేయనున్నారు. ఈ రాత్రి ఢిల్లీ వైపు కవాతు ప్రారంభించేందుకు భివానీలోని కుంగర్‌ గ్రామంలో రైతులు గుమిగూడారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

  • 28 Jan 2021 10:45 PM (IST)

    ఆందోళనలు విరమించిన మరో రెండు రైతు సంఘాలు

    సరిహద్దుల్లో మరో రెండు రైతు సంఘాలు ఆందోళనలు విరమించాయి. ఆందోళనను విరమిస్తున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌, కిసాన్‌ మహా పంచాయత్‌లు ప్రకటించాయి. ఇప్పటి వరకు నాలుగు రైతు సంఘాలు ఆందోళన విరమించాయి.

  • 28 Jan 2021 10:41 PM (IST)

    సరిహద్దులను ఖాళీ చేసి వెళ్లేది లేదు

    సరిహద్దులను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసిన పోలీసులు, 144 సెక్షన్‌ విధించారు. సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఖాళీచేసి వెళ్లేది లేదంటున్నారు. బలవంతంగా ఖాళీ చేయిస్తే ఉరేసుకుంటామని రైతులు హెచ్చరిస్తున్నారు.

  • 28 Jan 2021 09:56 PM (IST)

    సింఘ్ సరిహద్దును పూర్తిగా మూసివేసిన అధికారులు..

    రైతులను దీక్షస్థలి నుంచి ఎట్టి పరిస్థితుల్లో తరలించాలని చూస్తోన్న అధికారులు ఆ దిశలో చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే సింఘ్ సరిహద్దును పూర్తిగా మూసేశారు. సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తోన్న రైతులను వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. రహదారులను దిగ్బంధించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని రైతులకు నోటీసులు అందించారు.

  • 28 Jan 2021 09:56 PM (IST)

    మూడు ప్రాంతాలకు భారీగా చేరుకున్న పోలీసు బలగాలు..

    సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రైతులు చేపడుతోన్న దీక్షను ఎట్టి పరిస్థితుల్లో ఈరోజుతో చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసులను మోహరిస్తోంది. ఈ క్రమంలోనే సింఘ్, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దులకు భారీ ఎత్తున పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు.

  • 28 Jan 2021 09:44 PM (IST)

    కిసాన్ ర్యాలీ హింసపై పెరుగుతోన్న కేసులు..

    జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తదనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై నమోదైన కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలోని వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో ఇప్పటి వరకు 33 కేసులు నమోదయ్యాయి. వీటిలో 9 కేసులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఇందులో భాగంగా రైతు సంఘాల నేతలు సహా 44 మంది నిందితులపై లుకౌట్ నోటీసులు ఇచ్చారు.

  • 28 Jan 2021 09:31 PM (IST)

    ఘాజీపూర్‌కు పెద్ద ఎత్తున కేంద్ర, యూపీ బలగాలు..

    రైతులను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఘాజీపూర్ నుంచి పంపించేయడానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం ఘటనాస్థలికి భారీగా బలగాలను తరలిస్తోంది. ఇప్పటికే సీఆర్‌పీఎఫ్ బలగాలు ఘాజీపూర్‌కు చేరుకున్నాయి. ఇక యూపీ ప్రభుత్వం కూడా రైతులను 24 గంటల్లో రహదారిని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

  • 28 Jan 2021 09:19 PM (IST)

    బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని హతమార్చేందుకు కుట్రలు పన్నుతోంది…

    మూడు చట్టాలను రద్దు చేసే వరకు ఘాజీపూర్ ఖాళీ చేసేది లేదని చెబుతోన్న రైతుల సంఘాల నేతలు. శాంతియుతంగా చేస్తున్న దీక్షలను భగ్నం చేస్తే అక్కడే ఉరివేసుకుంటామని చెబుతున్నారు. ఈ క్రమంలోనే భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం తమను హతమార్చేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.

  • 28 Jan 2021 09:03 PM (IST)

    బలవంతంగా ఖాళీ చేయిస్తే.. ఉరేసుకుంటాం: రైతులు

    ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రాత్రి ఘాజీపూర్ ఖాళీ చేయాల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నా.. రైతులు మాత్రం వెనుకడగు వేయట్లేదు. ఒకవేళ పోలీసులు తమను బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తే ఉరేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నీరు, విద్యుత్ సరఫరాను పూర్తిగా తొలగించినా అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లేది లేదంటూ తేల్చి చెబుతున్నారు.

  • 28 Jan 2021 08:56 PM (IST)

    ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడమే కారణమా..?

    పోలీసులు ఉన్నపలంగా రైతుల దీక్షను విరమించడానికి ఇంత పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దించడానికి ట్రాక్టర్ ర్యాలీనే కారణమని భావిస్తున్నారు. జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడం, ఎర్రకోటపై జెండా ఎగరవేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం ఎలాగైనా రైతుల దీక్షను విరమింపజేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

  • 28 Jan 2021 08:50 PM (IST)

    రైతులపై దాడులు చేయద్దొంటూ భారతీయ యూనియన్ నేత కన్నీళ్లు..

    ఘాజీపూర్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెద్ద ఎత్తున మోహరించి.. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు రాత్రి రైతులను అక్కడి నుంచి పంపించేయలన్నా పట్టుదలతో ఉండడంతో నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులపై దాడులకు దిగొద్దంటూ భారతీయ యూనియన్ నేత కన్నీటీ పర్యంతమయ్యారు. మరి గురువారం రాత్రి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయో చూడాలి.

  • 28 Jan 2021 08:46 PM (IST)

    ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన మరో యూనియన్..

    ఓవైపు ఘాజీపూర్‌లో రైతులు దీక్ష విరమింపజేసేది లేదు అంటూ ప్రకటిస్తున్న సమయంలోనే మరోవైపు.. కొన్ని రైతు సంఘాలు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతున్నాయి. తాము ఆందోళనలను విరమిస్తున్నామని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేష్ తికాయత్ తాజాగా ప్రకటించారు. ప్రభుత్వ విధానాలతో తాము ఆందోళన విరమించక తప్పని పరిస్థితి నెలకొందని నరేష్ తికాయత్ అన్నారు.

  • 28 Jan 2021 08:42 PM (IST)

    ఆందోళన విరమించేది లేదంటున్న రైతులు..

    ఓవైపు పోలీసులు భారీగా ఎత్తున మోహరించినా, 144 సెక్షన్ విధించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఘాజీపూర్‌ను వదిలి వెళ్లేది లేదంటూ రైతులు స్పష్టం చేస్తున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఘాజీపూర్‌ను ఖాళీ చేసి వెళ్లేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. వేలాది సంఖ్యలో మరింత మంది రైతులు తరలి వచ్చి ఉద్యమాన్ని ఉదృతం చేస్తారని చెబుతున్నారు.

  • 28 Jan 2021 08:38 PM (IST)

    రైతులకు నోటీసులు అందజేసిన పోలీసులు..

    ఘాజీపూర్ ప్రాంతం నుంచి వెంటనే దీక్ష విరమించి వెళ్లిపోవాలని రైతులను ఆదేశించిన పోలీసులు వారికి సీఆర్పీసీ సెక్షన్ 133 ప్రకారం నోటీసులు అందజేశారు. అంతేకాకుండా ఘాజీపూర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

  • 28 Jan 2021 08:31 PM (IST)

    భారీగా మోహరించిన పోలీసులు..

    ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్‌లో ఉన్న రైతులను గురువారం రాత్రిలోపు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రైతులు దీక్ష చేస్తున్న ప్రదేశంలో పోలీసులు భారీగా మోహరించారు. రైతులు స్వచ్ఛందంగా ఖాళీ చేయకపోతే పోలీసులు బలవంతంగా అయినా వారిని అక్కడి నుంచి పంపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Published On - Jan 29,2021 3:03 AM