Indian IT Sector: కొత్త ఏడాది ఐటీ నియామకాల్లో 20 శాతం వృద్ది.. ఈ స్కిల్స్‌కి ఫుల్ డిమాండ్!

భారత్ ఐటీ మార్కెట్ కొత్త ఏడాది శుభ సూచకంగా ఉంది. కోవిడ్ సంక్షోభంలో కుదేలైన ఐటీ రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. 2025లో ఐటీ సెక్టార్ మరింత అభివృద్ది చెందుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇక నియామకాలు కూడా 20 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు జోష్యం చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న స్కిల్స్ లో నైపుణ్యం పొందిన వారిని మాత్రమే అవకాశాలు వరిస్తాయని చెబుతున్నారు..

Indian IT Sector: కొత్త ఏడాది ఐటీ నియామకాల్లో 20 శాతం వృద్ది.. ఈ స్కిల్స్‌కి ఫుల్ డిమాండ్!
Indian IT Sector
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 01, 2025 | 1:44 PM

కొత్త ఏడాది ఐటీ రంగానికి కలిసొచ్చేలా ఉంది. ఐటీ ఉద్యోగ నియామకాల్లో దాదాపు 20 శాతం వృద్ధి కనిపించే అవకాశం ఉందని హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్) ప్లాట్‌ఫామ్ ఫస్ట్‌మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్ మంగళవారం (డిసెంబర్‌ 31) తెలిపింది. 2024 ఏడాది మొత్తం ఒక్కసారి కలియజూస్తే.. వేగవంతమైన డిజిటల్ పరివర్తన, అభివృద్ధి చెందుతున్న టెక్ ఉద్యోగ ప్రొఫైల్‌ను గమనించవచ్చు. దీని ప్రభావంతో ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో 2025లో కొత్త ఉపాధి అవకాశాలలో ఇంటియన్‌ IT, టెక్ ఎకోసిస్టంలో 17 శాతం వృద్ధి ఖాయం అని ఫస్ట్‌మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది.

ఫస్ట్‌మెరిడియన్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ సీఈఓ, ఐటీ స్టాఫింగ్‌ సునీల్‌ నెహ్రా మాట్లాడుతూ.. కోవిడ్‌ సంక్షోభం తర్వాత ఐటీ రంగం తిరిగి ఊపందుకుంది. 2025లో మరింత వృద్ధి కొనసాగుతుంది. అదే సమయంలో అప్లికేషన్ డెవలపర్‌లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, DevOps ఇంజనీర్లు, AI, ML, సైబర్ వంటి ప్రొఫైల్‌లలో సగటున 20 శాతం పెరుగుదల ఖాయమని తెలిపారు. దీనితోపాటు 2024లో ట్రెండ్‌ సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) 2025లో మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని నెహ్రా పేర్కొన్నారు.

ఈ రంగంలో డేటా అనలిస్ట్‌లు, డేటా ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు వంటి ఇతర ప్రొఫైల్స్‌కు అధిక డిమాండ్‌ రానుంది. 2028 నాటికి ఒక్క Gen-AI ఇండస్ట్రీలోనే ఏకంగా 10 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు సృష్టిస్తుందని ఆయన అంచనా వేశారు. జెనరేటివ్ AI ఇంజనీర్, అల్గారిథమ్ ఇంజనీర్, AI సెక్యూరిటీ స్పెషలిస్ట్ వంటి Gen-AI జాబ్స్‌కు వేతనాలు గతేడాది కంటే భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. ఇది దేశ జీడీపీలో 25-30 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

వ్యాపారాలు విస్తరించేక్రమంలో నియామకాల్లో పెరుగుదల, కొత్త ప్రాజెక్ట్‌లకు కలిసిరావడంతోపాటు డిజిటల్ మౌలిక సదుపాయాలను సైతం మెరుగుపరుస్తుంది. ఇది సాంకేతిక పురోగతికి అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCలు) వంటి కంపెనీలు 2018-19, 2023-24 మధ్య 6 లక్షల ఉద్యోగాలను సృష్టించాయి. 2030 నాటికి ఈ కంపెనీలు 2.5 నుంచి 2.8 మిలియన్ల మందికి ఉపాధి కల్పించనున్నాయి. అలాగే BFSI, టెలికాం వంటి ఇతర నాన్-టెక్ సెక్టార్‌లు కూడా 2025లో IT/టెక్ నిపుణులను పెంచుకునే అవకాశం ఉంది. అయితే 2025లో ఐటీ ల్యాండ్‌స్కేప్‌లో పటిష్టమైన శ్రామికశక్తిని పెంపొందించడానికి టెక్ అప్‌స్కిల్లింగ్‌పై దృష్టి సారించాం. మెజారిటీ పెద్ద సంస్థలు, మధ్యస్థ కంపెనీలు తమ నైపుణ్య బడ్జెట్‌లను సగటున 15-20 శాతం పెంచుతాయని భావిస్తున్నట్లు నెహ్రా చెప్పారు. రానున్న కొత్త నియామకాలను అందిపుచ్చుకోవడానికి యువత తమ స్కిల్స్‌ అప్‌గ్రేడ్ చేసుకుంటారు. దీంతో ఐటీ గిగ్‌ ఆర్ధిక వ్యవస్థ మూడు రెట్లు వృద్ధి చెందుతుందని, 2030 నాటికి 24 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తుందని మిశ్రా అంచనా వేశారు. ఈ డిమాండ్ టైర్ 1, టైర్ 2 నగరాల మధ్య 1:1 నిష్పత్తిలో ఉంటుందని చెప్పారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.