దుబ్బాకలో వేడెక్కుతున్న ప్రచారం

నామినేషన్ల పర్వం ముగియడంతో దుబ్బాక ఎన్నికల పర్వం మరింత వేడెక్కింది. మొత్తం 46 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పరస్పరం మాటల తూటాలు...

దుబ్బాకలో వేడెక్కుతున్న ప్రచారం
Follow us
Rajesh Sharma

|

Updated on: Oct 17, 2020 | 3:19 PM

Dubbaka election campaign heating-up: నామినేషన్ల పర్వం ముగియడంతో దుబ్బాక ఎన్నికల పర్వం మరింత వేడెక్కింది. మొత్తం 46 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటూ దుబ్బాక ఓటలర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నాలను వేగవంతం చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున మంత్రి హరీశ్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డిలతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో మోహరించారు. కాంగ్రెస్, బీజేపీలు కూడా రాష్ట్ర స్థాయి నాయకులను దుబ్బాకకు తరలించి, మండలాలు, మేజర్ గ్రామపంచాయితీలవారీగా ఇంఛార్జీలను నియమించారు.

నియోజకవర్గంలో బీడి కార్మికులు, చేనేతలు, యువకులను ప్రసన్నం చేసుకుంటే భారీ మెజారిటీతో విజయం ఖాయమని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. బీడి కార్మికులు, చేనేత వర్గాల ఓట్లు సుమారు 55 వేలుగా వుంటాయని భావిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 1.97 లక్షల ఓటర్లున్నారు. 20 శాతం ఓట్లు యువకులవేనని సమాచారం. అందుకే ప్రధాన రాజకీయ పార్టీలు బీడి కార్మికులు, చేనేత వర్గాలతోపాటు యువకులకు గాలమేసేందుకు శ్రమిస్తున్నాయి.

దానికి తోడు నియోజకవర్గంలో యువత కూడా మూడు పార్టీల ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ వేసే రోజు వేలాది సంఖ్యలో యువతకు హాజరయ్యారు. దానికి పోటీగా దౌలతాబాద్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీకు గులాబీ నేతలు పెద్ద ఎత్తున యువతకు సమీకరించారు. అటు కాంగ్రెస్ పార్టీ సైతం తామేమీ తక్కువ తినలేదన్నట్లు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ శ్రేణులను నియోజకవర్గంలో మోహరించి, యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులతోపాటు పలు చిన్నా చితకా పార్టీ అభ్యర్థులు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 46 మంది బరిలో నిలిచారు. అయితే విత్ డ్రాకు ఇంకా అవకాశం వుండడంతో చివరికి ఎంత మంది బరిలో నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Also read: చైనాకు భారత్ మరో ‘చెక్‘