ఫుట్ బాల్ మాంత్రికునికి కన్నీటి వీడ్కోలు, పోలీసులతో ఘర్షణ పడిన వేలాది అభిమానులు, శోక సంద్రమైన ఆర్జెంటీనా
ఆర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ లోని ప్రెసిడెన్షియల్ ప్యాలస్ వద్దకు ఆయన శవపేటికను తీసుకువస్తుండగా అభిమానులు దాన్ని చుట్టుముట్టడానికి, దగ్గరగా చూసేందుకు యత్నించారు. వీరిని అదుపు చేసేందుకు..
గుండెపోటుతో మరణించిన ఫుట్ బాల్ మాంత్రికుడు డీగో మారడోనాకు కడసారి నివాళులర్పించేందుకు ఆయన శవపేటిక వద్దకు వేలాది అభిమానులు చేరుకున్నారు. ఆర్జెంటీనా దాదాపు శోకసంద్రమైంది. డీగో శవపేటికపై ఆయన అభిమానులు పూలు, పతాకాలు, ఫుట్ బాల్ షర్టులు విసిరారు. మెదడులో బ్లడ్ క్లాట్ అయిన డీగోకు రెండువారాల క్రితం సర్జరీ జరిగింది. అయితే గుండెపోటుతో 60 ఏళ్ళ డీగో బుధవారం కన్ను మూశాడు. ఫుట్ బాల్ క్రీడా చరిత్రను తిరగరాసిన డీగో అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడైనా వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యాడని తెలుస్తోంది.
Video Courtesy: Mail Online
ఆర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ లోని ప్రెసిడెన్షియల్ ప్యాలస్ వద్దకు ఆయన శవపేటికను తీసుకువస్తుండగా అభిమానులు దాన్ని చుట్టుముట్టడానికి, దగ్గరగా చూసేందుకు యత్నించారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఓ సందర్భంలో అధ్యక్ష భవనం సమీపంలోని మెటల్ బ్యారియర్ ని ఫ్యాన్స్ లాగివేసి పోలీసులపైకి దూసుకువెళ్లేందుకు యత్నించగా తమను తాము రక్షించుకునేందుకు వారు షీల్డులను అడ్డుపెట్టుకున్నారు. ఫ్యాన్స్ లో అనేకమంది విలపిస్తూ గుండెలు బాదుకున్నారు. కాగా… డీగో మారడోనా లాయర్ మేటేసా మోర్లా..ప్రభుత్వ అధికారులపై మండిపడ్డారు. తన క్లయింటుకు 12 గంటలపాటు ఎలాంటి వైద్య సాయం అందలేదని, ఆసుపత్రిలో కనీసం వైద్య పరీక్షలు సైతం జరగలేదని ఆరోపించారు. అంబులెన్స్ రావడానికి అరగంట పట్టిందని తెలిపిన ఆయన.. ఇది ‘క్రిమినల్ ఇడియోసీ’ అని నిప్పులు కక్కారు. మారడోనా మృతికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు జరగాలని మేటేసా డిమాండ్ చేశారు.