సినీ వినీలాకాశంలో పండు వెన్నెల జాబిల్లి, పాటలకు పరిమళాలను అద్దిన బొడ్డు మల్లి దేవులపల్లి కృష్ణశాస్త్రి.
కమ్మని గుమ్మపాలు, జుంటితేనెలను కలిసిన మధురమైన లలిత సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రిది. ఆయన సినీ నందనవనంలో విరిసిన పారిజాతం. సినీ వినీలాకాశంలో..
కమ్మని గుమ్మపాలు, జుంటితేనెలను కలిసిన మధురమైన లలిత సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రిది. ఆయన సినీ నందనవనంలో విరిసిన పారిజాతం. సినీ వినీలాకాశంలో పండు వెన్నెల జాబిల్లి. పాటలకు పరిమళాలను అద్దిన బొడ్డు మల్లి. నిండు గౌరవం తెచ్చిన పాలవెల్లి. ఇవాళ ఆ భావ కవి వర్ధంతి కాబట్టి ఆ కళాప్రపూర్ణుడి గురించి కాసింత తెలుసుకుందాం! కృష్ణశాస్త్రి కవితల్లో ఎంత భావుకత నిండివుంటుందో పాటల్లో కూడా అంతే. రాసిన ప్రతి పాటలోనూ ఆయన ముద్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వినిపిస్తుంది. పద లాలిత్యము, భావనా సౌకుమార్యము ఆయన సంతకాలు. సినీ గేయాలలో ఆయన ఏ భావాన్ని వదిలిపెట్టలేదు. శృంగార మాధుర్యము, సంయోగ ఆనందము, వియోగ వేదన, విషాదం, కరుణ, భక్తి, మధురభక్తి, సుందర ప్రకృతి చిత్రణ, సామాజిక స్పృహ, జాతీయ భావన ఇలా అన్నీరాశారు. మల్లీశ్వరి సినిమాలోని మనసున మల్లెల మాలలూగెనే పాట తర్వాతే కదా మనకు నిరీక్షణలో మాధుర్వం అలా ఉంటుందని తెలిసింది! ఆ మాటకొస్తే మనసున మల్లెల మాలలూగడమన్నది ఎంత విచిత్ర పదచిత్రం. అసలు ఇది దేవులపల్లి పాట! ఇది దేవులపల్లి పాటే అని చాలా సునాయాసంగా చెప్పేయవచ్చు . ఊగే గాలులు, తూగే తీగలు, గువ్వల గుసగుసలు, చీరె చెరగు గుస గుసలు, హంసల నడకలు, మల్లెల మాలలు, వెన్నెల డోలలు, మువ్వల మురళులు, నవ్వే పెదవులు, ఆమని కోయిలలు, వసంతగాలులు ఎన్నన్ని చెప్పగలం. మేఘమాలను ఆయన వర్ణించిన తీరు అద్భుతం. అందాల మేఘమాలన్నారు, చందాల మేఘమాలన్నారు, నీలాల మేఘమాలన్నారు, రాగాల మేఘమాలన్నారు, మమతలెరిగిన మేఘమాలన్నారు, మనసు తెలిసిన మేఘమాలన్నారు, జాలి గుండెల మేఘమాలన్నారు. మేఘమాలకున్న లక్షణాలన్నీ ఆయన పాటల్లో ప్రతిఫలిస్తాయి. రాజమకుటంలోని సడి సేయకోగాలి పాట నేపథ్యమేమిటంటే అలసిపోయి ఆమె ఒడిలో పడుకున్నాడు చెలికాడు. అతను ఆమెకి చక్రపీఠిక లేని రాజు. అతడామె ఒడిలో పవళించడమే ఆమెకు మధురానుభూతి. ఏమాత్రం సవ్వడి అయినా మేలుకుంటాడు. ఏటిలో అలలు గలగలమన్నా కొమ్మల్లో ఆకులు కదిలినా ఆ చిరుసవ్వడికే ఉలికిపడి లేస్తాడు! అప్పుడు తన ఆనందానికి అంతరాయం కలుగుతుందనే బాధ. నిదుర చెడితే ఆమె ఊరుకోదు. గాలిని సడిచేయవద్దని మందలిస్తోందా ముగ్ధ. ఎంత అద్భుతమైన భావుకత! పాటలాగే బతుకంతా సాగాలంటారు కృష్ణశాస్త్రి.. పాటను రమణీయమైన జీవితంతో పోల్చడం, పాటలాగే బతుకంతా కమనీయంగా సాగాలనుకోవడం గొప్పగా వుంది కదూ!
తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం దగ్గర చంద్రపాలెంలో 1897, నవంబరు ఒకటిన జన్మించారు కృష్ణశాస్త్రి. కాకినాడలో చదివేటప్పుడు బ్రహ్మసమాజం ప్రభావితం చేసింది. అప్పుడే ఎన్నో గేయాలు రాశారు. ఆయన సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది. బెజవాడ గోపాలరెడ్డితో కృష్ణశాస్త్రికి చక్కటి స్నేహం వుండేది. దిగ్దర్శకుడు బి.ఎన్.రెడ్డికి దేవులపల్లిని పరిచయం చేసిందే ఆయన! అప్పటికే శాస్త్రిగారి పాటలు రేడియోలో వినివున్నారు బి.ఎన్. తను తీయబోయే మల్లీశ్వరికి రచన చేయమని కోరారు. అలా మల్లీశ్వరికి మాటలు పాటలు రాశారు. ఆ చిత్రం కృష్ణశాస్త్రిని సినీ సింహాసనం మీద కూర్చొబెట్టింది. సాలూరి రాజేశ్వరరావు సంగీతం..కృష్ణశాస్త్రి సాహిత్యం ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. ఈ సినిమాతోనే భావకవిత్వం తెలుగువారికి మరింత దగ్గరైంది. కూతురు సీత చిన్నవయసులోనే చనిపోవడం…కేన్సర్‌తో గొంతు మూగబోవడం కృష్ణశాస్త్రిని కుంగదీశాయి. ఈ మనోవేదనలతోనే కవిత్వానికి కొంతకాలం దూరమయ్యారు. ఆకాశవాణిలో ఉద్యోగం కూడా వదిలేసుకున్నారు. ఆ సమయంలోనే పాలగుమ్మి పద్మరాజు సుఖదు:ఖాలు సినిమాకు పాటలు రాయమని కోరారు. అలా కృష్ణశాస్త్రి మళ్లీ చిత్ర రంగానికి వచ్చారు. వాడిపోయిన తీగ మళ్లీ కొత్త చిగురుతొడుక్కుంటుంది. ఆ లతకు మళ్లీ వసంతమొస్తుంది. అది కుసుమిస్తుంది. అలాగే జీవితం కూడా. విషాదమయ జీవితంలో మళ్లీ వసంతం తొంగి చూస్తుంది. ఆ వసంతం ఎప్పటికీ వాడదు. అది శాశ్వతంగా నిలుస్తుంది.
ఉంటే మల్లెల మాసముంటుంది. వెన్నెల వేళ వుంటుంది.. కృష్ణశాస్త్రి ఏమిటి ఇలా రాశారు అనుకున్నారంతా! వెన్నెల మాసం-మల్లెల వేళా అన్న భావం తొందరపడే కోయిలదే..అందుకే ఆయన అలా రాశారు. ప్రభాతవేళను సూచించడంలో కృష్ణశాస్త్రి కలం ఎన్నో హొయలు పోయింది. గురివింద పొద కింద గోరింక పలకడం. గోరింట కొమ్మల్లో కోయిల పలకడం. ఇవన్నీ వేకువకు చిహ్నాలు. ఉండమ్మ బొట్టుపెడతా సినిమాలో ఆ దొంగ కలువ రెక్కల్లో అన్న పాటలో కళ్లను తూనీగలతో పోల్చారు దేవులపల్లి. సాధారణంగా కళ్లను కలువరేకులతో పోలుస్తారు. కాని రెప్పల సందుల్లోంచి ఓరగా ముసిరే చూపులను తూనీగలతో పోల్చడం సరికొత్త భావన. కృష్ణశాస్త్రి పాటలు సామాన్యులకు కూడా సులభంగా అర్థమవుతాయి. చాలా తేలిక పదాలతో ఆయన రాసిన పాటలు కూడా చాలానే వున్నాయి. కావాలంటే అమ్మమాట సినిమాలోని ఎంతబాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా అన్న పాట విని చూడండి. మీకే అర్థమవుతుంది. భాగ్యరేఖ సినిమాలో శృంగారాన్ని భక్తిని మేళవించి రాసిన ఓ అద్భుతమైన గీతముంది. నీవుండేదా కొండపై అన్న ఆ పాటలో ఉన్నత స్థితిలో వున్న నాయకుడికి పేదరాలి మనసును స్వీకరించమంటోంది. భగవంతుడిపై భక్తిని చాటుకుంటూనే పరోక్షంగా ప్రియుడికి తన స్థితిగతులను చెప్పుకుంటోంది. విరహం, ప్రేమ, ప్రణయం ఇవే కాదు భగవంతుణ్ణి భక్తితో ఆరాధనతో కవితా కుసుమాలతో అలంకరించారు కృష్ణశాస్త్రి. ప్రేమికుల విరహం, దంపతుల విరహం ఒక్కలా వుండదు. రెంటికీ మధ్య సన్నటి విభజన రేఖ వుంటుంది. కృష్ణశాస్త్రికి ఇది బాగా తెలుసు. బలిపీఠం సినిమాలో ఆయన రాసిన కుశలమా అనే ఓ విరహ గీతంలో ఇది కనిపిస్తుంది. ఉద్యోగ రిత్యా వేరు వేరు ప్రాంతాల్లో నివసిస్తోన్న భార్య భర్తలు పాడుకునే విరహగీతమిది. హద్దులు దాటని శృంగార గీతమిది. పూలగాలి రెక్కలపై కబుర్లను పంపాడట ప్రియుడు. నీలిమబ్బు పాయల్లో కళ్లను వంపాడట. విరహాన్ని ఇంతకంటే ఇంకెవరండి బాగా చెప్పేది? చంద్రవంక తారవంక ఒరగడమంటే ప్రియుడు ప్రేయసి పట్ల వలపును ప్రకటించడటమట! విరజాజి తీగ మావి చెంతకు జరగడమంటే ప్రేయసి ప్రియుడిపై తన అనురాగాన్ని వ్యక్తపరచడటమట! ఎంత గొప్ప ప్రణయభావన ఇది. భావ కవులవలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలని పింగళి అంటే అన్నారు కానీ..కృష్ణశాస్త్రి భావ కవిత్వం వెన్నెల వెలుగు. పారిజాతపు పూలు. తెలుగు పాటల్లో ఆయన కొత్త ఒరవడిని చూపించారు. వెన్నెల రాత్రులను, సందెవేళలను, మధురమైన రేయిలను మనకు పరిచయం చేసింది ఆయనే కదా! రాముడి కోసం ఆత్రంగా ఎదురుచూసే శబరి పాట రాయాలంటే కృష్ణశాస్త్రిగారే రాయాలి. తెర మీద శబరి ప్రత్యక్షమైనప్పుడల్లా ఆమెకు సాయం చేసింది కృష్ణశాస్త్రే! రాముడొస్తున్నాడంటే ప్రకృతీ పరవశించిపోతుందట! కొలను నీరు ఊరికే ఉలికి ఉలికి పడుతుందట! ఓరగా నెమలి పింఛమారవేసుకుంటుందట! గుహుడు సీతారామలక్ష్మణులను నదిని దాటించే దృశ్యాన్ని కృష్ణశాస్త్రి దయనీయంగా రమణీయంగా వర్ణిస్తారు. మానవమాత్రులెవరూ కష్టాలకు అతీతం కాదు..దానికి కారణం ఆ జగన్మోహనుడే! పాటలో వేదాంతం వుంటుంది. వేదనా వుంటుంది. ఎన్టీయార్ అభ్యర్థన మేరకు శ్రీరామపట్టాభిషేకం సినిమాలో ఈ గంగకెంత దిగులు అన్న పాటను రాశారు కృష్ణశాస్త్రి. ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకు పాట మళ్లీ ఓసారి వినండి. నిజంగానే కొమ్మలకూ పూలివ్వాలని ఎవరు చెబుతారు? హరిపూజకు వేళయితే కొమ్మలు మాత్రం పూలు ఇవ్వకుండా వుంటాయా? హరిసేవకు పూలూ తొందరపడవూ!
దేవులపల్లి పాటలు పిల్ల తెమ్మరలా మనసును కమ్మేస్తాయి. మల్లె పరిమళంలా సమ్మోహనపరుస్తాయి. మంచిరోజులొచ్చాయి సినిమాలో నేలతో నీడ అన్నది అన్న పాటలో సమభావం-సమధర్మం- సహజీవనము అనివార్యమంటారు. అది తెలుసుకోవడం మన ధర్మమంటారు. మానవులంతా ఒక్కటేనంటారు. అడుగడుగున గుడి ఉంది పాటలో దేవుడి కోసం గుళ్లు గోపురాలు చుట్టనక్కర్లేదనీ, మనిషి వెలిగితే ఆయనే దేవుడనీ పరోక్షంగా చెబుతారు. లలిత సుందరమైన పదాల కూర్పు, మధుర మనోజ్ఞమైన భావాల తీర్పు కృష్ణశాస్త్రి రచనలోని వైశిష్ట్యాన్ని పట్టి ఇస్తాయి. ఆయన భువనంలోని నదీ సుందరినీ గగనంలోని జాబిలినీ కూడా మనోహరంగా వర్ణించగలరు. బెజవాడ నుంచి బళ్లారికి రైల్లో వెళుతుంటే.. చుట్టూ కనిపించిన పొలాల సౌందర్యానికి రైలు లయకూ పరవశించి ఆకులో ఆకునై అంటూ పలవరించారట! మనకు కీట్స్, షెల్లీ, వర్డ్స్‌వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశంలో కృష్ణశాస్త్రిగా పుట్టివుంటారని నా అభిప్రాయం అని విశ్వనాథ సత్యనారాయణ ఓసారి అన్నారు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ..ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ అంటారు చలం. తెలుగు సినీ రంగం విషయానికొస్తే ఇద్దరూ ఇద్దరే! ఒకరు మండు వేసవి అయితే..మరొకరు పండు వెన్నెల. కృష్ణశాస్త్రి మరణించిన రోజున తెలుగుదేశపు నిలువుటద్దం బద్దలైంది. షెల్లీ మళ్లీ మరణించాడు అని శ్రీశ్రీ దుఃఖించారు. తేట తేట తెలుగు పదాలతో…పాటలకు గౌరవం తీసుకున్న స్వచ్ఛమైన కవి కృష్ణశాస్తి. ఇలా రాసుకుంటూ పోతే ఆ కవితా దురంధుడి గురించి ఎంతైనా రాయవచ్చు. ఎన్ని పాటలనైనా ప్రస్తావించుకోవచ్చు. తెలుగు సినిమాకు కృష్ణశాస్త్రి ఓ వరం. ఆయన చివరి శ్వాస వరకు అద్భుతమైన పాటలను రాశారు. లెక్కలు తీస్తే ఎన్నో వుండవు. మహా అయితే నాలుగొందలుంటాయేమో! అయితేనేం ఒక్కో పాట వెయ్యి పాటల పెట్టు. అందుకే ఇప్పటికీ కృష్ణశాస్త్రిని గుర్తుంచుకుంటున్నాం. గుర్తుంచుకుంటాం.