AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దక్షిణ భారతానికి మరో వానగండం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం.. తీవ్ర తుఫాన్ గా మారే ఛాన్స్..

దక్షిణ భారతానికి మరో వానగండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రంగా మారి.. తీవ్ర తుఫాన్ ఏర్పడనున్నట్లు వెల్లడించారు.

దక్షిణ భారతానికి మరో వానగండం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం.. తీవ్ర తుఫాన్ గా మారే ఛాన్స్..
Balaraju Goud
|

Updated on: Nov 23, 2020 | 11:40 PM

Share

దక్షిణ భారతానికి మరో వానగండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రంగా మారి.. తీవ్ర తుఫాన్ ఏర్పడనున్నట్లు వెల్లడించారు. ఈ తుపానుకు నివర్‌ అనే పేరు పెట్టనున్నారు. వాయుగుండం ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాగల 12 గంటల్లో వాయుగుండం తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తదుపరి 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారనున్నట్లు వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

ఈ నివర్ తుఫాన్ ఈ నెల 25న సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం – కరైకల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడు సహా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలావుంటే, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నివర్ తుపాను కారణంగా కడల్లోర్, విల్లుపురం, పుదుచ్చేరి తదితర తీరప్రాంత జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో సముద్రపు నీరు చొచ్చుకువచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. తమిళనాడు తీరంలో ముందు జాగ్రత్త చర్యగా రెండు కొస్ట్ గార్డ్ నౌకలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.