AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వద్దన్నా లోన్ మంజూరు చేశారు.. అంతలోనే మాయం..

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బహుమతులు, తక్కువ ధరలో వస్తువులు అమ్ముతామంటూ అమాయకులను బురిడీకొట్టిస్తున్నారు కేటుగాళ్లు. బ్యాంక్‌ అధికారులమంటూ ఓటీపీలు పంపించి దోచేస్తున్నారు.

వద్దన్నా లోన్ మంజూరు చేశారు.. అంతలోనే మాయం..
Balaraju Goud
|

Updated on: Jul 29, 2020 | 4:39 AM

Share

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బహుమతులు, తక్కువ ధరలో వస్తువులు అమ్ముతామంటూ అమాయకులను బురిడీకొట్టిస్తున్నారు కేటుగాళ్లు. బ్యాంక్‌ అధికారులమంటూ ఓటీపీలు పంపించి దోచేస్తున్నారు. ఒకవైపు పోలీసులు అక్రమార్కుల ఆటకట్టిస్తున్నప్పటి కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నా.. ఎంతో మంది అమాయకులు సైబర్‌ నేరగాళ్ల బారినపడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్‌ నగరాన్ని టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు ఏటా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. లక్షలాది మంది వారి ఉచ్చులో పడి లక్షల్లో నష్టపోతున్నారు.

లాక్‌డౌన్‌ తర్వాత సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా లోన్‌ కావాలా అంటూ ఫోన్ కాల్ చేస్తూ మెల్లగా మాటలు కలుపుతున్నారు. అవసరం లేకున్నా.. మొహమాటపెట్టి పెద్ద మొత్తంలో బ్యాంక్‌ లోన్‌ మంజూరు చేయిస్తున్నారు. ఆ డబ్బులు అసలు ఖాతాదారుడికి కాకుండా మరొకరి ఖాతాలో జమ చేయిస్తారు. గుట్టుచప్పుడు కాకుండా ఖాతాదారుడికి తెలియకుండానే దోచేసుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు వెలుగుచూస్తున్నాయి.

తాజాగా ఇలాంటి కేసు ఒకటి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసింది. చిక్కడపల్లికి చెందిన సంగీతకు యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ కాల్ వచ్చింది. మీకు తక్కువ వడ్డీతో ఎక్కువ సొమ్ము జమ చేస్తామంటూ మాటల్లోకి దింపారు. తనకు లోన్ అవసరం లేదన్న వినకుండా లోన్‌ తీసుకోవాల్సిందేనని పట్టుబట్టి రూ.4.70 లక్షలు మంజూరు చేయించారు. ఆ మొత్తాన్ని సంగీత ఖాతాలో జమ చేయించారు. మీ ఖాతాలో ఇంత డబ్బు జమ అయిందని సంగీత ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ వచ్చిన కొద్ది క్షణాల్లో ఆమె ఖాతాలోంచి రూ.5లక్షలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే బాధితురాలు బ్యాంక్‌ సిబ్బందిని సంప్రదించింది. అయితే, వారు ఖాతాలో డబ్బు జమ అయిన వెంటనే విత్‌డ్రా కూడా అయ్యాయని స్పష్టం చేశారు. తనకు తెలియకుండానే మోసపోయాయని తెలుసుకొని సంగీత హైదరాబాద్‌ సైబర్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకుల పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏమాత్రం అనుమానం ఉన్న తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు.