రూ. కోటి నోట్లతో అమ్మవారికి అలంకరణ

దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు తిరొక్కరీతి అలంకరణలతో ఘనంగా పూజలందుకుంటున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 6:47 pm, Mon, 26 October 20
రూ. కోటి నోట్లతో అమ్మవారికి అలంకరణ

దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు తిరొక్కరీతి అలంకరణలతో ఘనంగా పూజలందుకుంటున్నారు. పాలమూరు జిల్లాలో భక్తులు తనకున్న భక్తిని కరెన్సీ నోట్లతో చాటుకున్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని గద్వాల్‌లోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని కోటి రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. నోట్లను పువ్వుల్లా తయారుచేసి అమ్మవారిని వాటితో అద్భుతంగా అలంకరించారు. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలైనప్పటికీ ఇలా కోటి రూపాయలతో అమ్మవారిని నిలువెత్తుగా దుర్గాదేవిలా అలంకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలంకరణ కోసం వివిధ రంగుల్లో ఉన్న నోట్లను ఎంచుకున్నారు నిర్వహకులు. ఆ నోట్ల మొత్తం విలువ రూ. 1,11,11,111 ఉంటుందని ఆలయ ఉత్సవ కమిటీ నిర్వహకులు తెలిపారు. గతేడాది అమ్మవారిని రూ.3,33,33,333 విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించినట్టు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం కారణంగా గతేడాదితో పోలిస్తే ఈసారి ఆ మొత్తం తగ్గిందని పేర్కొన్నారు. స్థానిక కమ్యూనిటీకి చెందిన 40-50 మంది భక్తులు ఇచ్చిన నోట్లతో వీటిని అలంకరించామని, పూజల అనంతరం వాటిని తిరిగి ఎవరికి వారికి అప్పగిస్తామని ఆలయ నిర్వహకులు వివరించారు. అయితే, కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిస్తున్నారు. లక్ష్మీ స్వరూణి అవతారం చూసి మంత్రముగ్ధులవుతున్నారు. అయితే, ఆలయ ప్రాంగణలో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆలయ సిబ్బంది తెలిపారు.