కారులో నోట్ల కట్టలు..ఆ ప్రజాప్రతినిధివి కావా..!?
పట్టుబడ్డ నగదు వ్యవహారం పోలీసుల నుంచి ఐటీ శాఖకు బదిలీ అయ్యింది. అయితే ఆ నగదు ఎవరిదీ..? పట్టుబడ్డ కారు ఎవరిదీ...?పట్టుబడ్డ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఎలా వచ్చింది....

తమిళనాడులో పట్టుబడ్డ ఓ కారులో కోట్లాది రూపాయలు ఉండటం ఏపీలో దుమారం రేపుతోంది. పట్టుబడ్డ నగదు అధికారపార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందినదిగా ప్రచారం జరుగుతోంది. పట్టుబడ్డ నగదు వ్యవహారం పోలీసుల నుంచి ఐటీ శాఖకు బదిలీ అయ్యింది. అయితే ఆ నగదు ఎవరిదీ..? పట్టుబడ్డ కారు ఎవరిదీ…?పట్టుబడ్డ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఎలా వచ్చింది.. అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఆంధ్ర సరిహద్దు దాటిన తర్వాత తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఎలావూర్ చెక్ పోస్ట్ వద్ద వేగంగా వెళ్తున్న కారు ఆపి చెక్ చేస్తే.. అందులో 5 కోట్లకుపైగా నగదు లభించింది. పట్టుబడ్డ నగదుకు ఎలాంటి రసీదు లేకపోవడంతో అక్రమ నగదుగా భావించిన పోలీసులు…కేసు నమోదు చేసి ఐటీ శాఖకు బదిలీ చేశారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఒంగోలువాసులు కాగా.. మరొకరు చిలకలూరుపేట వాసిగా గుర్తించారు. పట్టుబడ్డ నగదు 5 కోట్ల 22 లక్షల 50 వేలుగా పోలీసులు గుర్తించారు.




