Covid Vaccine Guidelines: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. గర్బిణిలు, కోవిడ్‌తో కోలుకున్నవారు టీకా ఎప్పుడు తీసుకోవాలంటే..!
Vaccination New Guidelines: కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. వైరస్ కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Corona Vaccination: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. వైరస్ కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని కోవిడ్ బాధితులు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది.
మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎన్ని రోజులకు వ్యాక్సిన్ తీసుకోవాలి? ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కరోనా వస్తే ఏం చేయాలి? అనే దానిపై చాలా మందికి స్పష్టత లేదు. వీటికి సంబంధించి తాజాగా కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ NEGVAC సిఫారసులను అంగీకరిస్తూ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఉత్తర్వుులు జారీ చేసింది.
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖకు నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ (NEGVAC) కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటిని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం.. అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. కొత్త విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తులు కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చిన 3 నెలల తర్వాతే వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొంది.
ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి కరోనా వస్తే.. వారికి పూర్తిగా తగ్గిన తర్వాతే మళ్లీ సెకండ్ డోస్ తీసుకోవాలని సూచించింది. కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న 3 నెలల తర్వాత మళ్లీ టీకా వేయించుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలున్న వారు, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారు టీకా వేసుకోకపోవడమే మంచిదని పేర్కొంది. ఇతర తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు వ్యాక్సిన్ పొందటానికి ముందు నాలుగు నుండి ఎనిమిది వారాల వరకు వేచి ఉండాలని సూచించారు.
ఇక, పాలిచ్చే తల్లులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోకుండా కోవిడ్ టీకాను వేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ భరోసా ఇచ్చింది. గర్భిణీలు మాత్రం వ్యాక్సిన్ తీసుకోకూడదని స్పష్టం చేసింది. అలాగే, కరోనా నుంచి కోలుకున్న వారు నెగెటివ్ వచ్చిన 14 రోజుల తర్వాత రక్త దానం చేయవచ్చు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా 14 రోజుల తర్వాత తమ రక్తాన్ని దానం చేయవచ్చని కేంద్రం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల్లో వెల్లడించింది.
New Recommendations of National Expert Group on Vaccine Administration for COVID19 (NEGVAC) have been accepted & communicated to States/UTs. As per new recommendations, COVID19 vaccination to be deferred by 3 months after recovery from illness: Union Health Ministry pic.twitter.com/EIm9jPjpOB
— ANI (@ANI) May 19, 2021
కరోనా మహమ్మారి తరమికొట్టేందుకు అభివృద్ధి చెందుతున్న ప్రపంచ శాస్త్రీయ ఆధారాలు, అనుభవం ఆధారంగా NEGVAC తన సిఫారసులలో పేర్కొంది.
ఇక, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 కోట్ల 55 లక్షల 12 వేల 227 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 14 కోట్ల 45 లక్షల 48 వేల 513 మందికి డోస్1 అందగా.. 4 కోట్ల 9 లక్షల 63 వేల 714 మందికి డోస్2 కూడా పూర్తైంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో ఇప్పటి వరకు 78 లక్షల 12 వేల 480 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 55 లక్షల 21 వేల 130 మందికి డోస్1 అందగా.. 22 లక్షల 91 వేల 350 మందికి డోస్2 కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 55 లక్షల 17 వేల 294 మందికి వ్యాక్సినేషన్ అందింది.