Corona Third Wave : కరోనా థర్డ్ వేవ్ చాలా డేంజర్..! హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు.. కఠిన నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి
Corona Third Wave : కరోనా వల్ల గత 2 సంవత్సరాలుగా దేశ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా
Corona Third Wave : కరోనా వల్ల గత 2 సంవత్సరాలుగా దేశ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ నుంచి కొద్ది కొద్దిగా కోలుకుంటుంటే త్వరలో మూడో వేవ్ రానుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని సూచిస్తున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్‌కు చెందిన వైద్య నిపుణుడు డిపార్టుమెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ హెడ్ డాక్టర్ మహమ్మద్ సలీం ఖాన్ మూడో ముప్పు చాలా డేంజర్ అని చెబుతున్నారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో ఏ మాత్రం అలసత్వం వహించినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించేందుకు గతంలో ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన నిబంధనల్ని ప్రతిఒక్కరూ పాటించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా మూడో దశ చాలా ప్రమాదకరమైందని, ప్రాణాంతంగా మారి ఎంతో మందిని బలితీసుకొనే అవకాశం ఉందన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో రోజువారీ పాజిటివ్ కేసులు, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగా ఉంటోందని చెప్పారు. దీంతో జనం కొవిడ్ నిబంధనలు పాటించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. ఇది చాలా ప్రమాదకరమని, ఈ నిర్లక్ష్యం కరోనా మూడో దశ ముప్పుకు దారితీస్తుందని హెచ్చరించారు.
కరోనా కేసులు, మరణాలు తగ్గడం సెకండ్ వేవ్‌పై పోరాటంలో గెలుపునకు నిదర్శనమన్న ఆయన.. కేసులు తగ్గుతున్నాయని జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మాత్రం తీవ్ర ముప్పు తప్పదన్నారు. మాస్క్‌లు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా మార్కెట్లు, హెల్త్ రిసార్టులు, వివాహ వేడుకల్లో పాల్గొనడం అనాలోచితమన్నారు. మన కుటుంబాలు, సమాజ భద్రతను, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో ఏడాదిన్నరకు పైగా ఇళ్లకే పరిమితమైపోయిన జనం.. సాధారణ జీవనాన్ని ప్రారంభించేందుకు ఆతృతతో ఉండటం సహజమేనన్నారు. కానీ బయటకు వెళ్లేటప్పుడు కఠిన నిబంధనలు పాటించడం ద్వారానే మూడో ముప్పును నివారించగలమన్నారు.