రైతుల ఆందోళనపై మళ్ళీ గళమెత్తిన సోనియా గాంధీ, మరీ ఇంత నిరంకుశమా ? బీజేపీపై ఫైర్
రైతుల ఆందోళనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మళ్ళీ గళమెత్తారు. 44 రోజులుగా అన్నదాతలు ఆందోళన చేస్తున్నా ఈ బీజేపీ ప్రభుత్వానికి స్పృహ లేదని..
Farmers Protest:రైతుల ఆందోళనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మళ్ళీ గళమెత్తారు. 44 రోజులుగా అన్నదాతలు ఆందోళన చేస్తున్నా ఈ బీజేపీ ప్రభుత్వానికి స్పృహ లేదని, వారి పట్ల నిరంకుశంగా, క్రూరంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పేద, మధ్యతరగతి అన్నదాతల నడ్డి విరుస్తోందని, కరోనాతో ఎకానమీ కుప్ప కూలిన సమయంలో మోడీ ప్రభుత్వం ఖజానా నింపుకుంటోందని ఆమె అన్నారు. ముడి చమురు ధర లీటరుకు రూ. 23.43 మాత్రమే ఉన్నప్పటికీ కేంద్రం డీజిల్ కి రూ. 74.38, పెట్రోలుకు రూ. 84.20 రేట్లతో దోచుకుంటోందని ఆమె దుయ్యబట్టారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నా ఆ ప్రయోజనాలను వినియోగదారులకు చేరనీయడంలేదన్నారు. ఇందుకు ఎక్సయిజు సుంకాన్ని భారీగా పెంచడమే నిదర్శనమన్నారు. 19 లక్షల కోట్లను జనం జేబుల నుంచి వసూలు చేసిందని పేర్కొన్న సోనియా.. వంట గ్యాస్ సిలిండర్ ధరలను కూడా పెంచారని విమర్శించారు.
యూపీఏ హయాంలో ఉన్న ఎక్సయిజు పన్ను రేట్లనే ఇప్పుడు కూడా కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. రైతుల వివాదాస్పద చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఆమె మళ్ళీ కోరారు.