నిమ్స్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ, ఆహార భద్రత కార్డుదారుల రాయితీలు కట్

అసలే కరోనా కాలం.. ఆపై లాక్ డౌన్.. రోగమొచ్చిన జనం ఆస్పత్రుల్లో చూపించుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో పుండు మీద కారం చల్లినట్లు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.

  • Balaraju Goud
  • Publish Date - 6:24 pm, Wed, 4 November 20
నిమ్స్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ, ఆహార భద్రత కార్డుదారుల రాయితీలు కట్

అసలే కరోనా కాలం.. ఆపై లాక్ డౌన్.. రోగమొచ్చిన జనం ఆస్పత్రుల్లో చూపించుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో పుండు మీద కారం చల్లినట్లు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాయితీల్లో కోత విధించాలని నిమ్స్‌ యాజమాన్యం నిర్ణయించింది. అయితే, కరోనా తీవ్రత, లాక్‌డౌన్‌లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో నిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నష్టాల పాలైందని యాజమాన్యం చెబుతుంది. ఈ నష్టాన్ని పూడ్చుకొని, ఆర్థిక పుష్టిని పెంచుకునేందుకు రాయితీల్లో కోత విధించాలని నిమ్స్‌ యాజమాన్యం నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ, ఆహార భద్రత కార్డుదారులైన రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం నిమ్స్‌లో గతంలో ఉన్న 50 శాతం రాయితీని 25 శాతానికి తగ్గించింది. వీళ్లంతా నిమ్స్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని వైద్య సేవలు మాత్రం కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పొందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. ఇలాంటి వారిని నివారించేందుకే రాయితీని కుదించామని చెప్పారు.

రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆస్పత్రి ఎప్పుడూ రద్దీగా ఉండేది. అయితే, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఓపీ రోగుల రాక చాలా వరకు తగ్గింది. ఆపరేషన్లూ నిలిచిపోవడంతో ఆస్పత్రికి వచ్చే ఆదాయంలో గండిపడింది. కొవిడ్‌కు ముందు నెలకు రూ.12-13 కోట్లు వచ్చే నిమ్స్‌ ఆదాయం, కరోనా సమయంలో రూ.1.5 – 2 కోట్లకు పడిపోయింది. ఫలితంగా ఇప్పటి వరకు రూ.50 – 60 కోట్ల నష్టం వాటిల్లడంతో ఆదాయం పెంచుకునే దిశగా ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యాధికారులు దృష్టి సారించారు. ఆయా విభాగాధిపతులతో తరచూ సమావేశాలు నిర్వహించి ఔట్‌ పేషెంట్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే ఆపరేషన్లు వాయిదా వేయకుండా వెంటనే నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. ఫాలో అప్‌ కేసులు పెంచడం, సర్జరీల సంఖ్య పెంచడం, ఆస్పత్రికి వచ్చే రోగులకు అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకుంటున్నామని నిమ్స్ సూపరిండెంట్ డాక్టర్‌ సత్యనారాయణ తెలిపారు.