టీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో సమరోత్సాహాన్ని కలిగించబోతున్న కేసీఆర్‌ బహిరంగసభ

CM KCR's public meeting : గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం ప్రీ క్లయిమాక్స్‌కు వచ్చేసింది..

టీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో సమరోత్సాహాన్ని కలిగించబోతున్న కేసీఆర్‌ బహిరంగసభ
Follow us
Balu

|

Updated on: Nov 27, 2020 | 1:05 PM

CM KCR’s public meeting : గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం ప్రీ క్లయిమాక్స్‌కు వచ్చేసింది.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సహా అన్ని పార్టీలు ప్రచారానికి మిగిలిన కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి.. ఇక ఇప్పుడు అందరి దృష్టి టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగసభపైనే పడింది.. ప్రచారపర్వంలోకి కేసీఆర్‌ రావడంతో టీఆర్‌ఎస్‌లో సమరోత్సాహం రెట్టింపయ్యింది.. కార్యకర్తల్లో జోష్‌ పెరిగింది.. శనివారం లాల్‌బహదూర్‌ స్టేడియంలో జరిగే భారీ బహిరంగసభలో కేసీఆర్‌ ఏం మాట్లాడతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొంటున్న ఏకైక బహిరంగసభ కూడా ఇదే! ప్రచారగడువు ముగియడానికి సరిగ్గా 24 గంటల ముందు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న కేసీఆర్‌ బహిరంగసభను సక్సెస్‌ చేయడానికి టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ ఇప్పటికే కార్యరంగంలోకి దూకింది.. బహిరంగసభకు భారీ జనసమీకరణ చేయడానికి సంసిద్ధమవుతోంది.. 2016లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికల సమయంలోనూ లాల్‌బహదూర్‌ స్టేడియంలో కేసీఆర్‌ బహిరంగ సభ జరిగింది.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు డిసెంబర్‌ 2న ఇదే వేదికలో ఓ బ్రహ్మండమైన బహిరంగసభ జరిగింది.. ఆ సభకు జనం పోటెత్తారు. నిజానికి 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా ఓ బహిరంగసభ ఏర్పాటు చేశారు.. మార్చి 30న జరగాల్సిన ఆ సభను కాలాతీతం కావడంతో రద్దు చేశారు. శనివారం జరగబోయే బహిరంగసభను విజయవంతం చేయడానికి పార్టీ ముఖ్యులంతా శ్రమిస్తున్నారు. సాధారణంగా ఎల్బీ స్టేడియం కెపాసిటీ 40 వేలు.. జనం కిక్కిరిసిపోతే జన సామర్థ్యం 75వేలు అవుతుంది.. అయితే స్టేడియం నిండితే సరిపోదని టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం భావిస్తోంది.. స్టేడియంలో అవతల కూడా జనం పోటెత్తాలని అనుకుంటోంది.. కనీసం రెండు నుంచి రెండున్నర లక్షల మందిని సభ కోసం సమీకరించాలని నిర్ణయించింది. ప్రతి డివిజన్‌ నుంచి కనీసం మూడు వేల మందిని ఈ సభకు తరలించాల్సిందిగా స్థానిక నాయకత్వానికి పిలుపు వెళ్లింది.. లాల్‌బహదూర్‌స్టేడియం చుట్టుపక్కల ఉండే గోషామహల్‌, ఖైరతాబాద్‌, అంబర్‌పేట, ముషీరాబాద్‌ నియోజకవర్గాల నుంచి పాదయాత్రలుగా ప్రజలను తరలించబోతున్నారు. కోవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ సభను నిర్వహిస్తున్నారు.. సభకు వచ్చేవారి కోసం రెండు లక్షల మాస్కులను సిద్ధం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ కోసం లాల్‌బహదూర్‌ స్టేడియంలో మూడు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో ప్రధాన వేదిక నుంచి కేసీఆర్‌ ప్రసంగిస్తారు. అదే వేదికపై టీఆర్‌ఎస్‌ ప్రముఖులు ఆసీనులవుతారు.. కుడివైపున ఉన్న వేదికను కళాకారుల ప్రదర్శన కోసం ఏర్పాటు చేస్తే, ఎడమవైపున ఉన్న వేదికపై జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కూర్చుంటారు. స్టేడియం లోపల, వెలుపల ఆరు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సభ మొదలవుతుంది.. ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరిస్తాయి.. ఆ తర్వాత కేసీఆర్‌ ప్రసంగం ఉంటుంది.. మొత్తంగా సాయంత్రం ఆరు గంటలకు సభను ముగించేలా షెడ్యూల్‌ రూపొందించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం మామూలుగా సాగడం లేదు.. అధికార, విపక్షాలు ఈ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకున్నాయి.. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో హైదరాబాద్‌లో రాజకీయ వేడి తారస్థాయికి చేరుకుంది.. శనివారం ఇటు ప్రధాని నరేంద్రమోదీ రాక, అటు కేసీఆర్‌ సభతో పొలిటికల్‌ టెంపరేచర్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ పురోగతిని పరిశీలించేందుకే ప్రధానమంత్రి వస్తున్నప్పటికీ ఆయన ఎంచుకున్న సమయమే కాసింత ఆసక్తిని రేపుతోంది. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న శాస్త్రవేత్తలతో ప్రధాని ముచ్చటిస్తారు.. వివరాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత పుణె పర్యటనకు వెళతారు. కేసీఆర్‌ సభ రోజునే ప్రధాని నరేంద్రమోదీ అధికారిక పర్యటన ఉండటంతో రాజకీయ వర్గాలలో విపరీతమైన ఆసక్తి నెలకొంది.. ఓ వ్యూహం ప్రకారమే బీజేపీ అధినాయకత్వం మోదీ పర్యటనను ఖరారు చేసిందని కొందరు అంటున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ చివరి అస్త్రంగా ప్రధాని మోదీని నగరానికి తీసుకొస్తున్నట్టు చెబుతున్నారు. స్థానిక మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా మోదీ పర్యటనకే అధిక ప్రాధాన్యత ఇస్తాయి కాబట్టి కేసీఆర్‌ సభకు అంత ప్రచారం జరగకపోవచ్చని బీజేపీ అనుకుంటోంది.. మోదీ పర్యటన ద్వారా అంతో ఇంతో ఎన్నికలలో లబ్ధి పొందాలన్నది బీజేపీ వ్యూహం కావచ్చు. ప్రధాని మోదీ అధికారిక పర్యటన కోసం నగరానికి వస్తే ప్రొటోకాల్‌ ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కేసీఆర్‌ లాల్‌బహదూర్‌ స్టేడియంలో జరిగే బహిరంగసభకు వచ్చే అవకాశాలున్నాయి.