కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. అధికారులతో రివ్యూ మీటింగ్‌..

CM KCR Kaleshwaram Tour: తెలంగాణ రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తూ.. గోదావరి పరవళ్లను తెలంగాణ జిల్లాలకు దారి మళ్లిస్తూ చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి ముఖ్యమంత్రి..

 • Narender Vaitla
 • Publish Date - 1:58 pm, Tue, 19 January 21
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. అధికారులతో రివ్యూ మీటింగ్‌..

CM KCR Kaleshwaram Tour: తెలంగాణ రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తూ.. గోదావరి పరవళ్లను తెలంగాణ జిల్లాలకు దారి మళ్లిస్తూ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్‌ రావు నేడు (మంగళవారం) కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలో ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం మరికాసేపట్లో రివ్యూ మీటింగ్‌ నిర్వహించనున్నారు. అధికారులు, ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరబాద్‌ తిరుగు ప్రయాణం కానున్నారు.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 19 Jan 2021 13:58 PM (IST)

  సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చించే అంశాలివే…

  మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మేడిగడ్డ క్యాంప్‌ ఆఫీసుకు బయలుదేరారు. భోజనం చేసిన తర్వాత సీఎం అధికారులు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో.. ‘ప్రస్తుతం బ్యారేజీలో అందుబాటులో ఉన్న జలాలు ఎన్ని, ఎగువ నుంచి ఎంత నీరు వస్తుంది. రోజుకి ఎన్ని టీఎమ్‌సీల నీరును పంపింగ్‌ చేయొచ్చు.. వేసవిలో కూడా పూర్తి స్థాయిలో రిజర్వాయర్‌లో నీరు ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి.? పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరును ఎలా అందించాలన్న’ అంశాలపై కేసీఆర్‌ చర్చించనున్నారు.

 • 19 Jan 2021 13:09 PM (IST)

  రబీ సీజన్‌కు సాగునీరు అందేలా చూడమని ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి…

  కాళేశ్వరంలో ప్రాజెక్టు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ ప్రస్తుతం మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. అదే విధంగా రబీ సీజన్‌కు సాగునీరు అందేలా చర్యలు తీసుకోమని సీఎం అధికారులను ఆదేశించారు. మరి కాసేపట్లో అధికారులు, ఇంజనీర్లతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

 • 19 Jan 2021 13:02 PM (IST)

  మేడిగడ్డ బ్యారేజ్‌ వద్ద అధికారులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌..

   

  మేడిగడ్డ బ్యారేజ్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌ బ్యారేజ్‌ను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులతో చర్చిస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్‌లో నీటి మట్టం 100 అడుగులకు చేరుకుంది. దీంతో దాదాపు 5 నెలల తర్వాత ఎత్తి పోతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మేడిగడ్డ బ్యారేజ్‌ అత్యంత ముఖ్యమైందనే విషయం తెలిసిందే.

 • 19 Jan 2021 12:54 PM (IST)

  లక్ష్మీ బ్యారేజ్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌..

  కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నేరుగా సందర్శించడానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌ కాసేపటి కిత్రమే లక్ష్మీ బ్యారేజ్‌ చేరుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో బ్యారేజ్‌ను ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలిస్తున్నారు.

 • 19 Jan 2021 12:33 PM (IST)

  ఏరియల్‌ వ్యూ ద్వారా పంప్‌ హౌజ్‌ పరిశీలించనున్న కేసీఆర్‌..

  కాలేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు బయలు దేరిన సీఎం కేసీఆర్‌ కాసేపట్లో ఏరియల్‌ వ్యూ ద్వారా కన్నెపల్లి పంప్‌ హౌజ్‌ను పరిశీలించనున్నారు. అనంతరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను సీఎం సందర్శించనున్నారు.

 • 19 Jan 2021 12:30 PM (IST)

  ప్రాజెక్టు పరిశీలనకు బయలుదేరిన కేసీఆర్‌..

  ముక్తేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారిని దర్శించుకున్న కేసీఆర్‌ ప్రాజెక్టు పనుల పరిశీలనకు బయలుదేరారు. దేవాలయం నుంచి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి అధికారులతో ప్రత్యేక బస్సులో వెళుతున్నారు. ఈ క్రమంలో మొదట లక్మీ బ్యారేజీని సందర్శించనున్నారు.

 • 19 Jan 2021 11:56 AM (IST)

  కేసీఆర్‌ దంపతులను ఆశీర్వదించిన ఆలయ పూజారులు..

  ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న కేసీఆర్‌ దంపతులను వేద పండితులు ఆశీర్విదించారు. పట్టు వస్త్రాలతో పాటు ప్రసాదం అందజేశారు. సీఎం మరికాసేపట్లో అధికారులతో ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లనున్నారు. సుమారు 40 నిమిషాల పాటు కేసీఆర్ ఆలయంలో ఉండనున్నారు.

 • 19 Jan 2021 11:43 AM (IST)

  ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి..

  కాలేశ్వరం చేరుకునున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలేశ్వరం ముక్తేశ్వర క్షేత్రంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, కొప్పులు ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ కాలేశ్వరం చేరుకున్నారు.

 • 19 Jan 2021 11:28 AM (IST)

  కాలేశ్వరం చేరుకున్న కేసీఆర్‌..

  కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలేశ్వరం చేరుకున్నారు. హెలిప్యాడ్‌ నుంచి బస్సులో ముక్తేశ్వర స్వామి దేవాలయనికి చేరుకున్నారు. వేదపండితులు కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రస్తుతం కేసీఆర్‌ దేవాలయంలో ఆయన భార్యతో పాటు దేవుడుని దర్శించుకుంటున్నారు.

 • 19 Jan 2021 10:59 AM (IST)

  కాసేపట్లో కాళేశ్వరం చేరుకోనున్న సీఎం కేసీఆర్‌..

  హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కాలేశ్వరం బయలుదేరిన కేసీఆర్‌ కాసేపట్లో కాలేశ్వరం చేరుకోనున్నారు. మొదట సీఎం కాలేశ్వరం దేవాలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం ఏరియల్‌ వ్యూ ద్వారా కన్నెపల్లి పంప్‌ హౌజ్‌ పరిశీలించనున్నారు.

   

 • 19 Jan 2021 10:51 AM (IST)

  కాళేశ్వరం బయలుదేరిన కేసీఆర్‌.. ఆయనతో పాటు..

  కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ కాసేపటి క్రితమే హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. ప్రగతి భవన్‌ నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకున్న కేసీఆర్‌ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కాళేశ్వరం బయలుదేరారు. ఈ పర్యటకు కేసీఆర్‌తో పాటు ఆయన వెంట ఎమ్మెల్సీ, రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌ రెడ్డి కూడా వెళ్లారు.

 • 19 Jan 2021 10:02 AM (IST)

  దాదాపు నాలుగు గంటల పాటు అక్కడే…

  కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్న కేసీఆర్‌ అధికారులతో మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించనున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు కేసీఆర్‌ అధికారులతో కలిసి ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించనున్నారు. అనంతరం సాయంత్రం కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం కానున్నారు.

 • 19 Jan 2021 09:33 AM (IST)

  నీటి తరలింపును ప్రత్యక్షంగా వీక్షించనున్న కేసీఆర్‌…

  కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. దాదాపు 5 నెలల విరామం తర్వాత మేడిగడ్డ వద్ద మళ్లీ నీటిని ఎత్తి పోయన్నారు. ముఖ్యమంత్రి ఈ నీటి తరలింపు ప్రక్రియను స్వయంగా వీక్షించనున్నారు.