బంగారం లాంటి భవిష్యత్‌ని నాశనం చేసుకుంటున్నారు: చిరు
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత బంగారం లాంటి భవిష్యత్‌ని నాశనం చేసుకుంటోందని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత బంగారం లాంటి భవిష్యత్‌ని నాశనం చేసుకుంటోందని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పలువురితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో పాల్గొన్న చిరంజీవి.. ప్రపంచవ్యాప్తంగా యువత మత్తు పదార్థాలకు బానిస అవ్వడం మనసును కలిచివేస్తోందని అన్నారు. డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేయటానికి పూనుకున్న డీజీపీ సవాంగ్ నిర్ణయం గొప్పదని ఆయన చెప్పుకొచ్చారు. ఇందుకు సహకారంగా మీటింగ్‌లో పాల్గొన్న అందరినీ స్వాగతిస్తున్నానని తెలిపారు.
”మనిషి జన్మ ఎన్నో జన్మల పుణ్య ఫలితం. ఇంత అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్తవ్యస్తం చేసుకోవడం అవసరమా..? క్షణికానందం కోసం నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంత వరకు న్యాయం..? మత్తుకు బానిసైన వారిని చూసి కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించండి. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే మీరు ఆనందపడతారా..? బాధ్యతగా వ్యవహరిస్తే అందరి జీవితం సంతోషంగా ఉంటుంది” అని చిరు చెప్పుకొచ్చారు. ఇక ఈ కాన్ఫరెన్స్‌లో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, విద్యార్థి విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సవాంగ్ అవగాహన కార్యక్రమాల బ్రోచెర్‌ను విడుదల చేశారు.