గేదె యజమాని ఎవరు? తేల్చేందుకు డీఎన్ఏ పరీక్ష
బిహార్ గయా జిల్లాలో గేదె యాజమాన్య వివాదం డీఎన్ఏ పరీక్ష దాకా వెళ్లింది. సూరజ్ యాదవ్, ప్రకాశ్ మాంఝీ ఇద్దరూ గేదె తమదేనని పోలీసులను ఆశ్రయించారు. వివాదం పరిష్కారం కాకపోవడంతో మగధ్ రేంజ్ ఐజీ వికాస్ వైభవ్ డీఎన్ఏ పరీక్షకు ఆదేశించారు. పరీక్ష పూర్తయ్యే వరకు గేదెను పోలీసుల అధీనంలో ఉంచాలని సూచించారు.

బిహార్‌లో ఓ గేదె యాజమాన్య వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరి, చివరకు డీఎన్ఏ పరీక్ష దాకా వెళ్లింది. గయా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గేదె అసలు యజమాని ఎవరో నిర్ధారించేందుకు మగధ్ రేంజ్ ఐజీ వికాస్ వైభవ్ డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గయా జిల్లాలోని అతరీ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన సూరజ్ యాదవ్‌కు చెందిన గేదె కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సూరజ్ ఆందోళన చెందాడు. ఈ క్రమంలో నౌరంగా టోలీలోని ప్రకాశ్ మాంఝీ తన ఇంటి వద్ద ఓ గేదెను కట్టేసి ఉంచారనే సమాచారం అతడికి తెలిసింది.
దీంతో సూరజ్ అక్కడికి వెళ్లి ఆ గేదె తనదేనని పేర్కొన్నాడు. అయితే ప్రకాశ్ మాంఝీ కూడా గేదె తనదేనంటూ చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. విషయం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఇద్దరూ గేదెపై తమకే హక్కు ఉందంటూ వాదించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఎవరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలో స్పష్టత రాకపోవడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.
దీంతో మగధ్ రేంజ్ ఐజీ వికాస్ వైభవ్ గేదెకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష పూర్తయ్యే వరకు గేదెను పోలీసుల అధీనంలోనే ఉంచాలని ఎస్పీకి సూచించారు. గేదె తల్లిదండ్రుల సంబంధాన్ని డీఎన్ఏ పరీక్ష ద్వారా ధ్రువీకరించి, యాజమాన్యాన్ని నిర్ధారించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో ఈ విచిత్ర వివాదానికి శాస్త్రీయ ఆధారాలతో పరిష్కారం లభించనుంది.
