AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్లగూబల గూళ్లలో సజీవ పాములు.. ప్రకృతి వింతపై శాస్త్రవేత్తల పరిశోధన!

ప్రకృతిలో జీవుల నడుమ అనేక వింతలు, పరస్పర సహకార బంధాలు దాగి ఉన్నాయి. సాధారణంగా గుడ్లగూబలు పాములను ఆహారంగా వేటాడతాయి. కానీ, ఇటీవల వైరల్‌గా మారిన కొన్ని వార్తల్లో గుడ్లగూబలు, పాముల మధ్య ఒక విచిత్రమైన సహజీవనం వెలుగులోకి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో యురేషియన్ స్కోప్స్ ఓవల్ అనే చిన్నపాటి గుడ్లగూబలు తమ గూళ్లలో సజీవంగా ఉన్న పాములను పెంచుకుంటున్నట్లు తేలింది.

గుడ్లగూబల గూళ్లలో సజీవ పాములు.. ప్రకృతి వింతపై శాస్త్రవేత్తల పరిశోధన!
Snakes Inside Owl Nests
Jyothi Gadda
|

Updated on: Aug 27, 2026 | 6:46 AM

Share

ప్రకృతిలో అనేక వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. సాధారణంగా గుడ్లగూబలు పాములను తమ ఆహారంగా వేటాడుతుంటాయి. అయితే, టర్కీలో గుడ్లగూబలు, పాముల మధ్య ఒక విచిత్రమైన, సహకార బంధం వెలుగులోకి వచ్చింది. మధ్య టర్కీ ప్రాంతంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో యురేషియన్ స్కోప్స్ ఓవల్ అనే చిన్నపాటి గుడ్లగూబలు తమ గూళ్లలో సజీవంగా ఉన్న పాములను ఉంచుకుంటున్నట్లు తేలింది.

పరిశోధకులు దాదాపు ఆరు సంతానోత్పత్తి కాలాల పాటు 109 గుడ్లగూబ గూళ్లను నిశితంగా పరిశీలించారు. ఈ క్రమంలో దాదాపు 44శాతం గూళ్లలో క్సెరోటైఫ్లాప్స్ వెర్మికులరిస్ రకానికి చెందిన చిన్న గుడ్డి పాములు సజీవంగా కదులుతూ కనిపించాయి. గుడ్లగూబలు వేటాడిన ఇతర జీవులను చంపి తింటాయి. కానీ, ఈ చిన్న పాములను మాత్రం చంపకుండా ప్రాణాలతోనే తమ గూటికి మోసుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు గమనించారు.

ఈ ప్రక్రియ వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గుడ్లగూబ గూళ్లలో మిగిలిపోయిన ఆహార వ్యర్థాలు, రెట్టల వల్ల చీమలు, హానికరమైన ఈగల లార్వాలు, ఇతర పరాన్నజీవులు చేరతాయి. ఇవి చిన్న పిల్ల గుడ్లగూబల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. గూటిలోకి తెచ్చిన ఈ గుడ్డి పాములు గూటిలోని వ్యర్థాల్లో ఉండే లార్వాలను, పురుగులను ఆహారంగా తింటాయి. దీనివల్ల గూడు శుభ్రపడటమే కాకుండా, పరాన్నజీవుల బారి నుండి పిల్ల గుడ్లగూబలు రక్షణ పొందుతాయి.

ఇవి కూడా చదవండి

ఈ విచిత్ర కలయిక వల్ల గుడ్లగూబల పిల్లలకు ఎంతో మేలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పాములు ఉన్న గూళ్లలో గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్లలలో దాదాపు 61శాతం పిల్లలు ఆరోగ్యంగా పెరిగి ఎగిరిపోగలిగాయి. పాములు లేని గూళ్లలో పిల్లల మనుగడ రేటు కేవలం 29శాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం.

ఈ పాములు గుడ్లగూబల పిల్లలకు ఎలాంటి హాని చేయవు. అలాగే, గూటిలో దొరికే పురుగులు పాములకు ఆహారంగా ఉపయోగపడతాయి. గతంలో ఉత్తర అమెరికాలోని స్క్రీచ్ ఓవల్స్ లో మాత్రమే కనిపించిన ఈ విచిత్ర ప్రవర్తన, ఇప్పుడు టర్కీలోని యురేషియన్ స్కోప్స్ గుడ్లగూబలలో కూడా నిరూపితమైంది. ఇది కేవలం అనుకోకుండా జరుగుతున్న సంఘటన కాదని, గుడ్లగూబలు తమ పిల్లల రక్షణ కోసం పరిణామ క్రమంలో నేర్చుకున్న ఒక ప్రత్యేకమైన తంత్రమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ప్రకృతిలో జీవుల మధ్య ఉండే ఈ పరస్పర సహకారం శాస్త్ర రంగాన్ని సైతం అబ్బురపరుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us