బాబు తానా అంటే.. పవన్ తందానా.. బొత్స మాట్లాడితే నవ్వులే!
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో మరోసారి నవ్వులు పండించారు. ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని పోలీసులే ఖూనీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో...
Botsa fires on Chandrababu and Pawan Kalyan: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో మరోసారి నవ్వులు పండించారు. ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని పోలీసులే ఖూనీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో మీడియా మందుకొచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుడ్డారు. బొత్స మార్కు పంచులను విన్న మీడియా ప్రతినిధులు నవ్వుల్లో తేలిపోయారు.
పచ్చకామెర్ల వారిలా తయారైంది చంద్రబాబు వ్యవహారం అంటూ పత్రికాసమావేశాన్ని మొదలు పెట్టిన బొత్స.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల కంటే ఇప్పుడు చాలా బాగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏపీలో ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు బొత్స. ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా జరుగుతుంటే.. ఎక్కడో జరిగిన చిన్న చిన్న తప్పిదాలను చంద్రబాబు భూతద్దంలో చూపుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు ఎంత ఉసిగొల్పిన వైసీపీ నేతలు మాత్రం శాంతియుతంగా వ్యవహరిస్తున్నారని, అందుకే 98 శాతం సీట్లలో వైసీపీ నేతలు విజయం సాధించబోతున్నారని బొత్స వ్యాఖ్యానించారు. ‘‘ చంద్రబాబు తానా.. అంటే పవన్ కళ్యాణ్ తందానా..’’ అంటూ వత్తాసు పలుకుతున్నారని బొత్స ఆరోపించారు. ‘‘చంద్రబాబూ..! ఇకనైనా మీ దుశ్చర్యలను ఆపండి.. దురాలోచనతో వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించటమే చంద్రబాబు లక్ష్యం.. చంద్రబాబు ఉత్తరకుమార ప్రగల్భాలు ఆపండి.. పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న టీడీపీ నాయకులు ఇప్పుడు బయటకు వస్తున్నారు.. మీ అకృత్యాలు చూడలేక పార్టీని వదులుతున్నారు..’’ అంటూ చంద్రబాబు నుద్దేశించి ఆయన మాట్లాడారు.