AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్మార్ట్‌ఫోన్ యుగంలో పెరుగుతున్న ‘నిశ్శబ్ద హంతకి’! ప్రాణాలు కాపాడుకోవడానికి నిపుణులు చెబుతున్న సలహాలు..

ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం అంటే కుటుంబం ఒకరిని శాశ్వతంగా కోల్పోవడమే. కారణం ఏదైనా కావచ్చు.. అది ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు.. దానికి పరిష్కారం మాత్రం ఆత్మహత్య కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి మానసిక ఆరోగ్యం ఎంతో ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతారు.

స్మార్ట్‌ఫోన్ యుగంలో పెరుగుతున్న ‘నిశ్శబ్ద హంతకి’! ప్రాణాలు కాపాడుకోవడానికి నిపుణులు చెబుతున్న సలహాలు..
Depression.jpg
Nikhil
|

Updated on: Feb 16, 2026 | 10:05 PM

Share

ఆధునిక సదుపాయాలు మనిషికి సౌకర్యాన్ని ఇస్తున్నాయి కానీ, మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నాయి. ఒకప్పుడు సమస్య వస్తే పది మందితో పంచుకునే వారు ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ, పక్కనున్న వారితో మాట్లాడటమే మరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే మనిషి ఒంటరిగా మారిపోతున్నాడు. తన సమస్యను ఎవరికీ చెప్పుకోలేక, లోపల ఉన్న బాధను పది మందికి తెలిస్తే నామోషీగా భావిస్తూ డిప్రెషన్ లోకి జారుకుంటున్నాడు. ఇది ఎంతటి స్థాయికి చేరుతోందంటే.. చివరకు ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారం అని నమ్మేలా చేస్తోంది.

డిప్రెషన్​ అంటే..

చాలామంది డిప్రెషన్ ను కేవలం ఒక మూడ్ ఆఫ్ అని లేదా కొద్దిసేపు ఉండే బాధ అని అనుకుంటారు. కానీ మానసిక వైద్య నిపుణుల ప్రకారం ఇది చాలా తీవ్రమైన జబ్బు. ఇది మెదడులోని రసాయనాల అసమతుల్యత వల్ల కలుగుతుంది. మనిషిలో ఉత్సాహం, శక్తి, కాంతి ఒక్కోటిగా తగ్గిపోతూ వస్తాయి. ఏ విషయంలోనూ ఆసక్తి ఉండదు. ఎప్పుడూ విచారంగా ఉండటం, భవిష్యత్తుపై ఆశ కోల్పోవడం దీని ప్రధాన లక్షణాలు. డిప్రెషన్ లో ఉన్న వ్యక్తి సాధారణ వ్యక్తుల్లా ఉండలేడు. వారు అందరిలో ఉన్నా ఒంటరిగానే కనిపిస్తారు. వారి బాడీ లాంగ్వేజ్ లో చాలా మార్పు వస్తుంది.

లైంగిక వేధింపులు, ఆర్థిక సమస్యలు, ప్రియమైన వారిని కోల్పోవడం లేదా దీర్ఘకాలిక అనారోగ్యం వంటివి డిప్రెషన్ కు దారి తీస్తాయి. వీరు తరచూ చిరాకు పడుతూ, తాము ఈ లోకానికి విలువ లేని వారమని భావిస్తూ ఉంటారు. ఈ దేశంలో జరిగే ఆత్మహత్యలలో 60 నుంచి 65 శాతం కేవలం డిప్రెషన్ వల్లనే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ స్థితిలో ఉన్న వారు పదే పదే మరణం గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఈ జన్మను ఇక్కడితో ఆపేస్తే మరో కొత్త జన్మలో అన్నీ బాగుంటాయని గట్టిగా నమ్ముతారు. చావు మాత్రమే తమ బాధలకు శాశ్వత పరిష్కారం అని భావించి అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు.

చికిత్స, పరిష్కారం..

  • డిప్రెషన్ లక్షణాలను మొదట్లోనే గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు.
  • వెంటనే మానసిక వైద్యులను సంప్రదించి కౌన్సిలింగ్ ఇప్పించాలి.
  • ఇలాంటి వారిని అస్సలు ఒంటరిగా వదలకూడదు. వారితో నిరంతరం మాట్లాడుతూ ఆత్మవిశ్వాసాన్ని నింపాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఇతరులతో సన్నిహితంగా ఉండటం వల్ల మెదడులో సానుకూల మార్పులు వస్తాయి.
  • మద్యం మత్తును ఇస్తుంది అనుకుంటారు కానీ, అది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.

మనిషిని మనిషిగా ప్రేమించడం, ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడటం మర్చిపోకూడదు. ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తున్నారంటే వారిని గేలి చేయకుండా, వారి మనసులోని బాధను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. డిప్రెషన్ అనేది చికిత్సతో నయమయ్యే జబ్బు అని గుర్తించాలి.

Follow Us