బెంగాల్ ను గుజరాత్ రాష్ట్రంలా కానివ్వం, బీజేపీ ఆటలు సాగనివ్వం. కోల్ కతా ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ గర్జన
బెంగాల్ ను గుజరాత్ రాష్ట్రంలా కానివ్వబోమని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇక్కడ బీజేపీ ఆటలు సాగనివ్వబోమని హెచ్ఛరించారు.
బెంగాల్ ను గుజరాత్ రాష్ట్రంలా కానివ్వబోమని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇక్కడ బీజేపీ ఆటలు సాగనివ్వబోమని హెచ్ఛరించారు. బయటివారెవరైనా వచ్చి ఈ రాష్ట్రాన్ని గుజరాత్ లా మారుస్తామంటే గట్టి సమాధానం చెబుతామని అన్నారు. నిన్న కోల్ కతా లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆమె.. ఇక్కడిది జీవ భూమి అని, ఈ బెంగాల్ గడ్డను పరిరక్షించాల్సి ఉందని చెప్పారు. బీజేపీని బయటి పార్టీగా, ఆ పార్టీ నేతలను బయటి వ్యక్తులుగా తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి విదితమే. అందుకే బయటివారు అని దీదీ పదేపదే ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ మతాల వారిని చీల్చాలనే కుట్ర జరుగుతోంది. కానీ ఆ ప్రయత్నాలను ఎదుర్కొంటాం, ఇక్కడి సిక్కులు, జైనులు, క్రైస్తవులు, ముస్లిములు అంతా కలిసికట్టుగా ఉంటారు, వారిలో చీలికలు తెచ్చెందుకు ఎవరైనా యత్నిస్తే సహించబోమని కూడా ఆమె హెచ్చరించారు.
హోమ్ మంత్రి అమిత్ షా ఇటీవల బెంగాల్ లో పర్యటించినప్పుడు ఈ రాష్ట్రాన్ని గుజరాత్ లా మారుస్తామని ప్రకటించారు. అయితే ఇది మా రాష్ట్రం, దీన్ని అలా మార్చనివ్వం అన్నారు దీదీ. నాకు ట్రీట్ ఇస్తానని అమిత్ షా అన్నారు. కానీ ఢోక్లా వంటి గుజరాతీ ఫుడ్ ని నేను తినాలనుకుంటున్నా అని ఆమె పరోక్షంగా తిప్పికొట్టారు. మరి కొన్ని నెలల్లో బెంగాల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో తృణమూల్, బీజేపీ మధ్య పోటాపోటీ ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. బీజేపీ కార్యకర్తలపై ఓ వైపు దాడులు జరుగుతుండగా మరోవైపు వారిలో వారే ఎటాక్ లకు పాల్పడుతూ ఆ దాడులను తమపై నెడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.