వేలంపాట లేకుండానే శోభాయాత్ర మొదలైన బాలాపూర్ గణేషుడు

కరోనా ప్రభావంతో గణేష్ నవరాత్రి ఉత్సవాల కళతప్పింది. ఊరేగింపులు, లడ్డూ వేలం పాటలు లేకుండానే సాదాసీదాగా సాగిపోతున్నాయి. ప్రతీ ఏడాది ఎంతో ఉత్సహంగా జరిగే బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలాన్ని ఉత్సవ కమిటీ ఈసారి రద్దు చేసింది.

వేలంపాట లేకుండానే శోభాయాత్ర మొదలైన బాలాపూర్ గణేషుడు
Follow us

|

Updated on: Sep 01, 2020 | 10:25 AM

కరోనా ప్రభావంతో గణేష్ నవరాత్రి ఉత్సవాల కళతప్పింది. ఊరేగింపులు, లడ్డూ వేలం పాటలు లేకుండానే సాదాసీదాగా సాగిపోతున్నాయి. ప్రతీ ఏడాది ఎంతో ఉత్సహంగా జరిగే బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలాన్ని ఉత్సవ కమిటీ ఈసారి రద్దు చేసింది. కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో లడ్డూ వేలాన్ని రద్దు చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. మరోవైపు పోలీసుల నిబంధనల ప్రకారం బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. బాలాపూర్ నుంచి మొదలైన యాత్ర హుస్సేన్ సాగర్ తో ముగియనుంది. 18 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. మరోవైపు గత ఏడాది వేలం పాటలో లడ్డూను దక్కించుకున్న భక్తుడు..ఆ నగదును దేవాలయానికి సమర్పించారు. బాలాపూర్ గణనాథుడిని చివరిసారిగా దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.

వినాయక చవితి అంటే ఒకటి ఖైరతాబాద్‌ వినాయకుడి ఎత్తు గురించి మాట్లాకుంటే.. రెండోది బాలాపూర్‌ లడ్డూ వేలం పాట గురించే మాట్లాడుకుంటారు. బాలాపూర్‌ గణేషుడి లడ్డూని సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. మహాగణపతి మహా ప్రసాదం రికార్డు స్థాయిలో పలుకుతుంది. గతేడాది బాలపూర్‌ లడ్డూ ఏకంగా 17 లక్షల 67వేలు పలికింది. 2018లో 16 లక్షల 60వేలు పలికింది. బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమై 26 ఏళ్లు పూర్తి అయింది. 1994లో వేలం ప్రక్రియ మొదలైంది. అప్పటి నుంచి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తొలిసారి బాలాపూర్‌ లడ్డూ 450 పలికింది. బాలాపూర్‌ లడ్డూ సొంతం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందన్న భక్తుల నమ్మకంతో వేలంపాట లక్షల్లో జరిగేది. ఈసారి మాత్రం కరోనా ప్రభావంతో ఏకంగా లడ్డూ వేలాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

లడ్డూ వేలాన్ని రద్దు చేయడంతో పాటు బాలాపూర్‌ వరసిద్ధి వినాయకుడి ఎత్తు కూడా తగ్గించారు. ఈసారి 6 అడుగుల ఎత్తులోనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పెద్దగా భక్తులను కూడా అనుమతించలేదు. బాలాపూర్‌ గణేషుడి నిమజ్జనానికి పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉత్సవ కమిటీ విగ్రహాన్ని ఊరేగిస్తోంది. నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు దొర్లకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు.