అబ్దుల్‌ సలాం కేసులో నిందితులుకు బెయిల్‌ రద్దు.. ఆ ఇద్దరికి 14 రోజుల రిమాండ్..కర్నూలు సబ్‌జైలుకు తరలింపు

కర్నూలు జిల్లా నంద్యాలలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్‌ సలాం కేసులో.. నిందితులుగా ఉన్న పోలీసులిద్దరికీ బెయిల్‌ రద్దయింది. సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్..

అబ్దుల్‌ సలాం కేసులో నిందితులుకు బెయిల్‌ రద్దు.. ఆ ఇద్దరికి 14 రోజుల రిమాండ్..కర్నూలు సబ్‌జైలుకు తరలింపు
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 02, 2020 | 11:44 PM

కర్నూలు జిల్లా నంద్యాలలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్‌ సలాం కేసులో.. నిందితులుగా ఉన్న పోలీసులిద్దరికీ బెయిల్‌ రద్దయింది. సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్ గంగాధర్ నంద్యాల కోర్టులో హాజరయ్యారు. వాళ్లిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. నిందితుల అభ్యర్థన మేరకు వాళ్లను కర్నూలు సబ్‌జైలుకు తరలించాలని జస్టిస్‌ ప్రసన్నలత ఆదేశించారు. హైడ్రామా మధ్య వాళ్లిద్దరినీ మీడియా కెమెరాలకు చిక్కకుండా సబ్‌జైలుకు తరలించారు పోలీసు అధికారులు.

తాను చేయని తప్పునకు పోలీసులు హింసిస్తున్నారంటూ కొన్నాళ్ల క్రితం అబ్దుల్‌ సలాం.. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన అత్త మాబున్నిసా ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అప్పటి వన్‌టౌన్‌ సీఐ సోమశేఖర్‌ రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌లను నిందితులుగా చేర్చారు. నాలుగు సెక్షన్లు నమోదు చేశారు. అయితే.. సెక్షన్‌ 303 తొలగించడం.. పదో తేదీన వారికి బెయిల్‌ రావడం.. వివాదాన్ని పెద్దది చేసింది.

సలాం ఫ్యామిలీ సూసైడ్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితులకు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేయాల్సి వచ్చింది. సెక్షన్‌ 306 కూడా చేర్చాలంటూ కర్నూలు కోర్టును ఆశ్రయించారు. 8 సార్లు వాయిదా తర్వాత.. గత నెల 30న వాళ్లిద్దరికీ బెయిల్‌ రద్దయింది. ఇవాళ జరిగిన విచారణలో.. నాటి సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌కు రిమాండ్ విధించింది న్యాయస్థానం.