అసోంలో బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ ఎత్తులు.. ఐదు పార్టీలతో మహాకూటమి ఏర్పాటు

ఈ ఏడాది దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడు పెంచింది.

అసోంలో బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ ఎత్తులు.. ఐదు పార్టీలతో మహాకూటమి ఏర్పాటు
Follow us

|

Updated on: Jan 20, 2021 | 7:20 PM

2021లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసోం అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ అప్పుడే పావులు కదుపుతోంది. ఒకవైపు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విస్తరించుకుంటూపోతోంది. మరోవైపు పార్టీ జాతీయ స్థాయితో పాటు ప్రాంతీయంగా చతికిలాపడుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా అసోం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తలపడేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఇదే క్రమంలో ఐదు పార్టీలతో జతకట్టి ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బరుద్దీన్ అజ్మల్ సారధ్యంలోని ఆల్ ఇండియా యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్)తో పాటు ఐదు పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

అసోంలో బీజేపీని దెబ్బతీయడమే లక్ష్యంగా తాము మహాకూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌ పార్టీలు సంయక్తంగా ప్రకటించాయి. ఈ కూటమిలో ఈ రెండు పార్టీలతో పాటు నాలుగు లెఫ్ట్ పార్టీలు కూడా భాగస్వామ్యం కానున్నాయి. గువాహటిలో ఏర్పాటు చేసిన ఒక మీడియా సమావేశంలో కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), అంచలిక్ గణ మోర్చా నేతలు తమ ఆరు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. అసోం ప్రజల సంక్షేమం కోరి తామంతా కలసి పోటీచేస్తున్నట్లు ప్రకటించాయి. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఆ పార్టీని ఓడించేందుకు తమ కూటమితో జతకట్టాలని కోరాయి.

Read Also… NITI innovation index: నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ – 2020 జాబితా విడుదల.. మరోసారి నాలుగో స్థానంలో తెలంగాణ