Godavari Boat Accident: పగబట్టిన గోదావరి..ప్రాణాలు తీస్తున్న ప్రమాదాలు

Godavari Boat Accident:  పగబట్టిన గోదావరి..ప్రాణాలు తీస్తున్న ప్రమాదాలు

విధి వారిపై పగబట్టింది. పోటెత్తిన గోదారి ఒక్కసారిగా మింగేసింది. అప్పటివరకు నవ్వుతూ కనిపించిన వారంతా ఒక్కసారిగ చెల్లాచెదురయ్యారు. గోదావరి నదిలో ఆహ్లాదంగా సాగిపోతున్న విహార యాత్ర తమకు మరణయాత్రగా మిగులుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. స్నేహితులు, భార్యాభర్తలు, విద్యార్ధులు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 61 మంది ప్రకృతి ప్రేమికులు. పాపికొండల అందాలను చూడాలనుకుని రాయల్ వశిష్ఠ లాంచీ ఎక్కారు. అదే వారికి ఆఖరి ప్రయాణమవుతుందని పసిగట్టలేకపోయారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచలూరు వద్ద ఆదివారం […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 15, 2019 | 7:17 PM

విధి వారిపై పగబట్టింది. పోటెత్తిన గోదారి ఒక్కసారిగా మింగేసింది. అప్పటివరకు నవ్వుతూ కనిపించిన వారంతా ఒక్కసారిగ చెల్లాచెదురయ్యారు. గోదావరి నదిలో ఆహ్లాదంగా సాగిపోతున్న విహార యాత్ర తమకు మరణయాత్రగా మిగులుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. స్నేహితులు, భార్యాభర్తలు, విద్యార్ధులు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 61 మంది ప్రకృతి ప్రేమికులు. పాపికొండల అందాలను చూడాలనుకుని రాయల్ వశిష్ఠ లాంచీ ఎక్కారు. అదే వారికి ఆఖరి ప్రయాణమవుతుందని పసిగట్టలేకపోయారు.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచలూరు వద్ద ఆదివారం జరిగిన 61 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. గోదావరి అందాలను చూడాలనుకుని రాయల్ వశిష్ఠ అనే బోటులో వీరంతా ప్రయాణం చేస్తుండగా కచలూరు వద్దకు రాగానే బోటు ఒక్కసారిగా తిరగబడింది. అయితే బోటులో లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ అవి కాలంచెల్లినవిగా తేల్చారు. వాటిని ధరించినా ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. ఉధృతంగా ప్రహహిస్తున్న గోదావరికి ఎదురు వెళ్లే ప్రయాణమే పాపికొండల యాత్ర. తూర్పుగోదావరి నుంచి ప్రారంభమైన ఖమ్మం జిల్లా వరకు ఈ యాత్ర సాగుతుంది. మర్గ మధ్యలో కనిపించే ప్రకృతి అందాలను కళ్లారా చూడాలనే ఆశతోనే ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆదివారం రాయల్ వశిష్ఠలో ప్రయాణం చేసిన వారు కూడా అలాంటివారే. వరంగల్ నుంచి 14 మంది స్నేహితులం వచ్చామని, కళ్లముందే తాము ప్రయాణిస్తున్న లాంచీ మునిగిపోయిందని, కొంతమంది భయంతో పైకి ఎక్కారని, కొంతమంది నీటిలో మునిగిపోయారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఓ ప్రత్యక్ష సాక్షి.

అయితే శనివారం వరకు గోదావరి నదికి వరదనీరు ఉథృతంగా ప్రవహించడంతో పర్యాటక బోట్లకు అనుమతి నిరాకరించారు. అయితే ఆదివారం నుంచి పాపికొండల యాత్రకు పర్యాటక శాఖ అనుమతిని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డవారికి రంపచోడవరం ఏరియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా బోటులో ప్రయాణిస్తున్నవారిలో అత్యధికులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు ఉండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశారు.

ఆ మేఘాలే ముంచేశాయా?

ఆదివారం ఉదయం ఎప్పటిలాగే గోదావరిలో పర్యాటకులతో ప్రయాణమైన బోటు.. ఒక్కసారిగ ప్రమాదానికి గురికావడానికి గల కారణం వాతావరణ మార్పులే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతోనే బోటు బోల్తా పడిఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ తరచూ హెచ్చరికలు చేస్తూ ఆ సమాచారం గోదావరి తీరంలోని బోట్ల నిర్వాహకులకు అందుబాటులో ఉంచకపోవడమే ప్రమాదాలకు కారణం అవుతోందన్నారు. ఇదిలా ఉంటే ప్రమాదం సంబవించిన కచలూరు ప్రాంతంలో పెద్ద సుడిగుండం ఉందని దాన్ని దాటే క్రమంలో ఈ ప్రమాదం సంభవించిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గురైన బోటు రాయల్ వశిష్ఠ యజమాని వెంకటరమణ అభిప్రాయం ప్రకారం సుడిగుండం కారణంగానే బోటు ప్రమాదానికి గురైందని, తమ డ్రైవర్లు దాన్ని దాటలేకపోయారన్నాడు. ఈ ప్రమాదంలో బోటు డ్రైవర్లు ఇద్దరు కూడా తమ ప్రాణాలు కోల్పోయారు.

గోదావరిలో తరచూ ప్రమాదాలు

గోదావరిలో తరచూ బోటు బోల్తా వంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది 2018 మే నెలలో దేవీపట్నం నుంచి కొండమొదలుకు గిరిజనులతో వెళ్తున్న లాంచీ మంటూరు వద్ద మునిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది సజీవ జలసమాధి అయ్యారు. అదే ఏడాది 120 మంది యాత్రికులతో పాపికొండలు యాత్రకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం సంభవించింది. తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్న పర్యాటక శాఖ, జలవనరుల శాఖలతో పాటు ప్రైవేటు బోటు యజమానులు సరైన చర్యలు తీసుకోవడం లేదు. బోట్లలో సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి.

గోదావరిలో మునిగిపోయిన బోటు ప్రమాదంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ బోటు బోల్తా ఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు తన సంతాపాన్ని తెలిపారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమనంటూ విమర్శించారు. గోదావరిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చీకటి పడటం, గోదావరి ఉథృతంగా ప్రవహించడం గాలింపు చర్యలకు ఆటంకంగా మారింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu