AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎకానమీకి గడ్డు కాలం.. మోదీ ప్రభుత్వంపై మన్మోహన్ ధ్వజం

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మోదీ పాలనా తీరుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ అసమర్థ పాలన వల్లే దేశ ఆర్థిక పరిస్థితి ఇలా అయ్యిందన్నారు. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిపై మన్మోహన్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. స్థూల దేశీయోత్పత్తి 5శాతానికి పడిపోవడం చూస్తే మందగమన ప్రభావం కనిపిస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కారణం ప్రధాని మోదీ ప్రభుత్వ పనితీరేనని ఆరోపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి ఎదిగే అవకాశం ఉన్నా.. అసమర్థ నిర్వహణ […]

ఎకానమీకి గడ్డు కాలం.. మోదీ ప్రభుత్వంపై మన్మోహన్ ధ్వజం
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 01, 2019 | 1:33 PM

Share

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మోదీ పాలనా తీరుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ అసమర్థ పాలన వల్లే దేశ ఆర్థిక పరిస్థితి ఇలా అయ్యిందన్నారు. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిపై మన్మోహన్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. స్థూల దేశీయోత్పత్తి 5శాతానికి పడిపోవడం చూస్తే మందగమన ప్రభావం కనిపిస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కారణం ప్రధాని మోదీ ప్రభుత్వ పనితీరేనని ఆరోపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి ఎదిగే అవకాశం ఉన్నా.. అసమర్థ నిర్వహణ వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా ఉత్పాదక రంగం 0.6 శాతానికి పడిపోవడం ఆలోచించాల్సిన విషయమన్నారు. పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్), వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులో లోపాల ప్రభావం నుంచి దేశం ఇంకా బయటపడలేదన్నారు. అందుకు తాజాగా వెలువడిన నివేధికలే నిదర్శనమన్నారు. మోదీ హయాంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని.. కేవలం ఒక్క వాహన రంగంలోనే 3.5లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. అంతేకాదు అసంఘటిత రంగంలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. దేశీయ వినిమయం తగ్గిందని.. వినియోగ వృద్ధి రేటు 18నెలల కనిష్ఠానికి పడిపోయిందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం తీవ్ర ఇబ్బందులకు గురైందని.. ఆదాయం పడిపోవడంతో రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని మన్మోహన్ సింగ్ తెలిపారు.

అంతేకాదు ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి గల సంస్థల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.1.76 లక్షల కోట్ల నిధుల్ని బదిలీ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. బడ్జెట్‌ ప్రకటనలు, పథకాల అమలు తీరు విదేశీ ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. అంతర్జాతీయంగా పెరిగిన ఎగుమతుల అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. యువత, రైతాంగం, ఔత్సాహక పారిశ్రామికవేత్తలు ఇలా అన్ని రంగాల వారికి ప్రభుత్వం ఇంకా ఎంతో చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం రాజకీయాల్ని పక్కనబెట్టి నిపుణుల్ని, మేధావుల్ని సంప్రదించాలని సూచించారు.

Follow Us