బాలిక అత్యాచారం, హత్య.. నిందితుడు ప్రభాస్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు!
బరుయిపూర్ మైనర్ అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు ప్రభాస్ మోండల్ నేరస్థల పునర్నిర్మాణం సందర్భంగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, కాల్పుల్లో మరణించాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక కుటుంబ ఫిర్యాదుపై పోలీసుల స్పందనపై ప్రభుత్వం నివేదిక కోరింది.

పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన బరుయిపూర్ మైనర్ అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడిగా అరెస్టైన ప్రభాస్ మోండల్ నేరస్థల పునర్నిర్మాణం సందర్భంగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం కేసుకు సంబంధించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ప్రభాస్ మోండల్‌ను ఘటనాస్థలికి తీసుకెళ్లారు. ఈ సమయంలో అతడు ఓ పోలీసు అధికారి వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన మోండల్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ కేసు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయిపూర్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలిక మరణానికి సంబంధించినది. బాలిక కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే సూర్యపూర్ హాట్ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీయగా, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అనంతరం పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు ప్రకారం.. ఘటనకు ముందు నిందితుల్లో ఒకరు బాలికను ఓ గుడిసె వద్దకు తీసుకెళ్లగా, అక్కడ మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాక్షుల వాంగ్మూలాలు, సంఘటన స్థలంలో సేకరించిన ఆధారాలు, ఫోరెన్సిక్ పరీక్షల ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసే ప్రయత్నం కొనసాగుతోంది.
West Bengal | Prabhas Mondal, the accused in the Baruipur rape and murder case, killed in a police encounter. While the crime scene was being reconstructed, he attempted to snatch a weapon from the police and open fire at them. In retaliation, the police fired back, striking…
— ANI (@ANI) July 8, 2026
ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదికలో బాలిక ప్రాణాలతో ఉండగానే నీటిలో మునిగి మరణించినట్లు సంకేతాలు లభించినప్పటికీ, ఫోరెన్సిక్ పరీక్షలు, అంతర్గత అవయవాల విశ్లేషణ నివేదికలు వచ్చిన తర్వాతే మరణానికి గల కచ్చితమైన కారణాన్ని నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు. శరీరంపై గుర్తించిన గాయాలపై కూడా ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఎలా స్పందించారనే అంశంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌లతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో చట్టపరమైన విధానాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే, బాలిక అదృశ్యమైన విషయమై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఏమేరకు చర్యలు తీసుకున్నారనే అంశంపై 72 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించామని, నిర్లక్ష్యం నిర్ధారణ అయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
