AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోక్‌సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం

పేపర్ లీకులు, పరీక్షల అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026ను ప్రవేశపెట్టింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, కాలపరిమితితో దర్యాప్తు, కఠిన శిక్షలు, భారీ జరిమానాలు వంటి కీలక నిబంధనలు ఇందులో ఉన్నాయి.

లోక్‌సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
Union Minister Jitendra Singh
SN Pasha
|

Updated on: Jul 27, 2026 | 12:45 PM

Share

కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026ను ప్రవేశపెట్టింది. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా, అనంతరం లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. జూలై 20న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన సంసద్ చలో నిరసన కార్యక్రమంలో విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేశారనే ఆరోపణలపై ప్రతిపక్ష ఎంపీలు సభలో ఆందోళన కొనసాగించారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ నినాదాలు చేసినప్పటికీ, ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

బిల్లులోని కీలక సవరణలు ఇవే..

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్-2024లో ఏడు ప్రధాన సవరణలను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. పరీక్షా పేపర్ లీకులు, మాస్ కాపీయింగ్, సంఘటిత అవకతవకలపై మరింత కఠిన చర్యలు తీసుకోవడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఛార్జిషీట్ దాఖలు చేసిన మూడు నెలల్లోపు విచారణ పూర్తిచేయాలి. దర్యాప్తు రెండు నెలల్లోపు ముగించాలి. పరీక్షల నేరాల దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయవచ్చు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. నేరస్థులకు మరింత కఠినమైన జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధించే నిబంధనలు ప్రతిపాదించారు. హైకోర్టు డివిజన్ బెంచ్‌లలో కాలపరిమితితో కూడిన అప్పీల్ వ్యవస్థను కూడా బిల్లు సూచిస్తోంది.

వీడియో చూడండి

నాలుగు గంటల చర్చ

ఈ బిల్లుపై చర్చకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) నాలుగు గంటల సమయం కేటాయించింది. బీజేపీ తరఫున బన్సూరి స్వరాజ్, తేజస్వి సూర్యతో పాటు పలువురు యువ ఎంపీలు మాట్లాడే అవకాశం ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎంపీలు కూడా చర్చలో పాల్గొననున్నారు.

నీట్ పేపర్ లీక్‌ల తర్వాత కీలక ముందడుగు

నీట్-యూజీ పేపర్ లీక్‌లు, పరీక్షా అవకతవకలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బిల్లు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో, ఈ సవరణ బిల్లును ప్రభుత్వం పరీక్షా వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చే కీలక చర్యగా అభివర్ణిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us