ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో నిరాశ్రయులకు అండగా రియల్ హీరోస్..
ఎటుచూసిన నీళ్లే.. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక అస్సాంలో వేలాది కుటుంబాలు ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని విలవిలలాడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి విపత్తు సమయంలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు, సేవా భారతి కార్యకర్తలు అపద్బాందువుల్లా మారారు. పడవల్లో వెళ్తూ వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ నర సేవే నారాయణ సేవ అని నిరూపిస్తున్నారు.

అస్సాంను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. గ్రామాలు, ఇళ్లు నీట మునగడంతో శివసాగర్, జోర్హాట్ జిల్లాల్లోని వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కనీస ఆహారం, సురక్షితమైన తాగునీరు, ఆశ్రయం, వైద్య సహాయం దొరక్క విలవిలలాడుతున్న వరద బాధితులకు ఈ సంక్షోభ సమయంలో ఆర్ఎస్ఎస్ అండగా నిలిచింది. సంఘ్ స్వయంసేవకులు, సేవా భారతి కార్యకర్తలు ఆపద్బాంధవులుగా మారి ఆపదలో ఉన్నవారికి సాయం అందిస్తున్నారు. ఆశాజ్యోతిలా మారిన వీరి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతమైన బెట్బారిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటిలో చిక్కుకున్న సుమారు 200 మందికి పైగా ప్రజలను సురక్షితంగా రక్షించి పునరావాస శిబిరాలకు తరలించారు. వరద నీరు చుట్టుముట్టిన ఇళ్ల వద్దకు చిన్న చిన్న పడవల ద్వారా స్వయంసేవకులు స్వయంగా వెళ్లి వండిన ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో వీరు చేస్తున్న కృషి స్థానికుల ప్రశంసలు అందుకుంటుంది.
శివసాగర్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన సుందర్ పుఖురి, బామున్ పుఖురి, గెలెకి, రాజబారి ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న కుటుంబాలకు వండిన భోజనం, సురక్షితమైన తాగునీరు, మందులు, బట్టలు, ఇతర అత్యవసర సామాగ్రిని కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు. అలాగే జోర్హాట్ జిల్లాలోని అలెంగుమోర, కటిరామ్ చుక్, కులై చుక్, నలియా చుక్, సెంచోవా చుక్, చారిగారియా చుక్ గ్రామాల్లో తార్పాలిన్లు, బిస్కెట్లు, కొవ్వొత్తులు, దోమల నివారణ కాయిల్స్, సబ్బులు వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
నర సేవే నారాయణ సేవ
విపత్తు సమయాల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు శ్రమిస్తున్న స్వయంసేవకులు RSS అంటే రెడీ ఫర్ సెల్ఫ్‌లెస్ సర్వీస్ అని మరోసారి నిరూపించారు. ఇది కేవలం విపత్తు సహాయక చర్య మాత్రమే కాదని.. నర సేవే నారాయణ సేవ అనే స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమని స్థానికులు కొనియాడుతున్నారు. భయంకరమైన వరద ప్రవాహంలో, కష్టాల కడలిలో ఉన్న అస్సాంలోని ఎన్నో కుటుంబాలకు ఈ సేవకులు భరోసాను, మానవత్వాన్ని పంచుతున్నారు.
