ఇండోనేషియాతో భారత్‌కు కొత్త అధ్యాయం.. 20 కీలక ఒప్పందాలతో ద్వైపాక్షిక సంబంధాలకు మరింత బలం
ఇండోనేషియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఒప్పందాలతో భారత్-ఇండోనేషియా సంబంధాలకు కొత్త ఊపు తీసుకొచ్చారు. రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య, ఖనిజాలు, వాణిజ్యం తదితర రంగాల్లో 20 ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేయగా, రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన భారత్-ఇండోనేషియా సంబంధాల్లో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, డిజిటల్ టెక్నాలజీ, విద్య, మౌలిక సదుపాయాలు, ఖనిజాలు, సాంస్కృతిక వారసత్వం వంటి పలు కీలక రంగాల్లో మొత్తం 20 ఒప్పందాలు, అవగాహన పత్రాలు కుదిరాయి. దీంతో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడింది.
తన పర్యటన విశేషాలను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. “భారత్-ఇండోనేషియా స్నేహబంధం బలంగా, సజీవంగా కొనసాగుతోంది” అని పేర్కొన్నారు. ఇండోనేషియాలో తనకు లభించిన ఘన స్వాగతం, అక్కడి పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం, భారతీయ ప్రవాసుల నుంచి లభించిన అపూర్వ ఆదరణకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.
రక్షణ రంగంలో కీలక నిర్ణయాలు
ఈ పర్యటనలో రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యం లభించింది. ఇప్పటికే భారత్ తయారు చేసిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణులను వినియోగిస్తున్న ఇండోనేషియా.. మరిన్ని బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అలాగే భారత్ స్వదేశీగా అభివృద్ధి చేసిన అస్త్రా బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను (Astra BVRAAM) కూడా కొనుగోలు చేయనుంది. వీటిని ఇండోనేషియా సుఖోయ్-30 యుద్ధ విమానాల్లో అమర్చేందుకు భారత్‌కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) సహకరించనుంది. అదేవిధంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సబాంగ్ పోర్టు సంయుక్త అభివృద్ధికి కూడా రెండు దేశాలు అంగీకరించాయి.
డిజిటల్, ఆర్థిక రంగాల్లో భాగస్వామ్యం
భారత్ రూపొందించిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) నమూనాలో ఇండోనేషియాలో ION పేరుతో డిజిటల్ కామర్స్ నెట్‌వర్క్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అలాగే భారత్‌లో విజయవంతంగా అమలవుతున్న యూపీఐ (UPI) ఆధారిత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఇండోనేషియాలో అమలు చేసేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దీంతో ఇరు దేశాల మధ్య ప్రయాణికులు, వ్యాపారులకు సులభమైన డిజిటల్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఎన్నికల నిర్వహణలోనూ భారత సాంకేతికత
2029లో జరగనున్న ఇండోనేషియా సాధారణ ఎన్నికల కోసం ఆ దేశ అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVMs) రూపకల్పనలో భారత ఎన్నికల నిపుణులు సాంకేతిక సహాయం అందించనున్నారు.
ఖనిజాలు, పరిశ్రమల్లో సహకారం
ఉక్కు, నికెల్, రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి అవసరమైన రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ యూనిట్లలో భారత్ పెట్టుబడులు పెట్టనుంది.
విద్య, సాంస్కృతిక రంగాల్లో కొత్త అడుగులు
భారత ప్రముఖ విద్యాసంస్థ ఐఐఎం బెంగళూరు ఇండోనేషియాలో తన తొలి అంతర్జాతీయ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే చారిత్రక ప్రంబనన్ ఆలయం పునరుద్ధరణ, పరిరక్షణకు భారత్ సాంకేతిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు.
మోదీకి అత్యున్నత పౌర పురస్కారం
ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ’ను ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. భారత్-ఇండోనేషియా సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించారు.
‘మోదీకి నేను అభిమానిని’
భారతీయ ప్రవాసులతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో.. తాను ప్రధానమంత్రి మోదీకి గొప్ప అభిమానినని తెలిపారు. గత కొన్నేళ్లుగా మోదీ అమలు చేస్తున్న విధానాలను తాను దగ్గరగా గమనిస్తున్నానని చెప్పారు. అంతేకాకుండా, ఇటీవల తాను డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోగా భారతీయ మూలాలు ఉన్నట్లు తెలిసిందని సరదాగా వ్యాఖ్యానించారు. భారతీయ సంగీతం వినగానే తన శరీరం సహజంగానే స్పందిస్తుందని చెప్పడంతో సభలో నవ్వులు, చప్పట్లు వెల్లువెత్తాయి.
ప్రవాస భారతీయులకు మోదీ కృతజ్ఞతలు
జకార్తాలో భారతీయ ప్రవాసులు ఇచ్చిన ఘన స్వాగతానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. “జకార్తాలో జరిగిన కమ్యూనిటీ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ప్రవాస భారతీయులు చూపిన ప్రేమాభిమానాలు నన్ను ఎంతో కదిలించాయి” అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండోనేషియా అధ్యక్షుడు కూడా హాజరుకావడం.. రెండు దేశాల మధ్య ప్రజల స్థాయిలో ఉన్న స్నేహబంధానికి ప్రతీకగా నిలిచింది.
The India-Indonesia friendship is strong and vibrant! 🇮🇳 🇮🇩@prabowo pic.twitter.com/U57syfi670
— Narendra Modi (@narendramodi) July 8, 2026
