బాసర IIITలో విడ్డూరం.. భోజనంలో బొద్దింక కనిపిస్తే మెస్‌లో సెల్ ఫోన్లు తావొద్దంటూ నిషేధం!
ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీ మరో వివాదంలో చిక్కుకుంది. గత కొంత కాలంగా వివాదాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ ఆంక్షల చట్రంలో చిక్కుకున్న బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థుల పాలిట ఓ సర్కిలర్ శాపంగా మారింది. ఇక మీదట భోజనశాలల్లోకి విద్యార్థులు సెల్ ఫోన్ లతో వస్తే భోజనం పెట్టమని.. భోజనశాలల్లోకి విద్యార్థులు ఫోన్లు తేకూడదంటూ సర్కిలర్‌ను విడుదల చేయడం ఆందోళనకు కారణమైంది. పది రోజుల క్రితం క్యాంపస్ మెస్ లో ఆహారంలో బొద్దింక రావడం.. ఆ బొద్దింక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఆ ఘటనలో ఏడుగురు విద్యార్థులను విచారించిన యాజమాన్యం.. మెస్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి విద్యార్థులపై ఆంక్షలు విదించడం చర్చనీయాంశంగా మారింది..

బాసర, జూన్ 22: బాసర ఆర్జీయూకేటీలో కొన్ని రోజులుగా బొద్దింక వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయం మరో నిర్ణయం తీసుకుంది. భోజనశాలలో చరవాణులను నిషేధిస్తూ సర్క్యు లర్ జారీ చేసింది. దీనిపై విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, పూర్వ విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికే క్యాంపస్‌లో లోని అకాడమిక్ భవనాలు, తరగతి గదులు, ల్యాబ్‌లు, సెమినార్ హాల్స్, పరీక్ష కేంద్రాలు, గ్రంథాలయాల్లో ఫోన్ల నిషేధం కొనసాగుతుండగా ఆర్జీ యూకేటీ అధికారిక వెబ్ సైట్ లో తాజాగా మెస్సుల్లో కి సైతం నో మొబైల్ అలో అనే సర్క్యులర్ ను అందుబాటులో ఉంచింది. విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, విద్యార్థుల మధ్య ఆరోగ్యకర మైన సంభాషణను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యార్థి సంక్షేమ అధికారి (ఎస్ఈబ్యుఓ) ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోని భోజనశాలల్లో అపరిశుభ్రత, ఆహార పదార్థాల్లో నాణ్యత లోపం, ఆహారంలో పురుగులు వంటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్య మాల్లో వెలుగు చూస్తున్నాయి. ఇవి విశ్వవిద్యాలయం ప్రతిష్ఠతను దెబ్బతీస్తున్నాయని భావించిన యాజమాన్యం.. క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల మొబైల్ ఫోన్ క వినియోగం పై ఆంక్షలు విధించడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. సమస్యలకు కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోకుండా విద్యార్థులపై ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. పారదర్శకమైన పాలన ద్వారా మాత్రమే విద్యాసంస్థలు విశ్వసనీయతను నిలబెట్టుకోగలవని అభిప్రా యపడుతున్నారు. విద్యార్థులు భయంలేకుండా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే వాతావరణం కల్పించాలని సూచిస్తున్నారు. భోజనశాలల నిర్వాహకులకు మద్దతుగా నిలుస్తున్నారు తప్ప సమస్యలపై దృష్టి సారించడం లేదని ఓయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు సర్దార్ వినోద్ పేర్కొన్నారు. చర వాణుల నిషేధ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఆర్జీయూకేటీ భోజనశాలలోని అల్పాహారంలో తాజాగా బొద్దింక ప్రత్యక్షమైంది. ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. భోజనశాలలో పురుగులు వస్తున్నాయని, ఆహారంలో నాణ్యత లేదని విద్యార్థులు ఫిర్యాదులు చేసినా మార్పు మాత్రం కనిపించకపోగా ఉల్టా చోర్ కొత్వాల్ కు డాటే అన్నట్టుగా విద్యార్థులపై ఆంక్షలు విధించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో సుమారు 9వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరి భోజన వసతులకోసం క్యాంపస్ లిక నాలుగు భోజనశాలల న్నాయి. వీటిలో నాణ్యతతో కూడిన భోజనం అందజేయాలి. కానీ గత మూడేళ్లుగా నాణ్యత లేని భోజనమే విద్యార్థులు దిక్కవుతుంది. గత 2022, 2023 లో భోజనంలో నాణ్యత పాటించకపోవడంతో సుమారు 400 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయినా వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పట్లో మెస్ టెండర్ల రద్దు కోసం విద్యార్థులు ఆందోళన బాట పట్టినా ఫలితం లేకుండా పోయింది. కేవలం మెస్ యాజమాన్యం ఉపయోగించిన పాత్రలను సీజ్ చేశారే తప్ప టెండర్లు రద్దు చేయలేదు. గతంలో భోజనశాలల విషయంలో విద్యార్థులు పలుసార్లు ఆందోళన, నిరసనలు చేసినప్పుడు నూతన భోజనశాలల కోసం కమిటీలు వేసి వారిచ్చిన నివేదిక ఆధారంగా కొత్త వారికి టెండర్లు ఇస్తామని ప్రకటించారు. కానీ కమిటీలు ఏర్పాటు చేయకుండానే వారికి అనుకూలమైన వారికి టెండర్లు అప్పగించారు. కానీ కమిటీలు తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
ప్రతిరోజు భోజనశాల ఇన్ ఛార్థులు ఆయా మెస్ లను పర్యవేక్షించి అక్కడే భోజనం చేస్తారని అధికారులు చెబుతున్నా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా బొద్దింక ఘటనపై విచారణ జరిపి అదికారులు.. అసలు ఆ బొద్దింక ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయడం తప్ప చర్యలు తీసుకోలేదు. వంట గది అపరిశుభ్రంగా ఉండటం, సరకులు నిల్వ చేసే గదిని ప్రతి రోజు శుభ్రం చేయకపోవడంతో బొద్దింకలతో పాటు పురుగులు సంచరిస్తున్నా.. ఆ పురుగుల భోజనమే దిక్కవుతున్నా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తున్న విద్యార్థులకు ఇదిగోఇలా సర్కిలర్ ద్వారా ఫోన్లు తీసుకొస్తే పస్తులే అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.




