AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న భారత్.. ‘నీటి కటకట’తో ఉలిక్కి పడుతున్న ఇస్లామాబాద్!

సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి నీటి కోసం యుద్ధానికైనా సిద్ధమని వ్యాఖ్యానించగా, భారత్ మాత్రం ఉగ్రవాదం ఆగే వరకు తన వైఖరిలో మార్పు ఉండదని స్పష్టం చేసింది.

పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న భారత్.. 'నీటి కటకట'తో ఉలిక్కి పడుతున్న ఇస్లామాబాద్!
The Baglihar Dam
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Jun 22, 2026 | 10:23 AM

Share

భారత్-పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా ఉన్న సింధు జలాల ఒప్పందం ఇప్పుడు అత్యంత కీలక మలుపు తిరిగింది. సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు పాకిస్థాన్ ఉనికినే ప్రశ్నిస్తున్నాయి. నీటిని ఆయుధంగా మార్చుకున్న భారత్ నిర్ణయంతో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఏకంగా ‘యుద్ధం’ చేస్తామంటూ బెదిరింపులకు దిగడం గమనార్హం.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో మారుతున్న వ్యూహాత్మక సమీకరణాల మధ్య, భారత్-పాకిస్థాన్ సంబంధాలు మరో సమస్యాత్మక దశకు చేరుకున్నాయి. గతంలో సరిహద్దులకే పరిమితమైన వివాదం, ఇప్పుడు రెండు దేశాల మధ్య ప్రవహించే నదీ జలాల వరకు చేరింది. 1960 నాటి ‘సింధు జలాల ఒప్పందం’ (Indus Waters Treaty)పై భారత్ తీసుకున్న కఠిన నిర్ణయం పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

‘నీటి కోసం యుద్ధం’.. పాక్ మంత్రి హెచ్చరిక!

పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇటీవల ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ, “మా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లితే, అందులో నీరు కూడా ఒక కీలక భాగం. నీటి కోసం భారత్‌తో యుద్ధం చేసేందుకు కూడా మేము వెనుకాడము” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని నిరవధికంగా నిలిపివేయాలన్న భారత్ నిర్ణయంపై ఆయన ఈ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు వివాదం ఏంటి?

ఏప్రిల్ 2025లో జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భారత్ తన వైఖరిని మార్చుకుంది. “ఉగ్రవాదం-చర్చలు కలిసి ప్రయాణం సాగించవు” అని స్పష్టం చేస్తూ, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ‘సస్పెండ్’ చేసింది. సరిహద్దుల అవతల నుంచి ఉగ్రవాదం ఆగిపోయే వరకు నీటి పంపిణీపై ఎలాంటి చర్చలు ఉండవని భారత్ తేల్చిచెప్పింది.

పాకిస్థాన్‌కు ఎందుకు ఈ భయం?

సింధు నదీ వ్యవస్థ పాకిస్థాన్‌కు కేవలం నీటి వనరు మాత్రమే కాదు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు ‘లైఫ్ లైన్’.

వ్యవసాయ సంక్షోభం: పాకిస్థాన్‌లోని 90% పైగా పంటలు, ఆహార ఉత్పత్తి (గోధుమలు, వరి, పత్తి) సింధు బేసిన్ మీదే ఆధారపడి ఉన్నాయి. భారత్ నీటిని నిలిపివేస్తే అక్కడ కరువు, ఆకలి చావులు తప్పవు.

జీడీపీ (GDP)పై దెబ్బ: పాక్ ఆర్థిక వ్యవస్థలో 25% వాటా వ్యవసాయానిదే. భారత్ నీటిని కట్టడి చేస్తే ఆ దేశ జీడీపీలో 1.5% నుండి 2% వరకు పడిపోయే అవకాశం ఉంది.

విద్యుత్ అంధకారం: పాక్ హైడ్రోపవర్ విద్యుత్ ఉత్పత్తిలో 60% – 79% సింధు నదిపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా ‘తర్బేలా డ్యామ్’ (4,888+ MW) వంటి ప్రాజెక్టులు నిలిచిపోతే దేశమంతా చీకట్లోకి వెళ్లాల్సిందే.

చినాబ్ నదిపై భారత్ ‘ఫాస్ట్ ట్రాక్’ ప్రాజెక్టులు

ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో, భారత్ ఇప్పుడు చినాబ్ నదిపై తన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది:

చినాబ్-బియాస్ లింక్ టన్నెల్: రూ. 2,352 కోట్ల వ్యయంతో 8.7 కి.మీ పొడవైన టన్నెల్ నిర్మాణం.

సావల్‌కోట్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్: 1,856 MW సామర్థ్యంతో దాదాపు రూ. 5,129 కోట్లతో నిర్మాణం.

కిర్తై-II (930 MW), దులహస్తీ స్టేజ్-II (260 MW): ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇచ్చి వేగవంతంగా పనులు చేపడుతున్నారు.

ఇతర ప్రాజెక్టులు: పాకల్ దుల్, రత్లే మరియు కవార్ ప్రాజెక్టులు కూడా వేగంగా పూర్తవుతున్నాయి.

అంతర్జాతీయ వేదికలపై పాక్ ఆందోళన

ఈ వ్యవహారంపై పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) తలుపులు తట్టినప్పటికీ, భారత్ మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది. సింధు జలాలను తమ సొంత అభివృద్ధి కోసం, జాతీయ భద్రత కోసం వాడుకునే పూర్తి హక్కు భారత్‌కు ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తానికి, పాకిస్థాన్ తన ఉగ్రవాద అజెండాను ఆపకపోతే.. నీటి చుక్క కోసం కూడా అల్లాడాల్సిన పరిస్థితి వస్తుందని భారత పాలకులు హెచ్చరిస్తున్నారు.

Follow Us