Afghanistan Pakistan: అఫ్గాన్‌లో కొత్త కుట్రలకు తెరలేపిన పాకిస్తాన్.. ఆ పథకం పారిందా? ఉగ్రవాదుల జన్మస్థలమే..!

తాలిబన్ల చేతికి చిక్కడంతో ప్రపంచ దేశాలలో ఒంటరిగా మారిన అఫ్గానిస్తాన్‌తో పాకిస్తాన్ గేమ్స్ మొదలుపెట్టింది. ఏకంగా తమ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐని డైరెక్టుగా రంగంలోకి దింపింది. ఐఎస్ఐ చీఫ్ ఫియాజ్ హమీద్ స్వయంగా...

Afghanistan Pakistan: అఫ్గాన్‌లో కొత్త కుట్రలకు తెరలేపిన పాకిస్తాన్.. ఆ పథకం పారిందా? ఉగ్రవాదుల జన్మస్థలమే..!
Pakistan
Follow us

|

Updated on: Sep 07, 2021 | 7:36 PM

Afghanistan Pakistan conspiracy terror camps confirm: తాలిబన్ల చేతికి చిక్కడంతో ప్రపంచ దేశాలలో ఒంటరిగా మారిన అఫ్గానిస్తాన్‌తో పాకిస్తాన్ గేమ్స్ మొదలుపెట్టింది. ఏకంగా తమ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐని డైరెక్టుగా రంగంలోకి దింపింది. ఐఎస్ఐ చీఫ్ ఫియాజ్ హమీద్ స్వయంగా అఫ్గానిస్తాన్ చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించడమే కాకుండా.. కొరకరాని కొయ్యగా మారుతున్న పంజ్ షీర్ ఏరియా పోరాట యోధులను అణచివేయడంలో తాలిబన్లకు తోడ్పాటునందించాడు. దాంతో ఏడు జిల్లాలను కలిగి వున్న పంజ్ షీర్ ప్రావిన్స్ తాలిబన్ల హస్తగతమైంది. పంజ్‌షీర్ ప్రాంతంలో పోరాడిన అహ్మద్ మసూద్ దేశం విడిచిపారిపోయే పరిస్థితి తేవడానికి పాకిస్తానీ ఐఎస్ఐ.. తాలిబన్లకు సహకరించడమే కారణమని తెలుస్తోంది.

తాలిబన్ల సారథ్యంలో ఏర్పాటయ్యే ప్రభుత్వాన్ని గుర్తించేందుకు దాదాపు 99 శాతం ప్రపంచ దేశాలు సుముఖంగా లేకపోవడంతో అఫ్గానిస్తాన్ ఒంటరిదయ్యింది. దాంతో ఆ దేశాన్ని పీల్చి పిప్పి చేసేందుకు పాకిస్తాన్ పావులు కదుపుతోంది. తాము సూచించిన వ్యక్తులను అఫ్గాన్ ప్రభుత్వంలో కీలక స్థానాలలో నియమిస్తే.. ఆ తర్వాత అఫ్గానిస్తాన్‌ను ఉగ్రవాద సంస్థల పుట్టినిల్లుగా మార్చాలని పాకిస్తాన్ కుట్రలు చేస్తోంది. ఈ కుట్రల్లో భాగంగానే తాలిబన్లకు, ఇంతకాలం వారికి సహకరిస్తూ వచ్చిన హక్కానీ నెట్ వర్క్‌కు మధ్య చిచ్చు రాజేస్తోంది. దాంతో సెప్టెంబర్ 3వ తేదీన ప్రభుత్వ ఏర్పాటుపై జరిగిన సమావేశంలో తాలిబన్లు, హక్కానీ నెట్ వర్క్ ప్రతినిధులు తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో తాలిబన్ల కో-ఫౌండర్ అబ్దుల్ ఘనీ బరాదర్ గాయపడినట్లు సమాచారం.

గత పదిహేను రోజులుగా ఇదిగో ప్రభుత్వ ఏర్పాటు.. అదిగో ప్రభుత్వ ఏర్పాటు.. అంటూ సాగదీస్తున్న తాలిబన్లు.. తాజాగా హక్కానీ నెట్ వర్క్ నుంచి, పాకిస్తాన్ కుట్రల నుంచి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. కానీ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నిజానికి గత అయిదేళ్ళుగా తాలిబన్లను ఏకతాటిపై నడిపించిన హైబతుల్లా అఖుంద్‌జాదా.. దౌత్యపరంగా అమెరికా లాంటి దేశాలతో సమాలోచనలు జరిపిన తాలిబన్ల పబ్లిక్ ఫిగర్ అబ్దుల్ ఘనీ బరాదర్ల నాయకత్వాన్ని అంగీకరించేందుకు ప్రస్తుతం హక్కానీ నెట్ వర్క్ సిద్దంగా లేదు. హక్కానీ నెట్ వర్క్ ధోరణి మార్పునకు పాకిస్తాన్ కుట్రలే కారణమని తెలుస్తోంది. అత్యంత ప్రమాదకరమైన ఉగ్రగ్రూపుగా పేరున్న హక్కానీ నెట్ వర్క్.. అల్‌ఖైదాతో కూడా కలిసి పని చేస్తోంది. అటు ఇటీవల కాబుల్ ఏయిర్‌పోర్టు సమీపంలో బాంబు పేలుళ్ళకు పాల్పడిన ఐసిస్-కే వంటి సంస్థలతోను హక్కానీ నెట్ వర్క్‌కు సత్సంబంధాలున్నాయి.

తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకోవడంలో కీలక పాత్ర పోషించిన ‘బద్రి 313’ దళం హక్కానీ నెట్ వర్క్ అధినాయకత్వం కనుసన్నల్లోనే పని చేస్తోంది. ఇంకా చెప్పాలంటే.. హక్కానీ నెట్ వర్క్ పాకిస్తాన్ అనుకూల సంస్థగా పేర్కొనవచ్చు. అయితే.. తాజాగా ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధత ఏర్పడడానికి మాత్రం పాకిస్తాన్ కుట్రలే కారణమని తెలుస్తోంది. తాలిబన్ అధినేత, కాందహార్‌లో రహస్య జీవితం గడుపుతున్న హైబతుల్లా అఖుంద్‌జాదా నాయకత్వంపై కాస్తో కూస్తో డౌట్‌గా వున్న హక్కానీలను మరింత రెచ్చగొట్టిన పాకిస్తాన్.. వారిపుడు అఖుంద్‌జాదాను సుప్రీం లీడర్‌గా గుర్తించని లెవల్‌కు పాకిస్తాన్ తీసుకువెళ్ళింది. బరాదర్ విషయంలోను పాకిస్తాన్ వైఖరి వ్యతిరేకంగానే వుంది. గతంలో ఆయన్ను అరెస్టు చేసినపుడు పాకిస్తాన్ జైల్లోనే వుంచారు. దాంతో అఫ్గాన్‌లో తమ ప్రయోజనాలకు బరాదర్ అడ్డుపడే అవకాశం వుందని పాపిస్తాన్ అనుమానిస్తోంది.

తాలిబన్ల మిలిటరీ కమిషన్ అధినేత ముల్లా మహ్మద్ యాకుబ్, హక్కానీ నెట్ వర్క్ చీఫ్ సిరాజుద్దీన్ హక్కానీలు అఫ్గానిస్తాన్‌లో మిలిటరీ కనుసన్నల్లో నడిచే ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే తాలిబన్ల సైన్యం పూర్తిగా వారిద్దరి నియంత్రణలో వుంది. దాంతో మిలిటరీ కనుసన్నల్లో కొనసాగే ప్రభుత్వం ఏర్పాటైతే తమ నియంత్రణలో కొనసాగుందని వారిద్దరు భావిస్తున్నారు. సరిగ్గా ఇదే ప్రయోజనాన్ని ఆశిస్తున్న పాకిస్తాన్ హక్కానీలతో అంటకాగుతోంది. పాకిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా.. అక్కడి మిలిటరీ, ఐఎస్ఐ కనుసన్నల్లోనే పాలిస్తారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి అదే. ఈక్రమంలో అఫ్గానిస్తాన్‌లోను మిలిటరీ ప్రభుత్వం ఏర్పాటైతే.. పాకిస్తాన్ ఐఎస్ఐ నేరుగా అఫ్గాన్ వ్యవహారాలలో జోక్యం చేసుకునే అవకాశం వుంటుందని తెలుస్తోంది. అయితే.. తమ దేశ వ్యవహారాలలో పాకిస్తాన్ జోక్యాన్ని సహించమని తాలిబన్లలోని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వీరి వెనుక అఖుంద్‌జాదా, బరాదర్ వున్నారన్న అనుమానంతో పాకిస్తాన్ హక్కానీలను ఎగదోస్తోందని తెలుస్తోంది.

ఇంకోపక్క అబ్దుల్ ఘనీ బరాదర్‌ వర్గం దేశంలో వున్న సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు, యూదులు వంటి మైనార్టీలను కూడా ప్రభుత్వంలో చేర్చుకోవాలని భావిస్తోంది. కానీ, అధికారాన్ని పంచుకోవడానికి హక్కానీలు ఏమాత్రం ఇష్టపడటంలేదు. కాబుల్‌ను ఆక్రమించాం సో తమ ఆధిపత్యం మాత్రమే ప్రభుత్వంలో ఉండాలని వాదిస్తున్నారు. మరోపక్క కీలక నేత ముల్లా యాకుబ్‌ ఇంకా కాందహార్‌లోనే ఉన్నారు. అఫ్గానిస్తాన్ ‌నుంచి అమెరికన్ సేనల ఉపసంహరణ ప్రారంభం అయిన తర్వాత ఆ దేశంపై ఐక్యరాజ్యసమితి జూన్ నెలలో ఓ నివేదిక రూపొందించింది. ఈ పరిస్థితిని ముందే ఊహించిన యుఎన్ఓ అప్పుడే ఆందోళన వ్యక్తం చేసింది. హక్కానీ నెట్‌వర్క్‌ ఆధిపత్యం కొనసాగుతుందని చెప్పింది. తాలిబన్‌ నాయకత్వం తమ మధ్య అంతర్గత విభేదాలు లేవని బయటకు ఎన్నిసార్లు చెప్పినా.. వివిధ తెగల మధ్య గొడవలు, ఘర్షణలు, వనరుల కేటాయింపులు, మాదక ద్రవ్యాలపై ఆదాయం, కమాండర్లకు లభించే స్వతంత్ర అధికారాలు వంటి అంశాలపై అభిప్రాయభేదాలు ఉంటాయని పేర్కొంది. అయితే ఇన్ని విభేదాలు ఉన్నప్పటికీ వారి మధ్య ఐకమత్యం బలంగానే ఉంటుందని నివేదిక అంచనా వేసింది.

తాజాగా తాలిబన్‌ ప్రధానిగా ముల్లా హసన్‌ అఖుంద్‌ పేరు వినిపిస్తోంది. హసన్‌ పేరు యుఎన్ఓ రూపొందించిన టెర్రరిస్టుల లిస్టులో వుంది. దీనికి బరాదర్‌ నేతృత్వంలోని రాజకీయ బృందం, హక్కానీ నెట్‌వర్క్‌, ముల్లా యాకుబ్‌ నేతృత్వంలోని కాందహార్‌ వర్గం అంగీకరించినట్లు సమాచారం. తాలిబన్‌ సుప్రీం లీడర్‌గా అఖుంద్‌జాదా కొనసాగే అవకాశం ఉంది. ఆయన డిప్యూటీలుగా బరాదర్‌, ముల్లా యాకుబ్‌లు వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఇక అఫ్గాన్‌ ఇంటీరియర్‌ మినిస్టర్‌గా సిరాజుద్దీన్‌ హక్కానీ పేరు ముందుంది. పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ కనుసన్నల్లో హక్కానీ నెట్‌వర్క్‌కు అఫ్గాన్‌లోని కీలకమైన శాంతిభద్రతల బాధ్యతలు దక్కాయి. ఈ నెట్‌వర్క్‌కు ఐసిస్‌ ఖొరాసన్‌, అల్‌-ఖైదాతో సంబంధాలు ఉండటం విశేషం. కాబుల్‌ ఎయిర్‌పోర్టుపై దాడికి హక్కానీ నెట్‌వర్క్‌ సహకరించినట్లు ఆరోపణలున్నాయి. ముల్లా హసన్ అఖుంద్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైతే పాకిస్తాన్ కుట్రలు చాలా వరకు పారినట్లేనని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.