ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అధునాతన సేవలు

ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా చేరిన హైదరాబాద్ అన్నిహంగులతో ముస్తాబుతోంది. నగరానికి తలమానికంగా మారిన ఔటర్‌ రింగు రోడ్డు పరిసరాల రూపురేఖలు మారుతున్నాయి.

ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అధునాతన సేవలు
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 12, 2020 | 3:22 PM

ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా చేరిన హైదరాబాద్ అన్నిహంగులతో ముస్తాబుతోంది. నగరానికి తలమానికంగా మారిన ఔటర్‌ రింగు రోడ్డు పరిసరాల రూపురేఖలు మారుతున్నాయి. మరిన్ని సదుపాయాలతో పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో అధునాతన సేవలు అందుబాటులోకి తేవాలని హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించారు. రింగు రోడ్డులోని ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఖాళీ స్థలాల్లో పది నుంచి ఇరవై ఎకరాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రెస్ట్‌ అండ్‌ రిలాక్స్‌ సెంటర్లు, ఫ్యూయల్‌ స్టేషన్లు, షాపింగ్‌, పార్కింగ్‌, పిల్లలకు క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఔత్సాహిక సంస్థల కోసం హెచ్‌ఎండీఏ అధికారులు టెండర్లను కూడా పిలిచారు.

హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో భాగంగా హెచ్ఎండీఏ ఔటర్ రింగ్ ను అభివృద్ధి. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు, సరుకు రవాణా ట్రక్కులు హైదరాబాద్ ను టచ్ చేయకుండానే ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఓఆర్ఆర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా రింగు రోడ్డుపైకి వెళ్లే మార్గాలు, కిందకు వచ్చే ప్రాంతాలు ప్రయాణిలకు సేదతీర్చే కేంద్రాలుగా మారనున్నాయి. 158 కిలోమీటర్ల రహదారిలోని 19 ఇంటర్‌చేంజ్‌ల వద్ద వినూత్న రీతిలో అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఇటీవల నిర్వహించిన సమీక్షలో హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఔటర్‌లో వే సైడ్‌ ఎమినిటీస్‌ (రెస్ట్‌ అండ్‌ రిలాక్స్‌ సెంటర్లు, ఇతరత్రా రూపకల్పనలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.

ఔటర్‌ వెంబడి ఇంటర్‌చేంజ్‌ల వద్ద పీపీపీ పద్ధతిలో ‘మల్టీ ఫ్యూయల్‌ స్టేషన్స్‌ కమ్‌ వేసైడ్‌ ఎమినిటీస్‌’ ఏర్పాట్లకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే కార్యరూపంలోకి తీసుకు వచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఔటర్‌లోని 19 ఇంటర్‌చేంజ్‌లలో ప్రాథమికంగా ఎనిమిది చోట్ల ‘మల్టీ ఫ్యూయల్‌ స్టేషన్స్‌ కమ్‌ వే సైడ్‌ ఎమినిటీస్‌’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఔటర్‌ ఇంటర్‌చేంజ్‌ల వద్ద ప్రజల అవసరాలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జి, బ్యాటరీ ఛార్జింగ్‌ వంటి మల్టీ ఫ్యూయల్‌ స్టేషన్లతో పాటు ఫుడ్‌ కోర్టులు, వాష్‌రూమ్స్‌, లోకల్‌ హ్యాండీక్రాప్ట్స్‌ తదితర సదుపాయాలను దశల వారీగా ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతగా 8 చోట్ల ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పటాన్‌చెరు, మేడ్చల్‌, శామీర్‌పేట, ఘట్‌కేసర్‌, పెద్దఅంబర్‌పేట, బొంగుళూరు, నార్సింగి, పోలీ స్‌ అకాడమీ ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నట్లు సమాచారం. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.