ATM: ఏటీయంలో డబ్బులు డ్రా చేసేందుకు ఇబ్బంది పడ్డ తాత.. అక్కడ ఉన్న కేటుగాడు ఏం చేశాడంటే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ కేటుగాడు సాయం చేస్తానంటూ ఓ రిటైర్డ్ ఉద్యోగిని బురిడీ కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే భద్రాచలంలోని ఎంపీ కాలనీకి చెందిన నారాయణ అనే విశ్రాంత ఉద్యోగి గత నెల 27వ తేదీన నగదు అవసరమై స్థానికంగా ఉన్న ఓ ఏటీఎం సెంటర్ కి వెళ్ళాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ కేటుగాడు సాయం చేస్తానంటూ ఓ రిటైర్డ్ ఉద్యోగిని బురిడీ కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే భద్రాచలంలోని ఎంపీ కాలనీకి చెందిన నారాయణ అనే విశ్రాంత ఉద్యోగి గత నెల 27వ తేదీన నగదు అవసరమై స్థానికంగా ఉన్న ఓ ఏటీఎం సెంటర్ కి వెళ్ళాడు. ఏటీఎం కార్డు ద్వారా నగదు డ్రా చేసే సమయంలొ ఇబ్బందులు పడుతుండడంతో సాయం చేస్తానంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి అతని వద్దకు వచ్చి డబ్బులు డ్రా చేసి ఇచ్చాడు. వృద్ధుడీకి ఏటీఎం మీద అవగాహన లేదని గుర్తించిన ఆ కేటుగాడు.. అతనికి ఏటీఎం కార్డును మార్చి ఇచ్చాడు, ఇక అప్పటినుంచి అతని ఖాతాలో నగదును స్వాహా చేశాడు. మళ్లీ నగదు అవసరమై బ్యాంకుకు వెళ్లిన నారాయణకు అసలు విషయం తెలిసింది.
తన ఖాతాలో నుంచి 3 లక్షల రూపాయలు మాయమయ్యాయని, ఏటీఎం కార్డు మారిందని తన వద్ద ఉన్న కార్డు ఓ మహిళకు సంబంధించినదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఆ వృద్ధుడు అవాక్కయ్యాడు. జరిగిన మోసాన్ని కుటుంబ సభ్యులకు తెలుపగా వారు పోలీసులను ఆశ్రయించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ యూసఫ్‌గా గుర్తించారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టి అతడ్ని అరెస్టు చేశారు. అతను గతంలో కూడా అనేక నేరాలు చేశాడని.. ఏటీయం సెంటర్ల వద్ద అమాయకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతుంటాడని పోలీసులు తెలిపారు.ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని.. దీని అనంతరం అతనికి సంబంధించి మరిన్ని నేరాలు బయటపడే అవకాశం ఉందని తెలిపారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..