తండ్రి కళ్లెదుటే విషాదం.. గొర్రెపిల్లను కాపాడి.. ప్రాణాలు వదిలిన 11 ఏళ్ల బాలుడు..!
వరంగల్ జిల్లాలో అత్యంత హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. మూగజీవాన్ని కాపాడాలనే ఆ చిన్నారి తాపత్రయం, ఆ కుటుంబంలో ఎన్నటికీ తీరని ఘోర విషాదాన్ని నింపింది. వ్యవసాయ బావిలో పడ్డ గొర్రెపిల్లను రక్షించే క్రమంలో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఖానాపురం మండలం రంగాపురం గ్రామంలో జరిగింది ఈ ఘటన.

రంగాపురం గ్రామానికి చెందిన మల్లేశం కుమారుడు రాఘవ (11) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో, తండ్రికి ఆసరాగా ఉండేందుకు మల్లేశంతో కలిసి పొలానికి, గొర్రెల కాపలాకు వెళ్లాడు. ఆ సమయంలో ఒక గొర్రెపిల్ల ప్రమాదవశాత్తు గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో పడిపోయింది. నీటిలో కొట్టుమిట్టాడుతున్న ఆ మూగజీవాన్ని చూసి చలించిపోయిన రాఘవ, దాన్ని ఎలాగైనా కాపాడాలనే తొందరపాటుతో వెనకాముందూ ఆలోచించకుండా బావిలోకి దూకాడు.
బాలుడు బావిలోకి దూకడం గమనించిన తండ్రి మల్లేశం ఒక్కసారిగా ఆందోళనతో గట్టిగా కేకలు వేశాడు. ఆ అరుపులు విని చుట్టుపక్కల ఉన్న స్థానికులు, రైతులు హుటాహుటిన బావి వద్దకు చేరుకున్నారు. వారు వెంటనే స్పందించి గొర్రెపిల్లను సురక్షితంగా బయటకు తీశారు. అయితే, దురదృష్టవశాత్తు లోతు ఎక్కువగా ఉండటంతో రాఘవ నీటిలో మునిగిపోయి, అందరికీ అందనంత దూరంలో గల్లంతయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గొర్రెపిల్ల ప్రాణాలతో బయటపడినా, కళ్లముందే కొడుకు నీట మునిగిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వేసవి సెలవుల్లో అల్లరి చేస్తూ తిరగాల్సిన చిన్నారి ఇలా అనంత లోకాలకు వెళ్లడంతో రంగాపురం గ్రామం అంతా కన్నీరుమున్నీరవుతోంది. ఆ ఊరిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
వీడియో ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..